కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ సోదాలు జరిగే అవకాశం ఉందని ఆ పార్టీ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపైనా, తన కుటుంబంపైనా ఐటీ సోదాలకు ఆస్కారం ఉందన్నారు. భాజపా, భారాస కుమ్మక్కై తనపై ఐటీ దాడులు చేయించాలని చూస్తున్నాయని.. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇలాంటి ఇబ్బందులు కొన్ని రోజులు తప్పవని పొంగులేటి వ్యాఖ్యానించారు.‘‘కాంగ్రెస్‌లో చేరితే భాజపా, భారాస ఇబ్బందులు పెడతాయని ముందే ఊహించాను. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ.. అందుకే దీనిలో చేరాను. కేసీఆర్ అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు లీకులు వెంటాడుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలే నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కొందరు పోలీసులు భారాసకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
👉 – Please join our whatsapp channel here –