Politics

నేడు హైదరాబాద్‌లో ప్రధాని షెడ్యూల్

నేడు హైదరాబాద్‌లో ప్రధాని షెడ్యూల్

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం భాజపా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగే బీసీ ఆత్మగౌరవసభలో పాల్గొననున్నారు. తెలంగాణలో రానున్న శాసనసభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తిని సీఎంను చేస్తామని భాజపా ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీసీ ఆత్మగౌరవసభను నిర్వహిస్తోంది. దీనికి ప్రధానితో పాటు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ కూడా హాజరవుతారు. పలువురు బీసీ నేతలు కూడా పాల్గొంటారని పార్టీవర్గాలు తెలిపాయి. ప్రధాని సభతో భాజపా మలివిడత అగ్రనేతల ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. ఈనెల 11న మరోమారు హైదరాబాద్‌కు ప్రధాని రానున్నారు. ఆరోజు పరేడ్‌గ్రౌండ్‌లో ఎస్సీల వర్గీకరణ అంశంగా జరిగే ఎస్సీ అణగారిన వర్గాల సభలో ఆయన పాల్గొంటారు.

ఇదీ ప్రధాని షెడ్యూలు…మంగళవారం సాయంత్రం 5.05 గంటలకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ నుంచి హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. 5.10 గంటలకు అక్కడనుంచి బయల్దేరి 5.25 గంటలకు ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. అనంతరం వాహనంలో ఎక్కి స్టేడియంలో తిరుగుతూ సభకు హాజరైనవారికి అభివాదం చేస్తారు. 5.30 నుంచి 6.10 గంటల వరకు బహిరంగసభలో పాల్గొంటారు. 6.15 గంటలకు బయలుదేరి బేగంపేట విమానాశ్రయం చేరుకుని దిల్లీ వెళతారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z