Business

ఫోన్‌పే మరో రికార్డు-వాణిజ్య వార్తలు

ఫోన్‌పే మరో రికార్డు-వాణిజ్య వార్తలు

ఫోన్‌పే మరో రికార్డు

 ఆర్థిక సేవల సంస్థ ఫోన్‌పే మరో రికార్డును సాధించింది. 50 కోట్ల మంది కస్టమర్లు ఫోన్‌పే సేవలను వినియోగించుకుంటున్నారు. అంతర్జాతీయంగా 50 కోట్ల మంది యూజర్లు కలిగిన తొలి భారతీయ సంస్థ ఫోన్‌పే కావడం విశేషం. ఈ సందర్భంగా ఫోన్‌పే ఫౌండర్‌, సీఈవో సమీర్‌ నిగమ్‌ మాట్లాడుతూ.. స్వల్పకాలంలోనే 50 కోట్ల మైలురాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని, సంస్థ పెట్టుకున్న 100 కోట్ల భారతీయుల్లో సగానికి చేరుకున్నట్టు తెలిపారు. జనవరి 2022 నాటికి 35 కోట్ల యూజర్లకు చేరుకున్న సంస్థ..ఆ మరుసటి ఏడాదిన్నరలోగా మరో 15 కోట్ల కస్టమర్లను ఆకట్టుకోవడం విశేషమన్నారు. ప్రతి ముగ్గురి భారతీయుల్లో ఒక్కరు ఫోన్‌పేను వినియోగిస్తున్నారు. కేవలం ఏడేండ్లలో ఈ మైలురాయికి చేరుకున్నది. ఆగస్టు, 2016లో ఫోన్‌పే ఆర్థిక సేవలు ఆరంభించిన విశేషం తెలిసిందే.

 వోల్టాస్‌ సెల్లింగ్‌పై టాటా గ్రూప్‌ స్పందన

వోల్టాస్‌ లిమిటెడ్‌ను విక్రయిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను మాతృ సంస్థ టాటా గ్రూప్‌ స్పందించింది. గృహోపకరణాలకు చెందిన వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. వార్తలన్నీ తప్పని.. సత్యదూరమైనవని స్టాక్‌ మార్కెట్లకు పంపిన సమాచారం కంపెనీ పేర్కొంది. మీడియాలో వచ్చిన వార్తలతో షేర్‌ హోల్డర్లు, ఇన్వెస్టర్లను ఆందోళనతో పాటు ఇబ్బందికి గురి చేశాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. టాటా గ్రూప్‌ ఉప్పు నుంచి విమానాల వరకు వివిధ వ్యాపారులను చేస్తున్నది.అయితే, టాటా గ్రూప్‌లోని గృహోపకరాల కంపెనీ వోల్టాస్‌ను విక్రయించనున్నదని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయనే వార్తలు వచ్చాయి. వోల్టాస్‌ 1954లో ఏర్పాటైంది. కంపెనీ ఎయిర్‌ కండీషనర్లు, వాటర్‌ కూలర్లు, కమర్షియల్‌ రిఫ్రిజిరేటర్లను తయారు చేస్తున్నది. భారత్‌తో పాటు పశ్చిమ ఆసియా, ఆఫ్రికా తదితర దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నది. వోల్టాస్‌ అర్సెలిక్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌ను సైతం ఏర్పాటు చేసింది. దేశీయ రిఫ్రిజిరేటర్ల మార్కెట్‌లో వోల్టాస్‌ కంపెనీకి 3.4 శాతం, వాషింగ్‌ మెషిన్ల మార్కెట్లో 5.4 శాతం వాటా ఉన్నది.

స్వల్ప లాభాలతో దేశీయ మార్కెట్లు

దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ లాభాలను సాధించాయి. అంతకుముందు సెషన్‌లో స్వల్పంగా నష్టపోయిన తర్వాత బుధవారం ట్రేడింగ్‌లో సూచీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొని తక్కువ లాభాలతో సరిపెట్టాయి. ఆసియా మార్కెట్ల మిశ్రమ సంకేతాలు, అమెరికా ఫెడ్ చైర్మన్ కీలక ప్రసంగం ఉండటం, భారత ఈక్విటీల నుంచి విదేశీ నిధుల ఉపసంహరణ కొనసాగినప్పటికీ మార్కెట్లు నిలదొక్కుకున్నాయి. ఉదయం నుంచే అప్రమత్తంగా వ్యవహరించిన మదుపర్లు చివరి వరకు అదే ధోరణిలో కొనసాగారు.దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 33.21 పాయింట్లు లాభపడి 64,975 వద్ద, నిఫ్టీ 36.80 పాయింట్లు పెరిగి 19,443 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా, రియల్టీ, హెల్త్‌కేర్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, టైటాన్, ఎల్అండ్‌టీ, ఐటీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ సుజుకి కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.28 వద్ద ఉంది.

ఆరు ఉత్పత్తులతో ‘భారత్‌ ఆర్గానిక్స్‌’ బ్రాండ్

 దేశంలో సేంద్రియ ఉత్పత్తులను పండించే వారి కోసం నేషనల్‌ కోఆపరేటివ్‌ ఆర్గానిక్స్ లిమిటెడ్ (NCOL)ను ప్రారంభించినట్లు కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. బుధవారం ఎన్‌సీఓఎల్‌లో భాగంగా ఆరు ఉత్పత్తులతో ‘భారత్‌ ఆర్గానిక్స్‌’ (Bharat Organics) బ్రాండ్‌ను అమిత్‌ షా విడుదల చేశారు. త్వరలో ఇది భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైన బ్రాండ్‌గా మారుతుందని అమిత్‌ షా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీఓల్‌ లోగో, వెబ్‌సైట్‌ను విడుదల చేసి, ఐదు సహకార సంఘాలకు ఎన్‌సీఓఎల్‌ ధ్రువపత్రాలను అందజేశారు. భారత్‌ ఆర్గానిక్స్ బ్రాండ్ ద్వారా సేంద్రియ పద్ధతిలో పండించిన కంది పప్పు, శనగ పప్పు, పంచదార, రాజ్మా, బాస్మతి బియ్యం, సోనామసూరి బియ్యంలను విక్రయిస్తారు. డిసెంబరు నాటికి ఈ బ్రాండ్‌ కింద మరో 20 ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తాం. మదర్‌ డెయిరీ సఫల్‌ అవుట్‌లెట్లతోపాటు, ఆన్‌లైన్‌లో భారత్‌ ఆర్గానిక్స్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చు. క్రమంగా ఈ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తాం. వీటి అమ్మకాల ద్వారా వచ్చిన లాభాల్లో 50 శాతం నేరుగా వాటిని పండించిన వారి ఖాతాలకు బదిలీ అవుతాయి’’ అని అమిత్‌ షా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో 749 లక్షల హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయం జరుగుతోంది. 2020నాటి డేటా ప్రకారం సేంద్రియ వ్యవసాయం చేసే దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. భారత్‌లో 27 లక్షల హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయం జరుగుతోంది. 2022-23 గణాంకాల ప్రకారం భారత్‌లో ఏటా 29 లక్షల టన్నుల సేంద్రియ ఉత్పత్తులను పండిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి సుమారు రూ.5,525 కోట్లు విలువైన మూడు లక్షల టన్నుల ఆర్గానిక్‌ ఉత్పత్తులు అమెరికా, యూరప్‌, కెనడా సహా పలు దేశాలకు ఎగుమతి అయ్యాయి. మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌ సహా ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయం ఎక్కువగా జరుగుతోంది. 

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, HAL మేనేజర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు HAL hal-india.co.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. నోటిఫికేషన్‌లో అందించిన వివరాల ప్రకారం, దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 30 నవంబర్ 2023.

BSNL దీపావళి ధమాకా ఆఫర్‌

ఈ మధ్య కాలంలో రీఛార్జ్‌ ప్లాన్ల రేట్లు బాగా పెరిగిపోయాయి. నెలకు వచ్చేసరికి రూ.200 నుంచి రూ.250 ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగరులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.. దీపావళి పండగ కానుకగా ప్రభుత్వరంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ (BSNL) తమ యూజర్ల కోసం ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీపావళి (Diwali) నేపథ్యంలో.. ఈ రీఛార్జ్‌ ప్లాన్లను ప్రవేశపెట్టింది. కాకపోతే ఈ రీఛార్జ్‌ ప్లాన్స్‌తో కాలింగ్‌, ఎస్‌ఎమ్‌ఎస్ బెనిఫిట్స్‌ ఉండవు. కేవలం డేటా మాత్రమే వస్తుంది.బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్ల కోసం రూ. 251 ప్లాన్‌ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 70 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. డేటా మాత్రమే కావాలనుకునే వారు.. ఈ ప్లానును ఎంచుకోవచ్చు.బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్ల కోసం రూ.599 ప్లాన్‌ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 252 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది. అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లతో పాటు రోజుకు 3 జీబీ డేటాను పొందొచ్చు. అంతే కాకుండా ఈ రీఛార్జ్‌ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ నైట్‌ డేటాను కూడాపొందొచ్చు.

యూఏఈ’కు లీ ఫార్మా స్మూత్‌‌‌‌‌‌‌‌వాక్ టాబ్లెట్స్

ఫార్మాస్యూటికల్ కంపెనీ లీ ఫార్మా.. కీళ్ల వ్యాధి చికిత్సలో వాడే  బయో-కార్టిలేజ్ స్మూత్‌‌‌‌‌‌‌‌వాక్ టాబ్లెట్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతంలో మార్కెట్ చేయనుంది. యూఏఈకి చెందిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్  నుంచి ఈ మేరకు అనుమతి పొందింది.  భారత్ లో తయారైన ఇటువంటి ఉత్పాదనకు యూఏఈలో ఆమోదం రావడం ఇదే మొదటిసారి అని ప్రకటించింది. ఈ ఉత్పత్తిని ఆన్ని మధ్యప్రాచ్య దేశాలలో, తూర్పు ఆసియా దేశాలలో విక్రయించేందుకు కంపెనీ దరఖాస్తు చేసుకుంది. అలాగే మార్కెటింగ్ ఆథరైజేషన్ కోసం యూఎస్ ప్రభుత్వానికి 2024 మూడవ క్వార్టర్​లో  దరఖాస్తు చేస్తామని కంపెనీ డైరెక్టర్ లీలా రాణి ఈ సందర్భంగా తెలిపారు