Devotional

ఇంద్రకీలాద్రి భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించి అభివృద్ధి పనులు

ఇంద్రకీలాద్రి భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించి అభివృద్ధి పనులు

ఇంద్రకీలాద్రి అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇచ్చేలా తుది మాస్టర్‌ ప్లాన్‌ ఉండాలి. దేవాలయ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనలతో దీనిని రూపొందిద్దాం. రూ.200 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు పూర్తయితే, భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకుంటారని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు పేర్కొన్నారు. నగరంలోని విడిది కార్యాలయంలో పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌, మేయర్‌ భాగ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులతో ఆకృతులను (డిజైన్లను), రేఖా చిత్రాలను మంగళవారం పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. మహాద్వార రాజగోపురం నిర్మాణం, కనకదుర్గనగర్‌ నుంచి మహామండపం వరకు నాలుగు వరుసల సీసీ దారులు, సర్వీసు రోడ్ల నిర్మాణం, కాలిబాటలు నిర్మించాలన్నారు. సెంట్రల్‌ లైటింగ్‌, భూగర్భ డ్రెయినేజీ, ల్యాండ్‌ స్కేపింగ్‌, హార్డ్‌ స్కేపింగ్‌ వంటి పనులతో ముసాయిదా ప్లాన్‌ వేశామన్నారు.

టోల్‌ ప్లాజా నుంచి అన్నదాన భవనం వరకు ఎలివేటెడ్‌ క్యూ కాంప్లెక్సుల ఏర్పాటు, అన్నదాన భవన నిర్మాణం చేయనున్నారు. అన్నదాన భవనం, టోల్‌ప్లాజా నుంచి మల్లికార్జున మహామండప టెర్రస్‌కు మెట్ల మార్గం ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రసాదాల తయారీకి లడ్డూ పోటు భవన నిర్మాణం, ప్రస్తుత మహామండప భవనంలో క్యూ కాంప్లెక్సు విస్తరణ, మరుగుదొడ్ల ఆధునికీకరణ.. క్యూ లైన్లలో, అన్ని అంతస్తుల్లోనూ అవసరమైన మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించామన్నారు.

పాత అరండాల్‌ సత్రం, కార్పొరేషన్‌ హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ ఎదురుగా కేశ ఖండన శాల భవనాన్ని నిర్మిస్తామన్నారు. డార్మెటరీ హాళ్లు, గదులు, సూట్‌ల నిర్మాణం చేపడతామన్నారు. కనకదుర్గనగర్‌ వద్ద మల్టీ లెవెల్‌ కారు పార్కింగ్‌ వసతి సమకూరుస్తామన్నారు.

ఇకపై విడతకు 2,500 మంది అన్నప్రసాదం తీసుకునేలా విస్తరించనున్నామనీ.. నూతన కేశఖండనశాల, 22 గదులతో ఆరు డార్మెటరీల నిర్మాణానికి ప్రతిపాదించామన్నారు. దుర్గాఘాట్‌లో మైరుగైన సౌకర్యాలు కల్పించేలా 75 మీటర్ల మేర విస్తరణకు యోచనలో ఉన్నట్టు తెలిపారు. కనకదుర్గ ఘాట్‌ విస్తరణకు ప్రతిపాదించారు.

కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌, సబ్‌ కలెక్టర్‌ అదితిసింగ్‌, ఆలయ పాలక మండలి ఛైర్మన్‌ రాంబాబు, ఈవో కె.ఎస్‌.రామారావు, ఈఈలు కోటేశ్వరరావు, రమ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సురేష్‌రెడ్డి, జలవనరుల శాఖ కేసీ డివిజన్‌ ఈఈ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z