* ఒడిశాలో దారుణం
ఒడిశాలోని భద్రక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన 24 ఏళ్ల గర్భిణి మృతదేహం లభ్యమైంది. భండారిపోఖరి పోలీస్ స్టేషన్ పరిధిలోని నపంగా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే తన కూతురు హత్యపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన భర్త, అతని కుటుంబ సభ్యులే ఆమెను హత్య చేశారని మహిళ తండ్రి ఆరోపించారు. తన కూతురిని శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని, దీనిపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని తెలిపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడాది క్రితమే మహిళకు పెళ్లయిందని.. తన భర్త ఇదివరకే ఒక పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆదివారం రాత్రి ఆమె కనిపించకుండా పోయిందని.. సోమవారం గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. మృతదేహంపై కొన్ని గాయాలు ఉన్నాయని, అయితే మరణానికి గల కారణం పోస్టుమార్టం తర్వాత తెలుస్తుందని భండారిపోఖరి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌స్పెక్టర్ అజయ్ సుదర్శన్ బాగే తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
* రేపు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ
ఏపీ సీఐడీ తనపై మోపిన ఇసుక కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే దానిని కూడా తప్పు పట్టడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక ఇవ్వడం కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని, ఉచిత ఇసుక విధానంపై కేబినెట్‌లో ముందు చర్చించలేదంటూ ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ పేర్కొనడాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. ఆధారాలు లేని కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
* తిరుపతిలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు
తిరుపతి జిల్లాలో అనేక చోట్ల బైక్, ఇళ్ళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నా.. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి దగ్గర నుంచి నలభై లక్షల రూపాయల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 363 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి, 1లక్ష 90 వేల రూపాయల నగదు, 15 మోటార్ సైకిళ్ళు, ఎలక్ట్రిక్ పరికరాలు బోరు మోటార్, ఐరన్ కట్టర్, గ్రైండర్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో అక్రమంగా టపాసుల తయారీ, సరఫరా, విక్రయాలు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీపావళి పండుగ నేపధ్యంలో నిబంధనలను అతిక్రమించి టపాసులు విక్రయించిన, నిల్వ ఉంచిన కఠిన శిక్ష విధిస్తామని చెప్పారు. లైసెన్స్ కల్గిన వారు మాత్రమే ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి బాణాసంచా తయారీ లేదా విక్రయాలు చేయాలి అని ఆయన సూచించారు.ఇక, బాణా సంచా లాంటి పేలుడు పదార్థాలు ఇంట్లో నిల్వ ఉంచరాదు అని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో నిర్ణీత ప్రమాణాల మేరకు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసుకుని విక్రయించుకోవాలి.. షాపుల దగ్గర, నీరు, ఇసుక తదితర అగ్నిమాపక సామగ్రిని తప్పని సరిగా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
* బరితెగించిన సైబర్ కేటుగాళ్లు
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలా ఎవరిని వదిలిపెట్టకుండా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. గతంలో జిల్లా కలెక్టర్ కు సైబర్ క్రిమినల్స్ షాకిచ్చారు. ఇక తాజాగా సిద్ధిపేట పోలీస్ కమిషనర్‌కు సైబర్ నేరగాళ్లతో తలనొప్పి తప్పలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సిద్ధిపేట పోలీస్ కమిషనర్ శ్వేత సెల్ నెంబర్ 9934941611 పైన సైబర్ నేరగాళ్లు ఫేక్ ఐడీ క్రియేట్ చేశారు. ఈ ఐడీ ద్వారా డబ్బులు అత్యవసరంగా ఉన్నాయని రూ.30వేలు పంపించమని, తిరిగి గంట లోపు పంపిస్తానని మెసేజ్‌లు పంపిస్తున్నారు.ఈ మెసేజ్‌లు చూసి పోలీస్ కమిషనర్ డబ్బులు పంపించమని అడగడం ఏమిటని ప్రజలు, పోలీస్ అధికారులు అశ్చర్యానికి గురయ్యారు. ఏకంగా పోలీస్ కమిషనర్ పేరిట ఫేక్ ఐడీ క్రియేట్ చేసి డబ్బులు అడిగినట్లుగా మెసేజ్ లు వెళ్లడంపై పోలీస్ కమిషనర్ శ్వేత షాక్ కు గురయ్యారు. వెంటనే అప్రమత్తం అయిన పోలీస్ కమిషనర్ శ్వేత తగిన చర్యలు చేపట్టారు. తన పేరుతో ఎవరైన మెసేజ్‌లు పంపినా ఎవరూ స్పందించ వద్దని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ఫ్రాడ్ మెసేజ్‌ల విషయంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీపీ శ్వేత సూచించారు.
* వాహన తనిఖీలు చేస్తున్న పోలీసును ఢీ కొట్టి
గుజరాత్‌లో దారుణం చోటు చేసుకుంది. సూరత్ (Surat)లో వెహికల్ చెకింగ్ చేస్తున్న ఓ పోలీసు అధికారిని కారు ఢీ కొట్టింది. అనంతరం అలాగే 400 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. కతర్గాం ప్రాంతం (Katargam area)లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సూరత్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఝలా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.కతర్గాం పోలీస్ స్టేషన్‌కు చెందిన బృందం స్థానిక అల్కాపురి ఓవర్ బ్రిడ్జి (Alkapuri overbridge) కింద వాహన తనిఖీలు (vehicle checking) చేపట్టారు. ఈ క్రమంలో నంబర్ ప్లేట్ లేని తెల్లటి స్కోడా కారును గుర్తించారు. ఆ కారును ఆపేందుకు ప్రయత్నించగా.. డ్రైవర్ వేగంగా వెళ్లి ఓ పోలీసును ఢీ కొట్టాడు. దీంతో సదరు పోలీసు కారు బ్యానెట్ (Cars Bonnet)పై ఉండిపోయాడు. డ్రైవర్ కారును ఆపకుండా 300 నుంచి 400 మీటర్ల దూరం అలానే ఈడ్చుకెళ్లాడు. తనిఖీల్లో పాల్గొన్న ఇతర పోలీసులు ఆ కారును ఆపేందుకు దాని వెంటే అనుసరించారు. ఈ క్రమంలో వేగంగా వెళ్తున్న కారు.. స్పీడ్ బ్రేకర్‌ను ఢీకొట్టడంతో బ్యానెట్‌పై ఉన్న పోలీసు అధికారి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన ఆ పోలీసును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఆయన వివరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు కారణమైన కారు డ్రైవర్‌ను గౌతమ్ జోషీగా గుర్తించారు. కారును స్వాధీనం చేసుకొని అతడిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు.
* పాములలంకలో తీవ్ర విషాదం
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం తోటవల్లూరు మండలంలోని పాములలంక గ్రామంలో పొలంలో విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతులను పాములలంకకు చెందిన విజయాంభ, చిరంజీవిగా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉 – Please join our whatsapp channel here –