Politics

ఈటల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

ఈటల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లలో తమ ఆస్తులు, తమపై నమోదై ఉన్న కేసుల వివరాలను వెల్లడించారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కోటీశ్వరులే ఎక్కువగా ఉన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయం నుంచి అసెంబ్లీలో నిరసనల వరకు తనపై 40 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు హుజూరాబాద్‌ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ అఫిడవిట్లో వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ తరఫున ఆయన సోదరుడు భద్రయ్య మంగళవారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.రాజుకు నామినేషన్‌ అందజేశారు. దాంతోపాటే అఫిడవిట్‌ కూడా సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉప్పల్‌ స్టేషన్‌తో పాటు పలు చోట్ల రైలు పట్టాలపై చేపట్టిన ఆందోళనకు సంబంధించి కేసులు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌ పేరిట రూ.లక్ష నగదు మాత్రమే ఉన్నట్లు చూపించారు. స్థిరాస్తులు రూ.12.50 కోట్లు, చరాస్తులు రూ.16.74 లక్షలు ఉండగా అప్పులు రూ.3.48 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈటల భార్య ఈటల జమున వద్ద నగదు రూ.1.50 లక్షలు ఉండగా ఆమె పేరుపై రూ.14.78 కోట్ల స్థిరాస్తులు, రూ.26.48 కోట్ల చరాస్తులు, 1,500 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు వివరించారు. రూ.15.51 కోట్ల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తనకు మొత్తం రూ.53.94 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

మల్‌రెడ్డి రంగారెడ్డికి రూ.83.78కోట్లు..
ఖమ్మం నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థిగా పోటీచేస్తున్న పువ్వాడ అజయ్‌కుమార్‌ తమకుటుంబానికి రూ.51.40 కోట్ల ఆస్తులున్నాయని పేర్కొన్నారు పార్టీ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యక్తిగతంగా 30.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, కుటుంబం మొత్తానికి కలిపి 40.38 ఎకరాలు ఉన్నాయని పేర్కొన్నారు. కుటుంబ ఆస్తుల విలువ రూ.22.43 కోట్లు, ఇందులో బంగారం 2.6కిలోలుగా వివరించారు. నల్గొండ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబానికి రూ.39.55కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన భార్య సబితకు 2.1కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయని, ఆస్తులతో పాటు అప్పులు రూ.6.44కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. జగిత్యాల అభ్యర్థిగా పోటీచేస్తున్న జీవన్‌రెడ్డి తన పేరిట 31.36 ఎకరాలు, భార్యపేరిట 3.28 ఎకరాల వ్యవసాయభూములు ఉన్నాయని వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z