నల్గొండ ప్రజల ఆశీర్వాదంతో ఏదో ఒక రోజు తెలంగాణకు సీఎం అవుతానని, ఇప్పుడే కావాలనే తొందర లేదని నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం అనుచరులు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం నల్గొండ పట్టణంలోని గడియారం కూడలిలో పెద్దసంఖ్యలో హాజరైన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2018లో కేసీఆర్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను వంచించారని ఆరోపించారు. ఏపీలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసీ.. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారన్నారు. దీన్ని కేసీఆర్ అవకాశంగా తీసుకుని ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో రూ.కోట్లు ఆర్జించారని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీలో భారాస ప్రభుత్వం విఫలమైందన్నారు. నల్గొండలో తాను చేసిన అభివృద్ధి తప్ప భారాస చేసిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, నకిరేకల్ అభ్యర్థి వేముల వీరేశం, శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, పాశం రాంరెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –