ఒకనాడు వారి కాల్షీట్ల కోసం బడాబడా నిర్మాతలే వెంపర్లాడారు. ‘ఒక్క చాన్స్’ మేడం అంటూ పెద్దపెద్ద ప్రొడక్షన్ హౌస్‌లే వారి వెంటపడ్డాయి. ‘ఒక నెల రోజుల డేట్స్ ఇవ్వండి మేడం’ అని వారిని ఎంతో మంది ప్రాధేయపడ్డారు. ఆనాడు వారి ఫేమ్‌ను వాడుకొని కాసులు కురిపించుకోవాలని ఎంతో మంది చూశారు. కానీ నేడు.. పరిస్థితి తలకిందులైంది. ‘పూర్తి కాల్షీట్లు ప్రజా సేవకే కేటాయించాం.. డేట్స్ అన్నీ పార్టీకే ఇచ్చాం.. నెల రోజులేం ఖర్మ.. ఏడాదంతా పార్టీ కోసమే పని చేశాం.. ఒక్క టికెట్ ప్లీజ్’ అంటూ ప్రాధేయపడాల్సిన పరిస్థితి వచ్చింది. వారే అలనాటి తారలు జయసుధ, జీవిత, రాములమ్మ అలియాస్ విజయశాంతి.
హైదరాబాద్, సిటీబ్యూరో: అలనాటి అగ్రతారల చెవుల్లో బీజేపీ ‘కమలం’ పువ్వు పెట్టింది. టికెట్ ఆశించిన నాయికలకు కమలం పార్టీ మొండిచెయ్యి చూపించింది. అధ్యక్షా..అనే పిలుపు కోసం ఆశపడ్డ అలనాటి హీరోయిన్లకు బీజేపీ నిరాశే మిగిల్చింది. ఎమ్మెల్యే టికెట్ హామీ ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ ఆ సీనియర్ నటీమణులకు హ్యాండిచ్చింది. కమలం నుంచి పోటీ చేయాలని కలలుగన్న హీరోయిన్లలో ఒకరు మాజీ ఎమ్మెల్యే జయసుధ అయితే, మరొక నటి జీవితారాజశేఖర్. వీరిద్దరూ గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాల నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ‘సినిమాల్లో వచ్చిన చాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారడం’ గురించి తెలిసినవారు కాబట్టే.. ముందు జాగ్రత్తగా ఒకటికి మించి నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్నారు. నాలుగైదు నియోజకవర్గాలపై కర్చీఫ్ వేశారు. అంతలా జాగ్రత్తపడ్డా వారికి నిరాశే ఎదురైంది. కాషాయ పార్టీ విడుదల చేసిన మూడు జాబితాల్లోనూ వారి పేర్లు లేకపోవడం గమనార్హం. దీంతో అగ్ర తారలు నిరాశకు గురైనట్టు తెలుస్తున్నది.
మొదటి జాబితాలోనే తమ పేర్లు ఉంటాయని వారు ఆశించారు. కానీ అలా జరగకపోవడంతో అప్పటి నుంచే వారిద్దరూ పార్టీకి, రాష్ట్ర నాయకత్వానికి దూరంగా ఉంటున్నట్టు సమాచారం. టికెట్ ఆశించి భంగపడ్డ వారిద్దరూ పార్టీ కార్యకలాపాల్లోనూ కనిపించడం లేదు. రెండో, మూడో జాబితాలోనైనా స్థానం దక్కుతుందని ఆశించినా.. భంగపాటే ఎదురవడంతో పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ సీనియర్ నాయకురాలు రాములమ్మది మరో కథ. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నా.. ఆమె అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీలో ప్రాధాన్యం తగ్గడంతో ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ అమాంతంగా పడిపోవడంతో పోటీ చేసినా ప్రయోజనం ఉండదని ఆమె భావిస్తున్నట్టు సమాచారం.
రెండు, మూడు చోట్ల కర్చీఫ్
ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎప్పట్నుంచో ఆశగా ఉన్న హీరోయిన్ జీవిత.. కాషాయం పార్టీ నుంచి జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, సనత్‌నగర్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఏ స్థానమూ ఆమెకు దక్కలేదు. కూకట్‌పల్లి సీటు ఇంకా ప్రకటించకపోయినప్పటికీ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. దీంతో ఆమె కూకట్‌పల్లిపై కూడా ఆశలు వదులుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జయసుధ సికింద్రాబాద్ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ అగ్రనాయకత్వం జయసుధ సికింద్రాబాద్ నుంచి బరిలో ఉంటారని సంకేతాలివ్వడంతో ఆమె స్థానికులతోనూ సమావేశమయ్యారు. కానీ చివరకు ఆమెకు బీజేపీ షాకిచ్చిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
కాషాయంపై మహిళల ఆగ్రహం
బీజేపీపై మహిళా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాషాయం పార్టీలో తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. సికింద్రాబాద్ సీటును మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బండ కార్తీకారెడ్డి కూడా ఆశించారు. ఆమె సహా మరో నలుగురు మహిళలు కూడా దరఖాస్తు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ సీటు కోసం పద్మ, కీర్తి, జీవితారాజశేఖర్ పోటీ పడగా.. వారిని కాదని దీపక్ రెడ్డికి కట్టబెట్టారు. అంబర్‌పేట్ టికెట్ ఆశించిన మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తికి కూడా నిరాశే ఎదురైంది. సనత్‌నగర్ సీటును ఆకుల విజయ కోరగా ఆమెకు నిరాశే మిగిలింది. దీంతో మహిళలకు బీజేపీ అన్యాయం చేసిందని విమర్శలు వస్తున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ వారంతా పార్టీ మారే యోచనలో ఉన్నట్టు సమాచారం.
👉 – Please join our whatsapp channel here –