DailyDose

నోట్ రాసి యువతి ఆత్మహత్య-నేర వార్తలు

నోట్ రాసి యువతి ఆత్మహత్య-నేర వార్తలు

* నోట్ రాసి యువతి ఆత్మహత్య

‘నాన్నా ఇక నేను టీవీ చూడను, ఫోన్‌ చూడను…చెప్పుకోలేని అనారోగ్యంతో బాధపడుతున్నాను…ఇకపై మీకు ఎటువంటి సమస్య ఉండదు’ అని లెటర్ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు.ఎస్సై సత్యం కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా, రావల్‌వెల్లి మండలం కేశంపేట గ్రామానికి చెందిన కె.స్వామిగౌడ్‌ కుటుంబం కొన్నేళ్ల క్రితం బతుకు దెరువు కోసం నగరానికి వచ్చారు. ఇక్కడ జగద్గిరిగుట్ట సమీపంలోని పాపిరెడ్డినగర్‌లో నివాసముంటున్నారు. స్వామి గౌడ్ దంపతులకు కుమారుడు రవికుమార్‌, కుమార్తె దివ్య(21) ఉన్నారు. దివ్య డిగ్రీ పూర్తిచేసి ఓ ప్రైవేటు ఉద్యోగం చేసి మానేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆమెను.. ఉద్యోగం చూసుకోకుండా ఇంట్లో టీవీ, ఫోన్‌ చూస్తూ కాలం గడుపుతున్నావంటూ తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

* ఎన్నికల విధులకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం

ఛత్తీస్‌గఢ్‌ తొలి విడత ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో విషాదం చోటుచేసుకుంది. పోలింగ్‌ విధులు ముగించుకొని వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు ఉపాధ్యాయులు దుర్మరణం చెందారు. వీరు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ వాహనం ఓ ట్రక్కును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కొండగాన్‌ జిల్లా కేంద్రంలో ఈవీఎంలు అప్పగించి తిరిగి వస్తున్న సమయంలో కేశ్‌కాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బహిగాన్‌ గ్రామం సమీపంలో ñబుధవారం ఉదయాన్నే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారని తెలిపారు. మృతులను పాఠశాల ఉపాధ్యాయులు శివ్‌ నేతం, సంత్రం నేతం, హరేంద్ర యూకీలుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్థానాలకు గాను రెండు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మంగళవారం(నవంబర్‌ 7న) తొలి విడతలో 20 స్థానాలకు ఎన్నికలు పూర్తి కాగా.. మిగతా నియోజకవర్గాల్లో 17న పోలింగ్ జరగనుంది.

* కన్నకూతురినే కిరాతకంగా చంపిన తల్లి

అనంతపురం జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. గార్లదిన్నె మండలం కోటంకటో ఈ ఘటన చోటు చేసుకుంది. కూతురిని తల్లి దారుణంగా హత్య చేసింది. హత్యకు పాల్పడిన తల్లికి కుమారుడు సహకరించడం స్థానికంగా దుమారం రేపింది. ఇటీవల తాను ప్రేమ పెళ్లి చేసుకుంటానని కూతురు తల్లికి తెలిపింది. దీంతో తల్లి తట్టుకోలేకపోయింది. కూతురిని చున్నీతో తల్లి హత్య చేసింది. అనంతరం పోలీసు స్టేషన్ లో నిందితులు లొంగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* అనంతపురంలో దారుణం

తెలిసీ తెలియని వయసు తనది.. ప్రేమకి ఆకర్షణకి మధ్య తేడా తెలియని టీనేజ్.. తప్పును తప్పు అని చెప్తే ఒప్పుకోలేని కౌమార దశ.. చేస్తుంది తప్పు అని నెమ్మదిగా నచ్చ చెప్పాల్సిన బాధ్యత కుటుంభసభ్యులది. కానీ అలా చెయ్యలేదు. 18 సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చెయ్యాలి అనుకున్నారు. వినలేదని కొట్టి ఉరివేసి ప్రాణాలు తీశారు. ఈ దారుణ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా లోని గార్లదిన్నె మండలం లోని కోటంక గ్రామంలో ఓ మ్తెనర్ బాలికకు పెళ్లి చెయ్యాలి అనుకున్నారు. కాగా కుమార్తెకు పెళ్లి చేసే విషయంలో ఆ బాలికకు కుటుంబ సభ్యలకు మధ్య గొడవలు జరిగాయి. పెద్దలు చూసిన సంబంధం చేసుకోను అని.. తాను వేరే అబ్బాయి పేమించాను అంటూ.. తనకు నచ్చిన వాడిని చేసుకుంటాను అంటూ 17 ఏళ్ల మైనర్ బాలిక గొడవ పడింది. ఇలా గత కొంత కాలంగా ఇంట్లో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం కూడా ఈ విషయం గురించి గొడవ జరిగింది.బాలిక ప్రేమను అంగీకరించడం ఇష్టం లేక.. కూతురికి నచ్చచెప్ప లేక కుమార్తె మాట వినడం లేదని ఆ బాలికను కొట్టి ,చున్నీతో ఊరి వేసి హత్య చేశారు తల్లి అంజినమ్మ, కుటుంబసభ్యులు. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్ కి వెళ్లి లొంగిపోయారు. తామే బాలికను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కేసులో పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

* రాయచోటిలో ట్రేడింగ్‌ కంపెనీ మోసం

ప్రజల నుంచి రూ.170 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసిన 9 ఎఫ్‌ఎక్స్‌ గ్లోబల్‌ ట్రేడింగ్‌ కంపెనీ నిర్వాహకులను అన్నమయ్య జిల్లా రాయచోటిలో పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ మహబూబ్‌బాషా మంగళవారం తెలిపిన వివరాలివి. ‘తిరుపతికి చెందిన రఫీ, రైల్వేకోడూరులో నివసించే యోగానంద చౌదరి, అనిల్‌కుమార్‌లు 2019లో తిరుపతి ప్రధాన కార్యాలయంగా ఈ కంపెనీని ఏర్పాటుచేశారు. తరువాత నెల్లూరు, కడప, రాయచోటిలలో శాఖలను పెట్టారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు రాయచోటికి చెందిన రాజేష్‌, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు తిరుపాల్‌రెడ్డి, సుబ్బారెడ్డిలను ఏజెంట్లుగా నియమించుకున్నారు. మొత్తంగా 1,759 మంది డిపాజిటర్ల ద్వారా రూ.170 కోట్లు సేకరించారు. ఇందులో నుంచి డిపాజిటర్లకు నెలవారీగా తిరిగి సుమారు రూ.105 కోట్ల వరకు చెల్లించారు. ఈ ఏడాది జూన్‌ నుంచి డిపాజిట్‌దారులకు డబ్బులు చెల్లించకుండా కార్యాలయాలు మూసేశారు. మిగిలిన రూ.65 కోట్ల డిపాజిట్‌దారుల డబ్బులతో ఒంగోలు సమీపంలో 22 ఎకరాలను కంపెనీ నిర్వాహకులు కొన్నారు. భూమిలో గంధపు మొక్కలు పెంచి ప్లాట్లు చేసి ఇస్తామని డిపాజిట్‌దారులను నమ్మించారు. దీనిపై గత నెలలో పలు పత్రికల్లో కథనాలు రావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు’ అని డీఎస్పీ చెప్పారు. కంపెనీ నిర్వాహకులతో పాటు రాయచోటికి చెందిన ఏజెంట్లను అరెస్టు చేశారు.

* చనిపోయిన చెల్లిని బైక్ పై తీసుకెళ్లిన అన్న

అమితంగా ఇష్టపడేవారు చనిపోతే ఆ బాధ వర్ణించడం కష్టం..అల్లారు ముద్దుగా కళ్లముందు పెరిగిన చెల్లెలు.. ప్రమాదానికి గురైంది. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఆమె ఆస్పత్రిలో చనిపోయింది. ఆస్పత్రి దద్దరిల్లేలా అతని రోదనలు.. ఓ పక్క అకస్మాత్తుగా చెల్లిని కోల్పోయి గుండె పగిలేలా ఏడుస్తున్న అన్నకు మరో బాధ వచ్చిపడింది..కనీసం చెల్లి మృతదేహాన్ని తరలించేందుకు ఆస్పత్రిలో అంబులెన్స్ లేకపోవడం..అతని బాధను మరింత పెంచాయి. ఉబికి వస్తున్న కన్నీళ్ల ను తుడుచుకుంటూ.. చెల్లి డెడ్ బాడీని బైక్ తీసుకెళ్తున్న ఓ అన్న విషాదకర వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… ఉత్తరప్రదేశ్ లోని ఔరయాలోని బిధునా కమ్యూనిటీ హెల్త సెంటర్లో బుధవారం (నవంబర్ 8) ఉదయం ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన సోదరి మృతదేహాన్ని బైక్ పై ఉంచుతూ బాధతో విలపిస్తున్నాడు. నీళ్లు వేడి చేసుకునేందుకు హీటర్ పెట్టిన ఓ యువతి ప్రమాదవ శాత్తు విద్యుత్ ఘాతానికి గురయింది. ఆ యువతిని వెంటనే బిధువా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించగా.. అప్పటికే చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు.. అయినప్పటికీ ఆ యువతి సోదరుడు మాత్రం ఆశ కోల్పోలేదు.. వెంటనే మరో ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ ఆస్పత్రిలో అంబులెన్స్ లేకపోవడంతో.. చనిపోయిన చెల్లెలి మృతదేహాన్ని మరో ఆస్పత్రికి తరలించేందుకు బైక్ పై తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.. ఈ సమయంలో ఆ యువకుడి రోదనలు చూసేవారిని కన్నీళ్లు పెట్టించాయి.ఉత్తర్ ప్రదేశ్ లో ఆరోగ్య వ్యవస్థ అధ్వాన్నం గా ఉందని తెలిపే సాక్ష్యం ఈ వీడియో. ప్రజలు తమ చనిపోయిన లేదా అనారోగ్యంతో ఉన్న బంధువులను బైక్ లపై లేదా కూరగాయల బండ్లపై తీసుకెళ్తున్న సంఘటన లు చాలానే వెలుగు చూశాయి. యూపీలో అంబెలెన్స్ ల సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి అంటూ.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రతిపక్ష కాంగ్రెస్ నేత ఒకరు షేర్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

* అర్ధరాత్రి దొంగల హల్చల్

అనకాపల్లి జిల్లా లోని కసింకోట మండలం లోని నరసింగబిల్లి లోని నరసీంగబిల్లి కోపరేటివ్ సొసైటీ బ్యాంకులో అర్ధరాత్రి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నైట్ వాచ్మెన్ ను తాళ్లతో బంధించారు. అనంతరం ముగ్గురు దుండగులు కలిసి బ్యాంకు తలుపులు, తాళాలు పగలగొట్టి బ్యాంకు లోకి ప్రవేశించారు. అంతటితో ఆగలేదు దుండగులు స్ట్రాంగ్ రూమ్ గోడకు కన్నం పెట్టి లోనికి ప్రవేశించారు. అలానే దుండగులు ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా ముందస్తు జాగ్రతగా బ్యాంకు లోని సీసీ కెమెరాలకు నల్ల రంగు స్ప్రే చేసారు. కాగా రాత్రి బ్యాంకు లో దొంగలు పడిన విషయం మరుసటి రోజు ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం బ్యాంకును పరీశీలించిన పోలీసులు క్లూస్ టీం తో బ్యాంకులో ఆధారాలు సేకరిస్తున్నారు.కాగా గతంలో కూడా ఇదే నర్సింగపల్లి గ్రామంలో గల గ్రామీణ వికాస్ బ్యాంకు లోనూ పట్టపగలు దుండగుడు చొరబడ్డారు. అనంతరం గన్ తో బెదిరించి 15 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మరువకముందే మరో బ్యాంక్ చోరీ విపలయత్నం జరగడంతో పోలీసులు ఖంగుతిన్నారు. వరుస దొంగతనాలకు దుండగలు పాల్పడుతుండడంతో ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటన గురించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులను గుర్తించేందుకు ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఏం అయినా ఆధారాలు దొరికాయ లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z