పని ప్రదేశాల్లో ఏ రూపంలో లైంగిక వేధింపులు జరిగినా వాటిని తీవ్రంగా పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మాజీ అధికారికి పెన్షన్‌లో 50 శాతం కోత పెట్టాలన్న కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. ‘‘లైంగిక వేధింపులు ప్రపంచవ్యాప్తంగా సమస్యగా మారాయి. భారత్‌లో ఇది చాలా తీవ్రమైన అంశం. వీటిని ఎదుర్కోవడానికి చట్టాలు చేయడం.. సమస్య పరిష్కారం పట్ల దేశం చూపుతున్న నిబద్ధతకు నిదర్శనం’’ అని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. అస్సాంలోని రంగియాలో సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) సంస్థలో ఏరియా ఆర్గనైజర్‌గా పనిచేసిన దిలీప్ పాల్ అనే అధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ మహిళా ఉద్యోగి ఆరోపించింది. దీనిపై ఉన్నతస్థాయిలో విచారణ జరిగింది. నిందితుడికి నెలనెలా వచ్చే పెన్షన్‌లో 50శాతం కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని సవాల్ చేస్తూ దిలీప్.. గువాహటి హైకోర్టును ఆశ్రయించాడు. పెన్షన్‌లో కోత పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేస్తూ హైకోర్టు 2019లో తీర్పునిచ్చింది. దీనిపై కేంద్రం సుప్రీంకోర్టులో అపీలు దాఖలు చేసింది. ‘‘ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు పెద్ద తప్పిదం. దాన్ని కొట్టేస్తున్నాం. పని ప్రదేశంలో లైంగిక వేధింపులను తీవ్రంగా పరిగణించాలి. అలాంటి చర్యలకు పాల్పడ్డ వ్యక్తిని చట్టం నుంచి తప్పించుకోవడానికి అనుమతించకూడదు. అతడికి తగిన శిక్ష పడకపోయినా, తక్కువ శిక్షతో తప్పించుకున్నా బాధితురాలికి తీవ్ర అవమానం జరిగినట్లే’’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.
👉 – Please join our whatsapp channel here –