* కేదార్నాథ్ ఆలయంలో భక్తులకు టీ అందించిన రాహుల్
ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయాన్న కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆదివారం సందర్శించారు. ప్రైవేటు హెలికాప్టర్లో కేదార్నాథ్ చేరుకున్న రాహుల్‌కు ఆలయ పూజారులు, కాంగ్రెస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం కేదారేశ్వరుడ్ని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాహుల్ అక్కడ ‘ఛాయ్ సేవ’లో పాల్గొని భక్తులకు టీ అందించారు. అనంతరం భక్తులతో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడిన విషయం తెలిసిందే. అదే పంథాను ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా రైతులు, ట్రక్కు డ్రైవర్లు, వ్యాపారులు, రైల్వే స్టేషనల్లో కూలీలు.. ఇలా అన్ని వర్గాల ప్రజల్ని కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
* కేసీఆర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, గద్వాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన దృష్యా బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో తన ప్రచార పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరారు. బయల్దేరిన కొద్దిసేపటికే సీఎం హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్.. సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ల్యాండింగ్ చేశారు.అనంతరం ఏవియోషన్ సంస్థకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆ సంస్థ వెంటనే మరో హెలికాప్టర్ పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రత్యామ్నాయ హెలికాప్టర్ రాగానే సీఎం కేసీఆర్ పాలమూరు వెళ్లనున్నారు. కేసీఆర్ పాలమూరు పర్యటన యథావిథిగా కొనసాగనుందని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇక కేసీఆర్ రాక కోసం నాలుగు నియోజకవర్గాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, గద్వాల్ నియోజకవర్గ రహదారులన్నీ గులాబీ మయమయ్యాయి. సీఎం సభ కోసం లక్షల మంది కార్యకర్తలు తరలివస్తున్నట్లు.. వారికి అవసరమైన ఏర్పాట్లు చేశామని స్థానిక బీఆర్ఎస్ నేతలు తెలిపారు.
* బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా రిలీజ్
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ ప్రకటించింది. మొత్తం 40 మందికి చోటు కల్పించింది. ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీకి స్థానం కల్పించింది. అలాగే యడ్యూరప్ప, లక్ష్మణ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పురుషోత్తం రూపాల, అర్జున్ ముండా, భూపేంద్ర యాదవ్, సాధ్వి నిరంజన్ జ్యోతి, మురుగన్, ప్రకాశ్ జవదేకర్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అర్వింద్ మీనన్, రవికిషన్, ఏపీకి చెందిన నేత పురంధేరశ్వరిని నియమించింది.ఇదిలా ఉండగా కేవలం తెలంగాణకు చెందిన 19 మంది నేతలకు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ చోటు కల్పించింది. అందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, రాజాసింగ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, కృష్ణ ప్రసాద్ పేర్లను స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో పెట్టింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి పేరు లేక పోవడం గమనార్హం.
* నేపాల్‌ను వణికిస్తున్న వరుస భూకంపాలు
నేపాల్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. వరుస భూకంపలతో నేపాల్ కోలుకొలేని పరిస్థితి ఏర్పడింది. హిమాలయ దేశం మృత్యుఘోష తాండవిస్తుంది. జజర్కోట్ జిల్లాలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. తీవ్ర భూకంపంతో 160కి పైగా మృతి చెందారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. ఘటనా ప్రాంతంలో నేపాల్ సైన్యం, పోలీసు బృందాలు సహాయ కార్యక్రమాలను వేగవంతం చేశాయి. నేలమట్టమైన ఇళ్ల శిథిలాల్లో చిక్కుబడిపోయిన వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చేపట్టారు.నేపాల్‌లో ఇళ్లు దెబ్బతినడంతోపాటు భూ ప్రకంపనలు కొనసాగుతుండటంతో భయభ్రాంతులకు గురైన జనం రాత్రంతా వీధుల్లోనే జాగారం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న తమ వారి కోసం జనం చిమ్మచీకట్లోనే తమవంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నేపాల్ ప్రధాని, వైద్య బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు.
* ఢిల్లీలో ప్రమాదస్ధాయిలో వాయు కాలుష్యం
దీపావళికి ముందే ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) ప్రమాదకర స్ధాయికి చేరడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నవంబర్ 13 నుంచి 20 వరకూ వాహనాల రాకపోకలకు సంబంధించి మళ్లీ సరి-బేసి విధానం అమలుకానుంది. మరోవైపు నిర్మాణ పనులకు బ్రేక్ ఇవ్వడంతో పాటు 10, 12 తరగతులు మినహా మిగిలిన తరగతులను నవంబర్ 10 వరకూ నిలిపివేశారు. ఇక సోమవారం ఉదయం 9 గంటలకు వాయు నాణ్యతా సూచి (AQI) 437గా ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) ప్రకటించింది.అయితే గత మూడు రోజులతో పోల్చితే ఇది కాస్త తగ్గినా ఇంకా ప్రమాదకర స్ధాయిలోనే ఉంది. అంతకుముందు వాయు కాలుష్యంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్‌తోపాటు రవాణా శాఖ, ఢిల్లీ మున్సిపాలిటీ, పోలీస్, ఇతర శాఖలకు చెందిన సీనియర్ అధికారులు హాజరయ్యారు.కేంద్ర ప్రభుత్వం జారీచేసిన స్టేజ్-4 గ్రేడెడ్ రెస్పాన్స్ ప్లాన్ (GRAP) అమలుపై చర్చించిన అనంతరం సరి-బేసి విధానాన్ని తిరిగి అమలు చేయాలని, స్కూళ్లను ఈనెల 10 వరకూ మూసివేయాలని నిర్ణయించారు. వాయు కాలుష్య నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు.
* తిరుమలలో భారీ వర్షం
తిరుమలలో భారీ వర్షం కురిసింది. సోమవారం మధ్యాహ్నం కురిసిన ఈ వర్షంతో శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలు జలమయమయ్యాయి. దర్శనానికి క్యూలైన్లలో వెళ్లిన భక్తులతో పాటు బయట వేచి ఉన్న భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. వర్షంతో భక్తులు అతిథిగృహాలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా తిరుమలలో చలి తీవ్రత మరింత పెరిగింది.
* ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్
ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనతో మొదలైన సెగలు కాంగ్రెస్‌లో ఇంకా భగ్గుమంటున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకే వస్తుందనుకున్న టికెట్ దక్కవపోవడంతో మరికొందరు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇప్పటికే పలువురు హస్తానికి గుడ్ బై చెప్పారు. ఇదిలా ఉండగానే, కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలింది. ఆదిలాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ సాజిద్‌ఖాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటుగా మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి వర్గం, టీపీసీసీ జనరల్ సెక్రటరీ సుజాత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ రెడ్డి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ టికెట్‌ను కంది శ్రీనివాస్ రెడ్డికి కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి గురై వీరంతా రాజీనామా చేశారు.ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డికి పోటీగా సంజీవ్‌రెడ్డి నిలపాలని ఈ సందర్భంగా అసంతృప్తి నేతలు నిర్ణయం తీసుకున్నారు. కాగా, పోలింగ్‌కు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న క్రమంలో ఏకంగా డీసీసీ ప్రెసిడెంట్ పార్టీకి రాజీనామా చేయడం ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు. అసంతృప్త నేతలు కాంగ్రెస్ అభ్యర్థికి పోటీగా మరోనేతను బరిలోకి దింపుతుండటంతో ఈ వ్యవహారాన్ని టీపీసీసీ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి మరీ.
* ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 7న (మంగళవారం) తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఆయా స్థానాల్లో ఆదివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నక్సల్ ప్రభావిత బస్తర్ డివిజన్లోని ఏడు జిల్లాలు, మరో నాలుగు ఇతర జిల్లాల్లో ఈ 20 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 25 మంది మహిళలతో పాటు మొత్తం 223 మంది అభ్యర్థులు తొలి విడత బరిలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న అధికార కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే ప్రచారంతో హోరెత్తించాయి. రాష్ట్రంలో 15 ఏండ్ల బీజేపీ పాలనకు ముగింపు పలుకుతూ 2018లో కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఈ సారి ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉన్నదని సర్వేలు చెప్తున్నాయి. తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న 20 స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లను కైవసం చేసుకుంది. కాగా, రెండో విడుతలో 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్ జరుగనుంది.
* బస్సు ప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం
విజయవాడలోని జవహర్లాల్ నెహ్రూ బస్టాండ్‌లో జరిగిన ప్రమాదంపై విచారణం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశాలు జారీ చేశారు.. ఇక బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.. విజయవాడ బస్టాండ్‌లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం.. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం ముఖ్యమంత్రికి ప్రమాద ఘటనపై వివరాలను అధికారులు అందించారు. ఆర్టీబస్సు ప్రమాదవశాత్తూ ఫ్లాట్‌ఫాంమీదకు దూసుకుపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని, గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.