Politics

బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనడం నా అదృష్టం

బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనడం నా అదృష్టం

ఢంకా భజాయించి చెబుతున్నా.. భారాస ఓటమి ఖాయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ ముఖ్యఅథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారాస, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

‘‘పుణ్యభూమి తెలంగాణకు ప్రణామాలు. బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనడం నా అదృష్టం. మీ ఆశీర్వాదంతోనే నేను ప్రధాని అయ్యాను. మీ ఆశీర్వాదంతోనే భాజపా బీసీ వ్యక్తి తెలంగాణ సీఎం అవుతారు. అన్ని వర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది. నీళ్లు, నిధులు, నియామకాలపై భారాస మోసం చేసింది. తొమ్మిదేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విరోధి అధికారంలో ఉన్నారు. బీసీల ఆకాంక్షలను ఎప్పుడూ భారాస పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చాక బీసీలను మోసం చేశారు. తెలంగాణ ప్రజలు భాజపాపైనే విశ్వాసంతో ఉన్నారు.

భారాస.. కాంగ్రెస్‌ సీటీమ్‌, కాంగ్రెస్‌.. భారాస సీటీమ్‌. భారాస, కాంగ్రెస్‌ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు భారాస, కాంగ్రెస్‌ లక్షణాలు. బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది భాజపా మాత్రమే. బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది భాజపానే. అబ్దుల్‌ కలామ్‌ను వాజ్‌పేయీ రాష్ట్రపతిని చేశారు. పీఏ సంగ్మా, బాలయోగిని స్పీకర్‌ చేసింది, రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతిని చేసింది, గిరిజన మహిళ ద్రౌపదిముర్మును రాష్ట్రపతిని చేసింది భాజపానే. ఓబీసీ అయిన నన్ను ప్రధానిని చేసింది భాజపానే. ఓబీసీ కేంద్రమంత్రులు ఎక్కువగా ఉన్నది ఎన్డీఏ హయాంలోనే. ఓబీసీలకు ఎంపీలుగా ఎక్కువ అవకాశాలిచ్చింది భాజపానే. బీసీ యువత కోసం భారాస ఏమీ చేయట్లేదు. బీసీలకు రూ.లక్ష ఇస్తామన్న వాగ్దానాన్ని భారాస నెరవేర్చలేదు. మెడికల్‌, డెంటల్‌ సీట్లలో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. విశ్వకర్మ పథకం ద్వారా బీసీలకు అవకాశాలిచ్చాం. భారాస నేతల్లో అహంకారం కనిపిస్తోంది. అవినీతి సర్కారును ఇంటికి పంపడం ఖాయం. తెలంగాణలో భాజపా సర్కారు ఏర్పడటం ఖాయం. పేదలకు ఐదేళ్లపాటు ఉచితంగా బియ్యం అందిస్తాం. పేదలకు ఉచిత రేషన్‌.. ఇది మోదీ ఇస్తున్న గ్యారెంటీ’’ అని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z