DailyDose

అంబానీకి బెదిరింపు మెయిల్‌ కేసు-నేర వార్తలు

అంబానీకి బెదిరింపు మెయిల్‌ కేసు-నేర వార్తలు

అంబానీకి బెదిరింపు మెయిల్‌ కేసు

రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి బెదిరింపు మెయిల్స్ వ‌స్తూనే ఉన్నాయి. తాము అడిగినంత ఇవ్వ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుందంటూ తాజాగా వ‌చ్చిన మెయిల్‌లో నిందితుడు పేర్కొన్నాడు. రూ. 400 కోట్లు ఇవ్వ‌క‌పోతే త‌మ వ‌ద్ద ఉన్న అత్యుత్త‌మ షూట‌ర్లు అంబానీని కాల్చేస్తార‌ని తెలిపాడు. గ‌తంలో మెయిల్ చేసిన షాదాబ్ ఖాన్ అనే వ్య‌క్తి నుంచే ఇప్పుడు కూడా బెదిరింపు మెయిల్స్ వ‌చ్చిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మెయిల్స్ అక్టోబ‌ర్ 31, న‌వంబ‌ర్ 1వ తేదీన వ‌చ్చిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.రూ. 20 కోట్లు ఇవ్వాల‌ని లేనిప‌క్షంలో అంబానీని చంపేస్తామ‌ని అక్టోబ‌ర్ 27న తొలి మెయిల్ వ‌చ్చింది. రెండు సంద‌ర్భాల్లోనూ ఈ త‌ర‌హా మెయిల్స్ రావ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై, మెయిల్స్ పంపిన వ్య‌క్తిపై కేసులు న‌మోదు చేశారు. తొలుత రూ. 20 కోట్లు డిమాండ్ చేసిన నిందితుడు.. దాన్ని రూ. 200 కోట్ల‌కు పెంచాడు. అంత‌టితో ఆగ‌కుండా రూ. 400 కోట్లు డిమాండ్ చేశారు. తాను పంపిన మెయిల్స్‌కు అంబానీ స్పందించ‌క‌పోవ‌డంతోనే రూ. 400 కోట్ల‌కు పెంచిన‌ట్లు తేలింది. గ‌తేడాది సైతం ఇలానే అంబానీని, ఆయ‌న కుటుంబాన్ని మట్టుబెడుతామ‌ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ నిర్వ‌హిస్తున్న ఆస్ప‌త్రికి ఫోన్ చేసి బెదిరింపుల‌కు గురి చేసిన సంగ‌తి తెలిసిందే.

మియాన్‌వాలి ఎయిర్ బేస్‌పై ఉగ్రదాడి

దాయాది దేశం పాకిస్థాన్‌లో ఉగ్రదాడి కలకలం రేపుతోంది. పాకిస్థాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌పై టెర్రరిస్టులు ఎటాక్ చేశారు. శనివారం తెల్లవారుజూమున మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌‌లోకి చొరబడ్డ ఆరుగురు ముష్కరులు విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన సైనికులు ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో సైనిక సిబ్బందితో పాటు, ఫైటర్ జెట్ పైలట్లు మృతి చెందినట్లు సమాచారం. ప్రస్తుతం సైనికులకు, టెర్రరిస్ట్‌లకు బీకర ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గరు మిలిటెంట్లు హతమైనట్లు అధికారులు తెలిపారు. మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌‌లోకి మరికొందరు ఉగ్రవాదులు సైతం చొరబడ్డట్లు సమాచారం. కాగా, ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఏ-జిహాద్ ఈ టెర్రర్ ఎటాక్‌కు పాల్పడినట్లు ప్రకటించింది. ఉగ్రవాదులు ఏకంగా ఎయిర్ బేస్‌పైనే దాడికి పాల్పడటంతో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదుల దాడితో ఎయిర్ బేస్‌లోని పలు విమానాలు ధ్వంసమైనట్లు సమాచారం.

చిత్తూరు నగరంలో సినీ ఫక్కీలో చోరీ

చిత్తూరు నగరంలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. శేషాపీరాన్ వీధిలోని కీర్తనా గోల్డ్ లోన్ కంపనీకి చెందిన సుమారు 22 లక్షల బంగారును కేటుగాళ్లు కొట్టేశారు. కంపెనీ నుంచి స్ట్రాంగ్ రూంకు రీజినల్ మేనేజర్ జాన్ బాబు బంగారు నగలను తరలించే క్రమంలో దుండగులు ఈ చోరీ చేశారు. నగలను తరలించే క్రమంలో చిత్తూరు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ హోటల్ దగ్గర కారు ఉంచి తను బస చేసిన హోటల్ గదిలోకి జాన్ బాబు వెళ్లారు.ఇక, జాన్ బాబు కారులోని 22 లక్ష రూపాయల విలువ గల బంగారు నగలు కొట్టేసిన దుండగులు పరారు అయ్యారు. దీంతో కీర్తనా గోల్డ్ లోన్ కంపెనీ రీజనల్ మేనేజర్ జాన్ బాబు చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేసన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి దొంగల పనేనా బయట వ్యక్తుల ప్రమేయం అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తిస్తున్నారు. ఈ దాడిలో ఐదు మంది వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వివిధ ముఠాలపై దృష్టి సారించి ప్రత్యేక టీంలను చిత్తూరు వన్ టౌన్ సీఐ ఏర్పాటు చేశారు.

* కొచ్చిలో కుప్పకూలిన నేవీ హెలీకాప్టర్‌

భారత నావికాదళానికి చెందిన చేతక్‌ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. నేవీకి చెందిన హెలీకాప్టర్‌ శనివారం మధ్యాహ్నం నేవీ హెడ్ క్వార్టర్స్‌లోని ఐఎన్‌ఎస్ గరుడ రన్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. పైలట్‌తో సహా ఇద్దరికి గాయపడ్డట్లు తెలుస్తున్నది. అలాగే, చాపర్ రోటర్ బ్లేడ్లు తగలడంతో రన్‌వేపై ఉన్న నౌకాదళ అధికారి మృతి చెందినట్లు సమాచారం. ఇద్దరు పైలట్లకు గాయాలైనట్లు ప్రాథమికంగా తెలుస్తున్నది. ఇద్దరిని నావికాదళ ప్రధాన కార్యాలయంలోని సంజీవని ఆసుప్రతికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కొచ్చి హార్బర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

మద్యం మత్తులో చోరీకి వెళ్లిన దొంగలు

మద్యం మత్తులో ఓ ఇంట్లో చోరికి వెళ్లిన దొంగల ముఠాకు కాలనీ వాసులు చుక్కలు చూపించడంతో, ప్రాణ భయంతో ముగ్గురు దొంగలు పరరయ్యారు. ఓ దొంగ మాత్రం దొరికిపోయాడు. ఆ దొంగను  బంధించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది..కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో ఉన్న అచ్చకట్ట వీధిలో ఓ ఇంట్లో చోరీ  చేయడానికి వచ్చిన నలుగురు దొంగలకు కాలనివాసులు చుక్కలు చూపించారు. గ్రామానికి చెందిన రహంతుల్లా పొలం పనుల నిమిత్తం కుటుంబ సభ్యులు అంతా కలిసి పొలానికి వెళ్లారు. అయితే నలుగురు దొంగలు ఫుల్ గా మద్యం సేవించి అటుగా వెళ్తూ తాళం వేసిన రహంతుల్లా ఇంటి తాళం పగలకొట్టి ఇంట్లో చొరబడ్డారు. లోపల ఉన్న బీరువాను పగలకొట్టగా ఆ శబ్దాలు చుట్టూ పక్కల వాళ్ళు విన్నారు.వెంటనే వెళ్లి చూస్తే అక్కడ నుండి ముగ్గురు దొంగలు పరారి కాగా ఓ దొంగ మాత్రం దొరికి పోయాడు. దీంతో  స్థానికులు ఆ దొంగను ఇంట్లోనే బంధించి దేహశుద్ధి చేశారు. తరువాత పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. అయితే రహంతుల్లా ఇంట్లో బీరువాలో పెట్టిన మూడు లక్షల నగదు, మూడు తులాల బంగారు, 20 తులాల వెండి దొంగలు ఎత్తుకొని వెళ్లినట్టు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మహారాష్ట్రలోని ఫార్మా కంపెనీలో భారీ పేలుడు

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలో నిన్న జరిగిన పేలుడు ఘటనలో మంటలు చెలరేగి ఏడుగురు సజీవ దహనం అయ్యారు. పలువురు గాయపడ్డారు. ఇంకా ఏవరైనా ఉన్నరేమో అని సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఇవాళ ఎన్‌డీఆర్ఎఫ్ అధికారి తెలిపారు. రాయ్ గఢ్ జిల్లాలోని మహద్ ఎంఐడీసీ వద్ద బ్లూ జెట్ హెల్త్‌కేర్‌ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆ కంపెనీకి అనుబంధంగా ఉన్న ఫ్యాక్టరీలో ఒక్క సారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఎన్‌డీఆర్ఎఫ్ బలగాలు వెంటనే అక్కడికి చేరుకోని మంటలను అదుపులోకి తెచ్చి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ లీకేజ్, షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇరాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం

ఇరాన్‌లో జరిగిన ఘోర అగ్రి ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మత్తు మందుల నుంచి బయటపడాలన్న మంచి ఆశయంతో మాదక ద్రవ్యాల పునరావాస కేంద్రంలో చేరిన బాధితులు అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో అంతులేని శోకాన్ని మిగిల్చింది. గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఏకంగా 32 మంది మృత్యువాత పడ్డారు. మరో 16 మంది గాయపడ్డారని ఇరాన్ మీడియా శుక్రవారం తెలిపింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో బాధితులు గదుల్లో చిక్కుకుపోయారు. మంటల ధాటికి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బాధితులు తప్పించుకునే మార్గం లేకుండా పోయినట్టు తెలుస్తోంది. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉత్తర గిలాన్ ప్రావిన్స్‌లోని లాంగరుడ్ నగరంలోని డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చెలరేగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని ఆ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ మొహమ్మద్ జలాయ్ తెలిపారు. సెంటర్‌ నిర్వాహకుడితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .

50 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్‌ లైంగిక వేధింపులు

విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ప్రిన్సిపల్‌ (Principal) కీచకుడయ్యాడు. పాఠశాలలోని సుమారు 50 మంది విద్యార్థినుల ( Schoolgirls)పై లైంగిక వేధింపులకు (Sexual Harassment) పాల్పడ్డాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రం జింద్‌ జిల్లా (Jind district)లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విద్యార్థులే స్వయంగా ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.జింద్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. స్వయంగా బాధిత విద్యార్థులే ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు చేశారు. అయితే, ఈ విషయంలో పోలీసులు అలసత్వం ప్రదర్శించడం పట్ల హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్‌ (Haryana State Commission for Women) ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాల విద్యార్థినుల ఫిర్యాదులను తాము సెప్టెంబర్‌ 14వ తేదీన పోలీసులకు పంపినట్లు తెలిపింది. అయితే అక్టోబర్‌ 30న చర్యలు తీసుకున్నట్లు కమిషన్‌ పేర్కొంది. ఫిర్యాదు చేసిన నెలన్నర తర్వాత ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది.