ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ.10 లక్షల జరిమానా విధించింది. సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్ (CAR) అమలు చేయనందుకుగానూ ఈ జరిమానా విధించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దాంతోపాటు షోకాజ్ నోటీసు జారీ చేసింది. విమానయాన సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రయాణికులకు సర్వీస్‌లను అందించాల్సిన అవసరం ఉందని డీజీసీఏ స్పష్టం చేసింది. ‘‘విమాన సర్వీసులు రద్దైనా, ఆలస్యమైనా, ఏదైనా కారణంచేత ప్రయాణికులను బోర్డింగ్‌కు అనుమతించకున్నా.. విమానయాన సంస్థలు వారికి తగిన సౌకర్యాలు కల్పించాలి. ఎయిరిండియా దేశీయ విమాన సర్వీసులకు సంబంధించి ఈ ఏడాది మే నెలలో డీజీసీఏ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఎయిరిండియా సంస్థ సీఏఆర్‌ను అమలు చేయడంలేదని గుర్తించాం. దానిపై వివరణ ఇవ్వాలని సంస్థకు నోటీసులు జారీ చేశాం. అదే సమయంలో గతేడాది నిర్వహించిన తనిఖీలకు సంబంధించి సీఏఆర్ అమలు చేయనుందుకు రూ.10 లక్షలు జరిమానా విధించాం’’ అని డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ తనిఖీలు ఏయే నగరాల్లోని విమానాశ్రయాల్లో నిర్వహించారన్న వివరాలను డీజీసీఏ వెల్లడించలేదు.
👉 – Please join our whatsapp channel here –