* ఫైబర్ నెట్ కేసులో సీఐడీ దూకుడు
AP: ఫైబర్ నెట్ కేసు విచారణలో సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏడుగురు నిందితులకు సంబంధించిన రూ.114 కోట్ల విలువైన స్థిరాస్తుల అటాచ్మెంట్ కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కోర్టు త్వరలోనే విచారణ చేయనుంది. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
* ఈడీతో కలిసి కుట్రకు తెరలేపిన బీజేపీ
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చత్తీస్‌ఘఢ్ సీఎం భూపేష్ బఘేల్ (Bhupesh Baghel) కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తనను అప్రతిష్టపాలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. మహదేవ్ యాప్ స్కామ్‌లో కీలక నిందితుడు శుభం సోని సీఎం సూచనల మేరకే తాను దుబాయ్ వెళ్లానని పేర్కొన్న నేపధ్యంలో భూపేష్ బఘేల్ బీజేపీపై విరుచుకుపడ్డారు. దుబాయ్‌లో గ్యాంబ్లింగ్ బిజినెస్ ప్రారంభించేలా సీఎం బఘేల్ తనను ప్రోత్సహించారని వీడియో మెసేజ్‌లో సోని ఆరోపించారు.భిలాయ్‌లో తన అనుచరుల అరెస్ట్‌కు సంబంధించి తాను బఘేల్‌ను సంప్రదించానని సోని పేర్కొన్నారు. అయితే బీజేపీకి రాబోయే ఎన్నికల్లో లబ్ధి చేకూర్చేందుకే ఈ సమయంలో ఇలాంటి వీడియోను బహిర్గతం చేశారని అర్ధం చేసుకోవడం కష్టమేమీ కాదని బఘేల్ పేర్కొన్నారు. ఈడీని ప్రయోగించే ఈ తతంగం సాగిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందేనని చెప్పుకొచ్చారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈడీని వాడుకుంటున్నారని, ఈడీ సాయంతోనే ప్రస్తుతం బీజేపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిందని సీఎం ఎద్దేవా చేశారు.వీడియో మెసేజ్‌లో శుభం సోని చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. అసలు అతడు ఎవరో కూడా తనకు తెలియదని, అతడిని తాను ఎన్నడూ కలవలేదని స్పష్టం చేశారు. ఏదైనా కార్యక్రమంలో అక్కడున్న వారిలో శుభం సోని ఉన్నాడో లేదో కూడా తనకు తెలియదని ట్విట్టర్ వేదికగా సీఎం రాసుకొచ్చారు. మహదేవ్ యాప్‌కు తాను యజమానినని అతడు చెప్పుకుంటుండగా ఈడీ రెండు రోజుల కిందట అతడు మహదేవ్ యాప్ మేనేజర్ అని పేర్కొందని భూపేష్ బఘేల్ గుర్తుచేశారు.చత్తీస్‌ఘఢ్ ప్రజలు అన్నీ అర్ధం చేసుకుంటారని, ఎన్నికల్లో ఈడీ, బీజేపీలకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కాగా మహదేవ్ యాప్ యజమానిగా చెబుతున్న సోని తాను 2021లో ఈ యాప్ ప్రారంభించానని, చత్తీస్‌ఘఢ్ సీఎంకు రూ. 508 కోట్లు చెల్లించానని, ఇందుకు తన వద్ద ఆధారాలున్నాయని ఆరోపించారు
* విజయవాడ బస్టాండ్‌లో బస్సు బీభత్సం
విజయవాడ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం విజయవాడ నుండి గుంటూరు వెళ్లాల్సిన ఆర్టీసీ మెట్రో లగ్జరీ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా ప్లాట్ ఫామ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్ కండక్టర్‌తో పాటు ప్రయాణికురాలు మృతి చెందారు. బస్సు కిందపడి మరికొందరు ప్రయాణికులు గాయపడ్డారు. విజయవాడ బస్టాండ్‌లోని ప్లాట్‌ఫామ్ 12 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ప్రయాణికుల పైకి బస్సు దూసుకుపోవడంతో ఆర్టీసీ అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే ప్రయాణికులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. బ్రేక్ ఫెయిల్ అవ్వడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా బస్సు మీదకు దూసుకు వచ్చి బీభత్సం సృష్టించడంతో బస్టాండ్‌లోని ప్రయాణికులు ఏం జరుగుతుందో అర్థంకాక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* ఎన్నికల ప్రచార వాహనం బోల్తా
ఎన్నికల ప్రచారం కోసం వినియోగించే వాహనం బోల్తాపడింది. (Poll Campaign Vehicle Accident) ఈ ప్రమాదంలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రెహ్లి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి గోపాల్ భార్గవ కోసం ప్రచారంలో నిమగ్నమైన ఎస్‌యూవీలో ఎనిమిది మంది కార్యకర్తలు ప్రయాణించారు. శనివారం సాయంత్రం బార్‌గ్రోన్ బర్ఖెడా, జోన్ గ్రామాల మధ్య వేగంగా వెళ్తున్న ఆ వాహనం అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్‌యూవీలో ఉన్న ఎనిమిది మంది గాయపడ్డారు. అలాగే కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.కాగా, ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఎనిమిది మంది వ్యక్తులను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. మరో ఐదుగురికి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెహ్లీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మనీష్ త్రిపాఠి తెలిపారు.
* పాఠశాలలో 50 మంది బాలికలపై లైంగిక వేధింపులు
హరియాణాలో ఓ ప్రధానోపాధ్యాయుడు దారుణానికి ఒడిగట్టాడు. జింద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అనేక మంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడి ఆగడాలు తాళలేక బాలికలు.. చివరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి కార్యాలయం, జాతీయ మహిళా కమిషన్‌లకూ లేఖలు రాసినట్లు సమాచారం. ఐదు రోజులుగా పరారీలో ఉన్న ప్రధానోపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. 50 మందికిపైగా బాలికలపై నిందితుడు లైంగిక వైధింపులకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
* హోర్డింగ్ పైకెక్కి యువకుడు హల్చల్
తాగిన మైకంలో హోర్డింగ్ ఎక్కిన యువకుడు అక్కడే నిద్రపోయిన ఘటన నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ వద్ద చోటు చేసుకుంది. నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన మేస్త్రీ పని చేసే రవీందర్ అలియాస్ రవి ఆదివారం మద్యం ఎక్కువ మోతాదులో తీసుకుని అక్కడే ఉన్న హోర్డింగ్ ఎక్కి నిద్రపోయాడు. హోర్డింగ్‌పై రవీందర్‌ను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి ట్రాఫిక్ పోలీసులు, మూడో టౌన్ పోలీసులు చేరుకున్నారు. వారి సూచన మేరకు స్థానికులు హోర్డింగ్ ఎక్కి రవీందర్‌ను కిందికి దింపారు.
* రైల్వే ట్రాక్‌పై బస్సు బోల్తా
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌస జిల్లాలో సోమవారం తెల్లవారుజూమున బ్రిడ్జి పై నుండి అదుపుతప్పి ఓ బస్సు రైల్వే ట్రాక్‌పై పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* సరిహద్దు బార్డర్‌లో విస్తృత తనిఖీలు
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బంగారం అక్రమ రవాణా పథకం బెడిసికొట్టింది. 16.7 కేజీల బంగారంతో స్మగ్లర్‌ను సరిహద్దు రక్షకులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన బంగారం మార్కెట్ విలువ 10.23 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని రాణాఘాట్ వద్ద విధులు నిర్వహిస్తున్న 68 బెటాలియన్ జవాన్లకు భారీ మొత్తంలో బంగారం స్మగ్లింగ్ జరుగుతుందని పక్కా సమాచారం అందింది. సహజంగానే నిఘా పెరిగింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో అనుమానాస్పద బైక్ రైడర్‌ను జవాన్లు గుర్తించారు. జవాన్లు బైక్ రైడర్‌ను ఆపి విచారించారు. ఆ తర్వాత సోదా చేయగా యువకుడి నడుముకు కట్టిన బెల్టు నుంచి 17 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సైనికులు బైక్ బైక్ రైడర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఈ బంగారాన్ని భారత్‌కు తీసుకురావడానికి స్మగ్లర్ ప్రయత్నిస్తున్నట్టుగా జవాన్లు నిర్ధారించారు.నిందితుడి పేరు అజరు మండల్ అని తెలిసింది. వయస్సు 27 సంవత్సరాలు. అతను ఉత్తర 24 పరగణాస్‌లోని రాజ్‌కోల్ నివాసి అని తేలింది. విచారణలో పట్టుబడిన యువకుడు నిరుపేదవాడని చెప్పాడు. పూల సాగు చేస్తూ జీవనం సాగించేవాడు. ఆరు నెలల క్రితం అక్రమ రవాణాకు పాల్పడ్డాడు. బంగ్లాదేశ్‌లోని మతిలా గ్రామానికి చెందిన ఆలం మోండల్ నుంచి యువకుడు ఈ వస్తువులను తీసుకు వచ్చినట్టుగా చెప్పాడు. వాటిని బంగావ్‌లోని మరొక స్మగ్లర్‌కు అందించనున్నట్టు పట్టుబడిన వ్యక్తి చెప్పాడు. అయితే దారిలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది సోదాల్లో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన స్మగ్లర్, స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తదుపరి చట్టపరమైన చర్యల కోసం కోల్‌కతాలోని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.
👉 – Please join our whatsapp channel here –