* తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో పోలీస్ సోదాలు
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో పోలీసులు సోదాలు చేశారు. ఖమ్మంలోని రూరల్ మండలం శ్రీ సిటీలో నివాసం ఉంటున్న తుమ్మల నాగేశ్వరావు ఇంట్లో పోలీస్ సోదాలు నిర్వహించారు. తుమ్మల ఇంట్లో పోలీస్ సోదాలు నిర్వహించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.పోలీస్ సోదాలు జరుపుతున్న సమయంలో తుమ్మల ఇంట్లో లేనట్లు తెలుస్తోంది.
* కాంగ్రెస్‌కు బిగ్ షాక్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల్లో వలసలు ఊపందుకున్నాయి. తమకు ఆశించిన సీటు దక్కలేదని కొంత మంది, పార్టీలో సరైన ప్రియారిటీ దక్కడం లేదని మరి కొంత మంది పార్టీలు మారుతున్నారు. తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీ-కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. హస్తం పార్టీకి టీపీసీసీ ఉపాధ్యక్షులు జగదీష్ రావు రాజీనామా చేశారు. ముషీరాబాద్ టికెట్ ఆశించి జగదీష్ రావు భంగపడ్డారు. పారాచూట్ నేతలకు టికెట్లు ఇస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆయన ఏ పార్టీలో చేరబోయేది ఆసక్తిగా మారింది.
* కేసీఆర్ హెలికాప్టర్‌లో మళ్లీ సాంకేతిక సమస్య
సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సిర్పూర్ కాగజ్ నగర్‌లో హెలికాప్టర్‌ను నిలిపివేశారు. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య కారణంగా రోడ్డు మార్గం గుండా ఆసిఫాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనడానికి సీఎం కేసీఆర్ బయలుదేరారు.
* పవన్ పై ఓయూ విద్యార్థులు ఆగ్రహం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30 నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. నిన్న హైదరాబాద్ లోని ఎల్బీస్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు ప్రధాని మోడీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచ్చేసారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బీసీ సభలో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియమాకాల కోసం జరిగిందని.. కానీ అవి అమలు జరిగాయా అని ప్రశ్నించారు.దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఓయూ విద్యార్థులు వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓ బ్రోకర్ అని.. పవన్ కళ్యాణ్ ఓ ఐటమ్ సాంగ్ చేసే వ్యక్తి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పవన్ ఏనాడు పోరాడలేదు. ఏనాడు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ ఇక్కడ రాజకీయాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు ఓయూ విద్యార్థులు. పవన్ ను తరిమికొడతామని తెలిపారు.
* ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో (Delhi Air Pollution) చిక్కుకుంది. చుట్టు పక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతోపాటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. రాజధానిలో (national capital) తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు శీతాకాల సెలవులు ప్రకటించింది. నవంబర్ 9 నుంచి 18వ తేదీ వరకూ అన్ని పాఠశాలలకు ముందస్తు శీతాకాల సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యశాఖ ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా ఢిల్లీలో పాఠశాలలకు శీతాకాల సెలవులు జనవరిలో ఇస్తుంటారు. అయితే, ఈ సారి తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ముందుగానే ప్రకటించారు.ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. కాలుష్యానికి తోడు పెద్ద ఎత్తున పొగమంచు నగరాన్ని కమ్మేస్తోంది. దీంతో నగరంలో గాలి నాణ్యత భారీగా పడిపోయింది. పంజాబీ బాగ్‌లో గాలి నాణ్యత సూచీ (AQI) 460కి చేరింది. ఆనంద్ విహార్‌లో 452, ఆర్‌కేపురంలో 433గా నమోదైందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) పేర్కొంది. ఢిల్లీ అంతటా గాలి నాణ్యత అధ్వానంగా కొనసాగుతోందని పేర్కొంది.కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని గౌతమ్‌బుద్ధానగర్, ఘజియాబాద్‌లో ఉన్నత పాఠశాలలను ప్రభుత్వం ఇప్పటికే మూసివేసింది. రాబోయే ఆరురోజుల పాటు ఢిల్లీలో వాతావరణం మరింత అధ్వానస్థాయికి చేరుకుంటుందని అంచనా. ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని.. దాంతో కాలుష్యం స్థాయి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, నవంబర్ 10న ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొంది. 13వ తేదీ వరకు ఉదయం వేళల్లో పొగమంచు పేరుకుపోతుందని పేర్కొంది.
* విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీకి లోకేశ్ అభినందనలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అని నినదిస్తూ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి కార్మిక శక్తి పిడికిలి బిగించి వెయ్య రోజులకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీకి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటానికి తెలుగుదేశం పార్టీ మద్దతు సంపూర్ణంగా ఉంటుంది అని లోకేశ్ ఈ మేరకు ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘పోరాట యోధులకు విశాఖ విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రజలు సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్.. జగన్ అనే అవినీతి నేర పాలకుడి వల్ల ప్రైవేటు పడుతోంది. స్టీల్‍ప్లాంట్ ప్రైవేటీకరణకి నిరసనగా పోరాట కమిటీ చేపట్టిన ఉద్యమానికి వెయ్యి రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా కార్మికులకి ఉద్యమాభివందనాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటానికి తెలుగుదేశం పార్టీ మద్దతు సంపూర్ణంగా ఉంటుంది’ అని నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.
* హనుమంతరావుపై హరీష్‌రావు ఆగ్రహం
మైనంపల్లి హనుమంతరావుపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్‌గిరిలో మైనంపల్లి ఓటమి ఖాయమన్నారు. డబ్బులు ఉన్నాయనే అహంకారంతో హనుమంతరావు దిగజారి మాట్లాడుతున్నారని హరీష్‌రావు ఆరోపించారు. మైనంపల్లి డబ్బుమైనాన్ని ఓటుతో కరిగించాలని మల్కాజగిరి ప్రజలకు హరీష్‌రావు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిని గెలిపిస్తే మల్కాజ్‌గిరిని దత్తత తీసుకుంటానని మంత్రి హరీష్‌రావు హామీనిచ్చారు.
* రష్మిక డీప్‌ఫేక్ వీడియోపై కేటీఆర్ ఆగ్రహం
సినీ నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు ఇప్పటికే స్పందించారు. టెక్నాలజీ దుర్వినియోగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై తాజాగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.ఓ నేషనల్ ఛానెల్ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. రష్మిక మార్ఫింగ్ వీడియో గురించి ప్రస్తావించారు. అదో అవమానకరమైన చర్యగా అభివర్ణించార. నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో గురించి వార్తల్లో చూసినట్లు చెప్పారు. అదో చేదు అనుభవమని.. ఓ సెలబ్రిటీని ఈ విధంగా కించపరచడం నిజంగా దారుణమని అన్నారు. ఇలాంటి ఘటనల కట్టడికి చట్టపరంగా చర్యలు తీసుకువస్తే వాటిని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలపై భారత ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.ఇంతకీ ఏం జరిగిందంటే..కొందరు ఆకతాయిలు ఫొటోను మార్ఫింగ్ చేసి ఓ అసభ్యకర వీడియోను సృష్టించారు. వీడియోలో రష్మిక బాగా ఎక్స్‌పోజింగ్ చేసినట్టు కనిపిస్తుంది. వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. రష్మిక ఏంటి.. ఇలా తయారైంది అంటూ మాట్లాడుకున్నారు. దీనిపై అనుమానం వచ్చిన కొందరు నెటిజన్లు.. అసలు నిజాన్ని బయటపెట్టారు. ఇది ఒరిజినల్ వీడియో జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించినదిగా తేల్చారు. ఆమె వీడియోని ఎవరో రష్మిక ఫేస్ తో అనుమానం రాకుండా మార్ఫింగ్ చేసి రిలీజ్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఒరిజినల్ వీడియో, రష్మిక డీప్‌ఫేక్ మార్ఫింగ్ వీడియోను షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నెటిజన్లే కాదు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సీరియస్ అయ్యారు. ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
👉 – Please join our whatsapp channel here –