* బీజేపీ జనసేన పొత్తు ఖరారు
తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. కొద్ది రోజులుగా స్తానాలపై సందిగ్ధతలో ఉన్న పార్టీలు ఎట్టకేలకు పొత్తును ఫైనల్ చేసుకున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాల నుంచి జనసేన పోటీ చేయనుంది. ఈ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కాసేపట్లో ప్రకటించనుంది జనసేన.మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రయత్నాలు ఫలించాయి. పొత్తులో భాగంగా శేరిలింగం పల్లి టికెట్ జనసేనకు ఇచ్చే అవకాశాలున్నాయని వార్తలు రావడంతో ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. చేవెళ్ల పార్లమెంట్‌లో గెలవాలంటే.. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీనే బరిలోకి దిగాలని ఆయన కోరారు. దీంతో శేరిలింగం పల్లి స్థానాన్ని మినహాయించింది అధిష్టానం. GHMC పరిధిలోని కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరితో పాటు నాంపల్లి నుంచి జనసేనను బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనారోగ్యంతో హస్పటల్ లో చేరారు. నిన్నటి నుంచి దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఆయన వైద్య పరీక్షల్లో వైరల్ ఫీవర్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. అంతే కాకుండా జ్వరం తగ్గుముఖం పట్టేందుకు తగిన చికిత్స తీసుకోవాలని, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని హెల్త్ బులిటెన్ లో వెల్లడించారు. ఇక, వర్షాకాలం ప్రారంభం కాకముందే తమిళనాడులో జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతివారం వేలాది వైద్య శిబిరాలను తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తోంది. అక్కడ జ్వరానికి సంబంధించిన రుతుపవనాల ప్రభావాన్ని పరిశీలించి తగిన చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు.అయితే, సీఎం స్టాలిన్ నిరంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రారంభించడం, సమావేశాలు నిర్వహించడం వంటి పలు పనుల్లో నిమగ్నమై ఉండటం వల్లే ప్రస్తుతం ఆయన అనారోగ్యం పాలయ్యారని డాక్టర్లు తెలిపారు. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. అయితే, ఇవాళ సీఎం స్టాలిన్ చెన్నైలోని బీసెంట్ నగర్‌లో “నడపోమోమ్ నాళం ఉత్శోవే”ను ప్రారంభించాల్సి ఉండగా.. ఆ పథకాన్ని మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. ఇక, అనారోగ్య కారణాలతో ముఖ్యమంత్రి స్టాలిన్ కార్యక్రమానికి హాజరుకాలేదని ఆయన వెల్లడించారు. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి స్టాలిన్ సచివాలయంలో రెండు కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉండగా, చివరి క్షణంలో వాటిని రద్దు చేశారు.
* కవిత నెంబర్ తప్పక వస్తుంది
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం గోషామహాల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ‘ప్రస్తుతం దేశంలో వరల్డ్ కప్ జరుగుతోంది. ఇందులో మన టీం అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. అలాగే.. తెలంగాణ ఎన్నికల సందర్భంగా బ్యాట్స్‌మెన్‌గా పార్టీ జాతీయ నాయకత్వం నన్ను పంపింది’ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎంతో దోచుకుందని విమర్శించారు. రాజస్థాన్ సచివాలయంలో కోట్లు, కిలోల కొద్దీ బంగారం దొరికిందని గుర్తుచేశారు.విదేశాల నుంచి డబ్బులను ఎన్నికల కోసం తెప్పిస్తోంది.. వచ్చే ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. మహాదేవ్ యాప్ పేరిట కాంగ్రెస్ అవకతవకలకు పాల్పడుతోంది. మహాదేవ్ యాప్ పేరుతో దేవుడి పేరును చెడగొట్టారు. మహాదేవ్ యాప్ పేరిట 508 కోట్లు ఛతీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్‌కు అందాయని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ గ్యారెంటీలు వర్కవుట్ అవ్వడం లేదని.. అబద్ధపు కాంగ్రెస్.. అబద్ధపు గ్యారెంటీలని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్ల ఎంతోమంది మరణించారని అన్నారు. పార్లమెంట్‌లో సోనియా, కాంగ్రెస్ నేతలు ఎలా వ్యవహరించారో నాకు తెలుసని చెప్పారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ మంచి చేస్తారని అనుకుంటే ఆయన కూడా నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు.పదేళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్.. జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచిందని తీవ్రంగా సెటైర్లు వేశారు. తెలంగాణలో ఎంత తిన్నా సరిపోలేదని బిడ్డను ఢిల్లీకి పంపాడని సీరియస్ కామెంట్స్ చేశారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరి నంబర్ వస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా జైలుకు పోవాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గొప్పలు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజినీరింగ్ బ్లండర్ అని ఎద్దేవా చేశారు.
* పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి ప్రచారం
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డోలు కొట్టి మహిళలతో బతుకమ్మలు ఆడారు. మహిళలు ఘన స్వాగతం పలికి తమ గ్రామాలకు ఆహ్వానించారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తండాలను గ్రామాలుగా అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ దేనన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వారు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.
* కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై విచారణ చేపట్టాలి
కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడం గురించి ఇవాళ షర్మిల్ ఫైర్ అయ్యారు. తాను సంచలన ట్వీట్ చేశారు. పేరు గొప్ప ఊరు దిబ్బ లెక్కుంది దొరగారి కమీషన్ల కాళేశ్వరం దుస్థితి.. నా రక్తం, నా చెమట అని కల్లబొల్లి మాటలు చెప్పి..కట్టింది ప్రాజెక్ట్ కాదు పేక మేడ అని బయట పడ్డది.తెలంగాణ ప్రజల సంపద 1.27 లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినట్లు? ఏం ఉద్ధరించినట్లు? మేడిగడ్డ బ్యారేజ్ పై డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు మీ మెగా అవినీతికి,మెగా పనితనానికి నిదర్శనం.వందల ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండాల్సిన బ్యారేజ్ లు.. కట్టిన నాలుగేళ్లకే ముక్కలైన ఘనత ప్రపంచలోనే మన మెగా కేసీఆర్ కే దక్కింది.దాదాపు 80 వేల పుస్తకాలు చదివిన దొర మెగా ఇంజినీరింగ్ పనితనం ప్రపంచానికి తెలిసింది. లోపాలు కళ్లముందు కొట్టొచ్చినట్లు కనపడుతుంటే..దొర లక్ష కోట్ల దోపిడీ జనాలకు అర్థమైతుంటే.. బీటలు బారడం కామనట. నెర్రెలు రావడం సహజమట… ఇంతకాలం జనాలను మభ్యపెట్టింది చాలు కేసీఆర్ గారు. మీ దోపిడీ పాపం పండింది. మీ అవినీతికి కాలం చెల్లింది.తిన్నదంతా కక్కించే దాకా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు.కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వెంటనే ఒక దర్యాప్తు కమీషన్ ను వేయాలని..జరిగిన అవినీతిపై విచారణ తక్షణం చేపట్టాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది.
* ప్రచార ర్యాలీలో తేనెటీగల దాడి
తెలంగాణలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రావడంతో పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీల నేతలు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రచార ర్యాలీలో తేనెటీగలు దాడి చేశాయి. ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ప్రచార రథంపై ఉన్న ఆమె అప్రమత్తమై వెంటనే తన వాహనంలోకి వెళ్లి కూర్చున్నారు. మిగితావారంతా అక్కడి నుంచి పరుగు తీశారు. కాసేపటి తర్వాత తేనేటీగలు వెళ్లిపోయాక.. ప్రచారం ఆమె బయటకు వచ్చి ప్రచారం కొనసాగించారు. తేనెటీగల దాడిలో ఇద్దరు వ్యక్తులకు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది.
* ఈ సారి మరిన్ని కంపెనీలను తెలంగాణకు తీసుకువస్తాం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పరిశ్రమలు తరిలిపోతాయన్నారు కేటీఆర్. బెంగళూరులో పెట్టుబడులు పెట్టాలని డీకే శివకుమార్ ఫాక్స్‌కాన్ కంపెనీకి లేఖ రాశారని గుర్తు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూడు సారి అధికారం చేపట్టగానే మరిన్ని కంపెనీలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవిధంగా చర్యలు చేపడతామని వెల్లడించారు.
* రైతులను జగన్ మోసం చేశారు
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం, కరవు తాండవిస్తున్నా.. కేబినెట్ భేటీలో కనీస చర్చ లేదని దుయ్యబట్టారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. దోచుకోవడం, చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదుకే సీఎం జగన్ రెడ్డి తన సమయాన్ని వెచ్చిస్తున్నారన్న ఆయన.. కరవు మండలాల ప్రకటనలోనూ రైతులను సీఎం వైఎస్ జగన్ మోసం చేశారని విమర్శించారు. లక్షలాది ఎకరాల్లో కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నా కనీసం కేబినెట్ భేటీలో చర్చలేదు. 70 శాతం మంది ఆధార పడిన వ్యవసాయం రంగం పట్ల జగన్ రెడ్డి ఉదాసీన వైఖరికి ఈ ఘటన అద్దం పడుతోందన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కరవుతో ప్రజలు వలసబాట పడుతున్నది కనిపించడం లేదా? రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీరు అందక పడుతున్న అవస్థలపై కేబినెట్ లో చర్చించే తీరిక కూడా లేదా? వ్యవసాయ రంగంపై కనీస సమీక్ష కూడా లేకపోవడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు. కరవు తీవ్రంగా ఉంటే.. జగన్ రెడ్డి మొక్కుబడిగా 103 కరవు ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. రాష్ట్రంలో కరవుకు ప్రజలు బలవడానికి, రైతులు, రైతు కూలీల వలసలకు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దోపిడీ పరిపాలనే కారణం అంటూ ఆరోపణలు గుప్పిస్తూ.. ఓ ప్రకటన విడుదల చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.