గత ఏడాది కాలంగా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 97 వేల మంది భారతీయులను అరెస్టు చేసినట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (UCBP) అధికారులు తెలిపారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఐదు రెట్లు పెరిగిందని వెల్లడించింది. తాజా అక్రమ వలసలకు సంబంధించి యూసీబీపీ డేటా విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం 2019-20లో 19,883 మంది, 2020-21లో 30,662 మంది, 2021-22 మధ్య 63,927 మంది అరెస్టు కాగా, 2022 అక్టోబరు నుంచి 2023 సెప్టెంబరు వరకు 96,917 మంది భారతీయులు అరెస్టయినట్లు యూసీబీపీ తెలిపింది. వీరిలో 30,010 మందిని కెనడా సరిహద్దుల్లో, 41,770 మందిని మెక్సికో బోర్డర్‌లో అరెస్టు చేసినట్లు తెలిపింది.
అరెస్టయిన వారిని నాలుగు కేటగిరీలుగా విభజించినట్లు తెలిపింది. మైనర్లతో కలిసి వచ్చేవారు, కుటుంబంగా వచ్చేవారు, ఒంటరిగా వచ్చే పెద్దలు, ఒంటరిగా వచ్చే పిల్లలు. 2022-23లో 84 వేల మంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించగా, 730 మంది పిల్లలు ఒంటరిగా వచ్చారని తెలిపింది. వీరంతా ఫ్రాన్స్ నుంచి మెక్సికోకు చేరుకుని అక్కడి నుంచి బస్సులను అద్దెకు తీసుకుని అమెరికా సరిహద్దులకు చేరుకుంటున్నట్లు గుర్తించామని అమెరికా సెనేటర్ జేమ్స్ లాంక్‌ఫోర్డ్ తెలిపారు.
అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించే వారంతా.. స్వదేశంలో తమకు రక్షణ లేదని చెబుతున్నారని లాంక్‌పోర్డ్ వెల్లడించారు. దీంతో అంతర్జాతీయ నిబంధనలకు లోబడి వారికి ఆశ్రయం కల్పించాల్సి వస్తోందన్నారు. ఏటా అమెరికాలోకి 20 లక్షల మంది అక్రమంగా ప్రవేశిస్తున్నారు. అమెరికాలో వీసా సమస్యలు కూడా అక్రమ వలసలు పెరగడానికి కారణం కావచ్చని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –