Politics

10న కామారెడ్డిలో రేవంత్ నామినేషన్

10న కామారెడ్డిలో రేవంత్ నామినేషన్

అసెంబ్లీ ఎన్నికల ప్రచార రంగంలోకి దూకేందుకు కాంగ్రెస్‌ రంగం సిద్ధం చేసుకుంది. 10న కామారెడ్డి నియోజకవర్గం నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేస్తారని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, పీసీసీ ఉపాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటంతోనే ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షుడు ఇక్కడి నుంచి పోటీచేస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ 9న నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో నామపత్రాలు దాఖలు చేస్తారని వెల్లడించారు. ప్రత్యేక పరిస్థితుల్లో నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గానికి వెళ్తున్నట్లు షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు.

10న రేవంత్‌ రెడ్డి నామినేషన్‌
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 10వ తేదీన నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం జిల్లా కేంద్రంలో లక్షమందితో భారీ సభను నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరై.. కాంగ్రెస్‌ పార్టీ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటిస్తారు. నామినేషన్‌ సందర్భంగా నియోజకవర్గంలోని మండల కేంద్రాలు, గ్రామాల్లో కార్యకర్తలు భారీ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు. జిల్లా కేంద్రంలోనూ ర్యాలీ నిర్వహించాలని పీసీసీ నేతలు కోరారు.

సమన్వయ కమిటీలు..
క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య సమన్వయం సాధించేందుకు మండల, నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు. పార్టీ ప్రచారాన్ని పర్యవేక్షించేందుకు పీసీసీ తరఫున వేం నరేందర్‌రెడ్డి, అరికెల నర్సారెడ్డి, మానాల మోహన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఇప్పటికే వీరు గ్రామాలు, వార్డుల వారీగా పార్టీ పరిస్థితిని తెలుసుకుంటున్నారు.

గ్యారంటీలపై ప్రచారానికే ప్రాధాన్యం
మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నేతలు ప్రచార వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలో భవనాల కోసం నాయకులు వెతుకుతున్నారు. వీటితో పాటు మండలాల వారీగా ప్రచారం కోసం బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలోనే నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z