Business

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు-వాణిజ్య వార్తలు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు-వాణిజ్య వార్తలు

* ఎయిరిండియాకు ఖలిస్థానీ బెదిరింపులు

నవంబరు 19వ తేదీన ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించే వారికి ప్రమాదం తప్పదని ఖలిస్థాన్ వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్ (సిఖ్ ఫర్ జస్టిస్ సహ వ్యవస్థాపకుడు) హెచ్చరించడం పట్ల భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. నవంబరు 19న సిక్కులెవరూ ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని, ఆ రోజున ప్రతి చోటా ఎయిరిండియా విమానాలను అడ్డుకుంటామని గురుపత్వంత్ సింగ్ స్పష్టం చేశాడు.అంతేకాదు, ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కూడా మూతపడుతుందని, ఆ విమానాశ్రయం పేరు మార్చేస్తామని ఓ వీడియోలో పేర్కొన్నాడు.ఇదంతా ఒకెత్తయితే, నవంబరు 19న అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుందన్న మాట గురుపత్వంత్ నోటి వెంట రావడం భారత కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసింది. వెంటనే ఈ విషయాన్ని కెనడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఎయిరిండియా విమానాలకు భద్రత కల్పించాలని కోరింది.దీనిపై కెనడాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ వివరాలు తెలిపారు. కెనడా-భారత్ మధ్య నడిచే ఎయిరిండియా విమానాలకు అదనపు భద్రత కల్పించాలని కెనడా ప్రభుత్వాన్ని కోరామని, సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.ఇప్పటికే కెనడాలో భారత దౌత్యవేత్తలకు ప్రమాదం పొంచి ఉందన్న నేపథ్యంలో, ఇప్పుడు ఎయిరిండియా విమానాలకు ముప్పు తప్పదని హెచ్చరికలు రావడంతో భారత్-కెనడా మధ్య మరింత అంతరం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్-కెనడా మధ్య సంబంధాలు క్షీణించడం తెలిసిందే. ఈ హత్య వెనుక భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ఆరోపిస్తోంది.

* లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 594 పాయింట్లు లాభపడి 64,958 పాయింట్ల వద్ద.. నిఫ్టీ 181 పాయింట్ల లాభంతో 19,411 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. దివీస్ ల్యాబ్స్, హీరో మోటోకార్ప్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, టాటా స్టీల్, ఓఎన్జీసీ షేర్లు లాభపడ్డాయి. ఎస్బీఐ, సిప్లా, టాటామోటార్స్, టైటాన్, హెచ్ఎఫ్సీ షేర్లు నష్టపోయాయి.

* BSNL సరికొత్త ఆఫర్‌

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. పాత BSNL 2G/3G SIMని వాడుతున్న వారు 4G సిమ్‌కి అప్‌గ్రేడ్ అయినట్లయితే అదనంగా డేటా ప్రయోజనాలను అందిస్తుంది. మూడు నెలల పాటు ఉచితంగా 4G డేటాను ఇవ్వనున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. BSNLలో ఇప్పటికి 2G/3G SIM ఉపయోగిస్తున్నవారు ఉన్నారు. వీరిని 4G నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్ చేయడంలో భాగంగా డేటాను ఆఫర్ చేస్తున్నారు.BSNLలో త్వరలో 4G సేవలను తీసుకురానున్నారు. వినియోగదారులు వారు వాడుతున్న సిమ్ పాతదో లేక కొత్తదో తెలియకపోతే ‘SIM’ అని టైప్ చేసి 54040కి మెసేజ్ చేయాలి. ప్రస్తుతం చాలా మంది BSNL యూజర్లు 3G నెట్‌వర్క్‌లో ఉన్నారు. ఇకమీదట వారు 4G కి అప్‌గ్రేడ్ కానున్నారని అధికారులు తెలిపారు. మొదటగా పంజాబ్‌లో లాంచ్ చేసి వచ్చే ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సేవలు విస్తరించనున్నారు.యూజర్లు 4G SIMకి అప్‌గ్రేడ్ కావడానికి దగ్గరలోని BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్, ఫ్రాంచైజీ, రిటైలర్‌ని సంప్రదించగలరు. దీంతో పాటు కంపెనీ దీపావళి సందర్బంగా మరో ఆఫర్‌ను తీసుకొచ్చింది. ‘BSNL సెల్ఫ్‌కేర్ యాప్’ ద్వారా రీచార్జ్ చేసుకునే వారికి రూ.249, రూ.251, రూ.299, రూ.398, రూ.499, రూ.599, రూ.666 ప్లాన్లపై అదనంగా 3GB డేటాను అందిస్తుంది.

* క్రెడిట్‌ కార్డుతో కొంటున్నారా?

ఈ పండుగ సీజన్‌లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు తమ కస్టమర్లకు క్రెడిట్‌ కార్డులపై పెద్ద ఎత్తునే ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌తోపాటు ఆఫ్‌లైన్‌ కొనుగోళ్లపైనా భారీగా ఆఫర్లను కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే దీపావళి షాపింగ్‌.. క్రెడిట్‌ కార్డులపై చేస్తే దండిగా ప్రయోజనాలను పొందవచ్చు. అమెజాన్‌లో షాపింగ్‌తోపాటు బాష్‌, సామ్‌సంగ్‌, డెల్‌, హైయర్‌ వస్తూత్పత్తుల ధరలపై ఎస్బీఐ 10 శాతం నుంచి 27.5 శాతం వరకు తగ్గింపులను అందిస్తున్నది. అలాగే ‘హ్యాపీ డైనింగ్‌’ పేరిట భాగస్వామ్య రెస్టారెంట్లలో బిల్లుపై 15 శాతం వరకు డిస్కౌంట్‌ను ఇస్తున్నది.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సైతం రేగాలియా గోల్డ్‌, మనీబ్యాక్‌ప్లస్‌, మిల్లేనియా క్రెడిట్‌ కార్డుదారులకు రకరకాల ఆఫర్లను ప్రకటించింది. ఇక కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కూడా మింత్రా, ఫ్లిప్‌కార్ట్‌, డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌, బాష్‌, సీమెన్స్‌, గోద్రేజ్‌, ఒప్పో ప్రోడక్ట్స్‌పై 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌లు, ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్లను ఇస్తున్నది. యాక్సిస్‌, ఇండస్‌ఇండ్‌, ఆర్బీఎల్‌, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ తదితర బ్యాంకులూ ఈ పండుగ పూట కస్టమర్లను ఖుషీ చేస్తున్నా యి. ఇక పండుగలకు ఊర్లకు వెళ్లేవారి కోసం.. క్రెడిట్‌ కార్డుల ద్వారా పెట్రో ల్‌ బంకుల్లో ఇంధనం కొన్నా ఆయా సంస్థలు భారీగా తగ్గింపునిస్తున్నాయి.

* నేడు గ్యాస్ సిలిండర్ ధరలు

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు వరుసగా పెరిగాయి. అలాగే చాలా రోజుల తర్వాత ఈ మధ్యనే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించారు.హైదరబాద్: రూ. 966, వరంగల్: రూ. 974, విశాఖపట్నం: రూ. 912, విజయవాడ: రూ.927, గుంటూర్: రూ.944.

* తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు

ఒకటో తేదీ వచ్చిందంటే చాలు..ఫ్యూయల్ రేట్లలో పలు మార్పులు కూడా వస్తాయి. కానీ కొంత కాలం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 98 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్:లీటర్ పెట్రోల్ ధర రూ.109.66,లీటర్ డీజిల్ ధర రూ.98.31.విశాఖపట్నం:లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48,లీటర్ డీజిల్ ధర రూ. 98.విజయవాడ:లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76,లీటర్ డీజిల్ ధర రూ. 99.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z