బంగారం కొనుగోలు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని భారతీయులు.. ప్రత్యేకించి మహిళల నమ్మకం. అందుకే పెండ్లిండ్లతోపాటు పండుగలకూ బంగారం కొనుగోలు చేస్తుంటారు. ప్రత్యేకించి దంతేరాస్, దీపావళి, అక్షయ తృతీయ పండుగల సందర్భంగా భారతీయులు బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తున్నది. కానీ ఇప్పుడు డిజిటల్ గోల్డ్ వైపు మళ్లుతున్నారు. డిజిటల్ గోల్డ్ సురక్షితం కావడంతోపాటు ఫిజికల్ గోల్డ్ కంటే తేలిగ్గా కొనుగోలు చేయొచ్చు. మీ ఆర్థిక పరిస్థితులు, సౌలభ్యానికి అనుగుణంగా తేలిగ్గా డిజిటల్ బంగారం కొనుక్కోవచ్చు.. ఆన్ లైన్‌లో పొదుపు చేయొచ్చు.
ప్రతి ఆన్ లైన్ లావాదేవీలో కొన్న డిజిటల్ గోల్డ్.. ఫిజికల్ గోల్డ్‌తో సమానమైన విలువ కలిగి ఉంటది. కాకపోతే డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయాలంటే బ్యాంకులో సేవింగ్స్ ఖాతా, కరంట్ ఖాతా గానీ తప్పనిసరిగా ఉండాల్సిందే. మైనర్లు గానీ, బ్యాంకుల్లో ఎన్నార్వో ఖాతాల్లేని ప్రవాస భారతీయులు డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయడానికి రూల్స్ ఒప్పుకోవు.
మొబైల్ యాప్ ఆధారిత యూపీఐ పేమెంట్స్‌తో డిజిటల్ బంగారం కొనుగోలు చేయొచ్చు. గూగుల్ పే లేదా ఫోన్ పే, పేటీఎం, భారత్ పే తదితర యాప్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
మీరు గూగుల్‌పే ద్వారా కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే గూగుల్ పే ఓపెన్ చేసి.. న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అటుపై సెర్చ్ బార్‌లోకెళ్లి `గోల్డ్ లాకర్` కోసం సెర్చ్ చేయాలి.. తదుపరి గోల్డ్ లాకర్ మీద క్లిక్ చేయాలి. `బై` ఆప్షన్ టాబ్ ఓపెన్ చేసినప్పుడు మీరు చెల్లించాల్సిన పన్నుతోపాటు బులియన్ మార్కెట్‌లో ఫిజికల్ బంగారం ధర కనిపిస్తుంది. మీరు డిజిటల్ గోల్డ్ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించిన ఐదు నిమిషాలకు బంగారం ధర లాక్ అవుతుంది. కొనుగోలు చేశాక ధర పెరగడం గానీ, తగ్గడం కానీ కావచ్చు.
మీరు కొనుగోలు చేసే బంగారం మొత్తానికి సమానంగా బ్యాంకు ఖాతా ద్వారా (యూపీఐ పేమెంట్) గూగుల్ పేతో చెల్లించాలి. పేమెంట్ పద్దతి ఎంచుకుని `ప్రొసీడ్ టూ పే` ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ట్రాన్సాక్షన్ పూర్తయిన కొన్ని నిమిషాల్లోపు మీ బ్యాంక్ ఖాతా ఆన్ లైన్ లాకర్‌లో మీరు కొనుగోలు చేసిన బంగారం కనిపిస్తుంది. ఒకసారి డిజిటల్ గోల్డ్ కొనుగోలు ప్రక్రియ చేపడితే.. మధ్యలో రద్దు చేయడం కుదరదు. ఇష్టం లేకున్నా.. వద్దనుకున్నా మళ్లీ మార్కెట్ ధరకు విక్రయించవచ్చు.
మీ బంగారం కొనుగోలు ప్రక్రియ జయప్రదంగా పూర్తవ్వకుంటే మీరు పే చేసిన మొత్తం సొమ్ము మీ బ్యాంకు ఖాతాలో క్రెడిట్ అవుతుంది. మీ నివాస ప్రాంతం, తపాలా కోడ్ ఆధారంగా బంగారం ధరల్లో తేడా ఉంటుంది. కనీసం యూనిట్ నుంచి గరిష్టంగా ఎంత వరకైనా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయవచ్చు. ప్రతి రోజూ రూ.50 వేల లోపు బంగారం కొనుగోలు చేయొచ్చు. రూ.49,999 విలువ దాటితే మాత్రం `కేవైసీ` నిబంధనలు పాటించాల్సిందే.
👉 – Please join our whatsapp channel here –