Politics

దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు మోదీ ప్రత్యేక విజ్ఞప్తి

దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు మోదీ ప్రత్యేక విజ్ఞప్తి

దీపావళి (Diwali) పండుగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ (PM Modi) బుధవారం ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలంతా ఈ పండుగకు స్థానికంగా తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసి లోకల్‌ ఫర్‌ వోకల్‌ (Local For Vocal)కు మద్దతు తెలపాలని కోరారు. ప్రజలు తాము కొనుగోలు చేసిన ఉత్పత్తులతో సెల్ఫీ తీసుకుని నమో యాప్‌ (NAMO App)లో అప్‌లోడ్ చేయాలని కోరారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.

‘‘ఈ దీపావళి పండుగను భారత సృజనాత్మక స్ఫూర్తి, వ్యాపార సామర్థ్యంతో కలిసి చేసుకుందాం. స్థానికంగా తయారుచేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటితో సెల్ఫీ తీసుకుని నమో యాప్‌లో అప్‌లోడ్ చేయండి. మీ కుటుంబసభ్యులు, స్నేహితులను కూడా ఇందులో భాగస్వాములను చేయండి. స్థానిక ప్రతిభకు మద్దతు తెలిపేందుకు, ప్రోత్సహించేందుకు, మన సంప్రదాయాన్ని పెంపొందించేందుకు డిజిటల్‌ మీడియా శక్తిని ఉపయోగిద్దాం’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ చూసిన పలువురు నెటిజన్లు.. తాము ఇప్పటికే స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేశామని, అందుకు సంబంధించిన ఫొటోలను పోస్టు చేస్తున్నారు. గత నెలలో నిర్వహించిన మన్‌ కీ బాత్‌ (Mann Ki Baat)లో ప్రధాని మాట్లాడుతూ.. గతంలో తన పిలుపు మేరకు దసరా పండుగకు స్థానికంగా తయారైన ఉత్పత్తులను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారని, వాటి అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రతి పండుగకు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కోరారు. లోకల్‌ ఫర్‌ వోకల్‌ నినాదానికి ఇది ఎంతో బలాన్నిస్తుందని అన్నారు. తాజాగా మరోసారి దేశ ప్రజలకు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z