ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారని, గతంలో 11 ఛాన్స్‌లు ఇస్తే రాష్ట్రానికి ఆ పార్టీ ఏం చేసిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో 24 గంటల విద్యుత్ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో చీకట్లు అలముకుంటాయన్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ బీమా అమలు చేసుకుందామన్నారు. తెల్లకార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల బీమా ఇవ్వబోతున్నట్లు చెప్పారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన భారాస యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.‘‘కేసీఆర్‌ను ఓడించేందుకు దిల్లీ నుంచి చాలా మంది వస్తున్నారు. సింహం మాత్రం సింగిల్‌గానే వస్తుంది. కాంగ్రెస్ నేతలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దిల్లీ నేతలపైనే ఆధారపడతారు. ఎన్నికలు రాగానే పొలిటికల్ టూరిస్టులు అనేక మంది వస్తారు. ఏవేవో మాటలు చెబుతారు. ప్రజలు ఆగం కావొద్దు. దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా అని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. ఆయనకు నేను చెప్పేది ఒకటే.. దొరలు ఎవరో తెలంగాణ ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు. వారే మీకు సరైన పద్ధతిలో సమాధానం ఇస్తారు’’ అని కేటీఆర్ అన్నారు.టీఎస్‌పీఎస్సీలో కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమేనని, లోపాలను కచ్చితంగా ప్రక్షాలన చేస్తామని కేటీఆర్ అన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. గత పదేళ్లలో 2 లక్షల 30 వేలకుపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. అందులో 1 లక్ష 60 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
👉 – Please join our whatsapp channel here –