Politics

ఎన్నికల్లో అభ్యర్థి గుణగణాలు చూసి ఓటు వేయాలి

ఎన్నికల్లో అభ్యర్థి గుణగణాలు చూసి ఓటు వేయాలి

కాంగ్రెస్‌ పాలనలో సింగరేణి నష్టాల్లో ఉండేదని, తెలంగాణ వచ్చిన వెంటనే ఆ ఉద్యోగులకు 3 శాతం ఇంక్రిమెంట్‌ ఇచ్చామని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఆదివారం కొత్తగూడెంలో నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌, భాజపాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. 75 ఏళ్లుగా రెండు పార్టీలు చేసిందేమిటని ప్రశ్నించారు. భారాస పాలనలో విద్య, వైద్యం, రవాణా, రోడ్లు, తాగునీరు, విద్యుత్‌ రంగంలో అభివృద్ధి జరుగుతోందన్నారు.

‘‘కాంగ్రెస్‌ హయాంలో సింగరేణి టర్నోవర్‌ రూ.11వేల కోట్లు మాత్రమే ఉండేది. సమైక్య రాష్ట్రం ఉంటే కొత్తగూడెం జిల్లా వచ్చేది కాదు. కొత్తగూడేనికి ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చింది. ఈ నియోజకవర్గంలో 13,500 ఎకరాల పోడు భూమికి పట్టాలిచ్చాం. 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో కాని పనులు భారాస ప్రభుత్వం చేసి చూపించింది. సీతారామ ప్రాజెక్టు 70శాతం పూర్తయింది. వచ్చేది భారాస ప్రభుత్వమే.. నేనే వచ్చి సీతారామ ప్రాజెక్టు ప్రారంభిస్తా. ఎన్నికలు వస్తే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి తలెత్తుతోంది. ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు బూతులు తిడుతున్నారు.. అబద్ధాలు చెబుతున్నారు. ఎన్నికల్లో అభ్యర్థి గుణగణాలు చూసి ఓటు వేయాలి. అభ్యర్థి వెనుక పార్టీ ఉంటుందని, ఆ పార్టీ వైఖరి, చరిత్ర చూసి వారిని గెలిపించాలి. కొత్తగూడెం నియోజకవర్గంలో వనమా వెంకటేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలి’’ అని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z