సినిమా పైరసీకి వ్యతిరేకంగా ప్రభుత్వం 12మంది నోడల్ అధికారులను నియమించింది. సినిమాల విషయంలో జరుగుతున్న పైరసీని అరికట్టేందుకు, డిజిటల్ ప్లాట్‌ఫాంల నుంచి పైరసీ కంటెంట్‌ను తొలగించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. చిత్రపరిశ్రమకు సినిమాల పైరసీ వల్ల ప్రతి ఏడాది దాదాపు రూ.20వేల కోట్ల నష్టం జరుగుతోందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘పరిశ్రమ కోరుకున్న పెద్ద డిమాండ్‌ని మేము నెరవేర్చాము’ అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్(ఐఖీబీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ)లో 12మంది నోడల్ అధికారులని నియమించామని, సినిమా పైరసీలకి సంబంధించిన కేసులను నమోదు చేసుకొని 48గంటల్లో చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ‘పైరసీ అనేది సినిమా రంగానికే కాదు ప్రపంచం మొత్తానికి పెనుముప్పు. దీనిపై ఇప్పుడు చర్యలు తప్పక తీసుకోవాల్సిందే’ అని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
యూట్యూబ్, టెలిగ్రామ్ ఛానల్స్, ఇతర వెబ్‌సైట్స్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల నుంచి తమ కంటెంట్‌ను తొలగించడానికి కాపీరైట్ హోల్డర్స్ లేదా ఆ కంటెంట్‌కు సంబంధించి అధికారం పొందిన ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు చేసే ముందు సీబీఎఫ్‌సీ జారి చేసిన సర్టిఫికేట్‌ను, యాజమాన్య రుజువును చూపించాలని అధికారులు ప్రకటించారు. కేసు నమోదు చేసే ముందు వాస్తవికతను తెలుసుకోవడానికి నోడల్ అధికారులు విచారణలు చేపట్టాలని ఐఖీబీ సెక్రటరీ అపూర్వ చంద్ర ఈ సందర్భంగా తెలిపారు. పైరసీకి పాల్పడితే కఠినమైన జరిమానాలు విధించడానికి వర్షాకాల సమావేశాల్లో సినిమాటోగ్రాఫ్ బిల్లును ఆమోదించింది. బిల్లులోని నిబంధనల ప్రకారం… కనీసం మూడు నెలల పాటు జైలు శిక్ష, రూ.3లక్షల జరిమానాలు ఉన్నాయి. గరిష్ఠంగా జైలు శిక్షను మూడేళ్ల వరకు పొడిగించవచ్చని, నిర్మాణ వ్యయంలో ఐదు శాతం జరిమానా ఉంటుందని ఠాకూర్ వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –