Politics

తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదు

తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదు

కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. జలవిహార్‌లో ఏర్పాటు చేసిన న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 70లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు.

‘‘హైదరాబాద్‌లో ఉంటే.. అమెరికాలో ఉన్నట్టు ఉందని రజినీకాంత్‌ అన్నారు. హైదరాబాద్‌లోనే ఇల్లు కొనుక్కోవాలని అనిపిస్తోందని భాజపా ఎంపీ సన్నీ దేవోల్‌ అన్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధి అందరికీ కనిపిస్తోంది గానీ.. విపక్షాలకు కనిపించట్లేదు. కేసీఆర్‌ మళ్లీ గెలవకపోతే పెరుగుతున్న హైదరాబాద్‌ అభివృద్ధి ఆగిపోతుంది. కేసీఆర్‌ను ఓడించడానికి అందరూ ఏకమవుతున్నారు. కేసీఆర్‌ సింహం లాంటి వారు.. సింగిల్‌గానే వస్తారు. తెలంగాణ సీఎం ఎవరు అనేది ప్రజలు నిర్ణయించాలి.. మోదీ, రాహుల్‌ కాదు. ఈ పోరాటం దిల్లీ దొరలకు.. తెలంగాణ ప్రజలకు మధ్యే జరుగుతోంది.

తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదు. గతంలో నెహ్రూ, ఇందిరతోనూ కొట్లాడారు. అప్పుడు సోనియాతో.. ఇప్పుడు మోదీతో కొట్లాడుతున్నాం. కాంగ్రెస్‌లో సీఎంలు దొరికారు.. కానీ, ఓటర్లు దొరకడం లేదు. జానారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయరు.. కానీ, సీఎం పదవి కావాలి. తెలంగాణలో సమ్మిళిత వృద్ధి ఉంది. రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ.10లక్షల కోట్లకు చేరుకున్నాయి. 24వేల కొత్త పరిశ్రమలు తెలంగాణకు వచ్చాయి. హైదరాబాద్‌లో పెట్టాలనుకున్న ఫాక్స్‌కాన్‌ సంస్థను కర్ణాటకలో పెట్టాలని, తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని డీకే శివకుమార్‌ ఆ సంస్థకు లేఖ రాశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పరిశ్రమలన్నీ కర్ణాటకకు పోతాయి’’ అని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z