Politics

సిపిఎం అభ్యర్థులు వీరే

సిపిఎం అభ్యర్థులు వీరే

ఈసారి ఎన్నికల్లో 17 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన సీపీఎం.. 14 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. పాలేరులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తుండగా, మిర్యాలగూడ నుంచి జూలకంటి రంగారెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఆదివారం హైదరాబాద్​లోని ఎంబీభవన్​లో అభ్యర్థుల జాబితా, మేనిఫెస్టోను తమ్మినేని వీరభద్రం విడుదల చేశారు. మరో మూడు సెగ్మెంట్లకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. తాను ఈ నెల 9న నామినేషన్ వేస్తానని తెలిపారు. ప్రజల హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని, అలాంటోళ్లను చట్టసభలకు పంపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలను తిరస్కరించాలి. సీపీఎం, వామపక్షాలను గెలిపించాలి. లౌకిక, ప్రజాస్వామ్య, సామాజిక పోరాట శక్తులను బలపర్చాలి” అని కోరారు.

మాదేం సన్నాసి పార్టీ కాదు.. పొత్తుల విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు సరిగాలేదని తమ్మినేని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ ​చివరి నిమిషం వరకు సీట్లపై తేల్చలేదు. అందుకే ఒంటరిగా పోటీ చేస్తున్నం. మాకు ఎవరి లాభనష్టాలతో పనిలేదు. మా పార్టీ ప్రయోజనం కోసమే ఎన్నికల బరిలో ఉంటున్నం. మా గౌరవాన్ని వదులుకుని, కొన్ని పార్టీల లాగా పోటీ చేయబోం. ఇతరులకు ఓట్లేస్తం అనేందుకు మాదేం తోక పార్టీ కాదు. కాంగ్రెస్​ను మేమేం గొంతెమ్మ కోర్కెలు కోరలేదు. 50–60 సీట్లు అడగలేదు. మా బలానికి తగ్గట్టుగానే ఐదు సీట్లు ఇవ్వాలని కోరాం. కాంగ్రెస్ ముందు మూడు సీట్లు ఇస్తామని, ఆ తర్వాత రెండు అని, ఇప్పుడు ఒక్కటే సీటు అంటున్నది. అలా మాట మార్చే పార్టీలతో పొత్తు కొనసాగదు. మా పార్టీకి ప్రయోజనం లేకుండా అందరికీ మద్దతు ఇవ్వడానికి, మాదేం సన్నాసి పార్టీ కాదు” అని అన్నారు. సీపీఐ పోటీ చేసే స్థానాల్లో మాత్రం తాము పోటీ చేయబోమని, ఆ పార్టీకి మద్దతిస్తామని తెలిపారు. మిగిలిన చోట్ల ఎవరికి మద్దతివ్వాలనే దానిపై న్యూడెమోక్రసీ, ప్రజాపంథా, బీఎస్పీ తదితర లౌకిక పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.

మేనిఫెస్టోలోని అంశాలు.. ఇండ్లు లేని వారందరికీ స్థలాలు ఇవ్వాలని, ఇండ్ల నిర్మాణానికి రూ.10 లక్షల సాయం చేయాలని సర్కార్ పై ఒత్తిడి తీసుకొస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టం కోసం, ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ కోసం కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్​లో 20% విద్యకు కేటాయించేలా, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసేలా సర్కారుపై ఒత్తిడి తెస్తామన్నారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించి, ప్రతి ఒక్కరికీ 300 గజాల స్థలం ఇచ్చేలా కృషి చేస్తామని.. రిటైర్​ అయితే రూ.10 వేల పింఛన్ ఇవ్వాలని సర్కారుపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.

తమ్మినేనికి భట్టి ఫోన్.. తమ్మినేని ప్రెస్​మీట్​లో ఉన్న సమయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆయనకు ఫోన్ చేశారు. ప్రెస్​మీట్ పూర్తయిన తర్వాత భట్టితో తమ్మినేని మాట్లాడగా.. పొత్తుపై పునరాలోచిం చాలని, అభ్యర్థులను ప్రకటించవద్దని సూచించారు. అయితే తమకు ఇస్తామ న్న సీట్లపై నిర్ణయం తీసుకున్నారా అని తమ్మినేని అడగ్గా, చర్చలు జరుగుతు న్నాయని భట్టి సమాధానమిచ్చారు. దీంతో ముందు తమకు ఇచ్చే స్థానాలపై క్లారిటీ ఇవ్వాలని తమ్మినేని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నా ఇంకా సీట్లపై తేల్చకుండా నాన్చడం ఏంటని, పోలింగ్ నాటికైనా తేల్చుతారా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z