* షోపియాన్‌లో ఎన్‌కౌంటర్
జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో (Shopian) భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు (Encounter) జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ముష్కరుడు (Terrorist) హతమయ్యాడు. గురువారం తెల్లవారుజామున షోపియాన్‌లోని కతోహలెన్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ టెర్రరిస్టును మట్టుబెట్టామని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. అతడిని ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాదిగా గుర్తించామని వెల్లడించారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.మరో ఘటనలో రామ్‌గఢ్ సెక్టార్‌లోని (Ramgarh sector) అంతర్జాతీయ సరిహద్దుల వద్ద జరిగిన కాల్పుల్లో ఓ జవాన్ గాయపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ (Pakistan) సైన్యం కాల్పులకు తెగబడింది. దీంతో సరిహద్దు భద్రతా దళానికి (BSF) చెందిన ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
* బీహారీల కొత్త స్మగ్లింగ్
స్మగ్లర్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. పోలీసుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ రోజుకో రూపంలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా రాచకొండ పోలీసుల దాడుల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గంజాయిని నేరుగా విక్రయించినా.., సిగరేట్ రూపంలో అమ్మినా పోలీసులు గుర్తిస్తున్నారని చాక్లెట్ రూపంలో బిజినెస్ స్టార్ట్ చేశారు. మహా ఖాల్ – మున్నక వటి చాక్లెట్ తింటే 7 గంటలు మత్తు గ్యారంటీ అంటూ గంజాయి స్మగ్లర్‌లు మత్తు బాబులను ఆకట్టుకుంటున్నారు. వారి కోసం ప్రత్యేకంగా గంజాయి చాక్లెట్‌ను తయారు చేసి హైదరాబాద్‌లో అమ్ముతున్నారు బిహార్‌కు చెందిన స్మగ్లర్లు. 5 గ్రాముల చాక్లెట్ ధర 200 రూపాయలకు విక్రయిస్తూ యువతను మత్తులోకి దింపుతున్నారు. ఈ గంజాయి చాక్లెట్ వల్ల ఎవరికీ అనుమానం రాదని, ఎవరు గుర్తించలేరని, గంజాయి సిగరెట్ అయితే వాసన రావడంతో పాటు అందరికీ కనపడుతుందని చెప్పి మత్తు బాబులను గంజాయి చాక్లెట్ వైపు మళ్లీస్తున్నారని తెలిసింది. తాజాగా బిహార్ నుంచి దీపక్ 70 గంజాయి చాక్లెట్‌లను తయారు చేసుకుని వాటిని నాగోల్ ప్రాంతంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ఎల్‌బీ నగర్ ఎస్ఓటీ బృందం అతడిని అరెస్టు చేసి 70 గంజాయి చాక్లెట్‌లను స్వాధీనం చేసుకున్నారు.
* మహిళలపై అసభ్యకరమైన పోస్టులపై సీఐడీ వార్నింగ్
ఇకపై ప్రజాప్రతినిధులు, మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే తాట తీస్తామంటున్నారు పోలీసులు. అసభ్యకరమైన పోస్టులు చేసినా, ఫొటో మార్ఫ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులపై ట్రోలింగ్ చేసిన వారి కేసులు నమోదు చేసి, పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరి మీద పోస్టులు చేసినా వదలబోమన్నారు. రూల్స్ ఎవరు ఉల్లంఘించిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులపై అసభ్యకరమైన రీతిలో సోషల్ మీడియా పోస్టులు పెట్టే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని సీఐడీ చీఫ్ సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. పలు సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా పెట్టామని, త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ గుర్తించామని తెలిపారు. త్వరలో నిందితుల ఆస్తులు అటాచ్ చేసే దిశగా చర్యలు ఉంటాయన్నారు. ప్రతిపక్ష నేతలపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపైనా చర్యలు ఉంటాయని చెప్పిన ఆయన, ఇప్పటికే కొన్నింటిని తొలగించామని వెల్లడించారు. న్యాయవ్యవస్థను కించపరిచేలా పోస్టులు పెట్టినవారిపైనా చర్యలు తప్పవన్నారు.మహిళా నేతలపైనా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి వారిపై కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు సంజయ్. సోషల్ మీడియాను చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాను పాజిటివ్‌గా ఉపయోగించుకోవాలని సూచించారు. గతేడాది 1,450 పోస్టులు..ఈ ఏడాది 2,164 సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతర మెసేజ్‌లను తొలగించామన్నారు. కొందరు ఇతర దేశాల నుంచి అశ్లీల, అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు సీఐడీ చీఫ్ సంజయ్. ఆయా దేశాల ఎంబసీతో సంప్రదింపులకు సీఐడీ ప్రత్యేక బృందాలు పంపించామని చెప్పారు. యూకే, అమెరికా దేశాలకు సీఐడీ బృందాలు పంపామని వివరించారు. అనుచిత పోస్టులతో అమూల్యమైన భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సీఐడీ చీఫ్ సంజయ్ కోరారు.మొత్తానికి రాజకీయ పార్టీలపై ఉన్న అభిమానంతో అసభ్యకరపోస్టులు పెట్టి భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దని ఏపీ సీఐడీ సూచించింది.
* 44 మందిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ
దేశవ్యాప్తంగా జరిపిన దాడుల్లో మానవ అక్రమ రవాణా కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ ఐదు మాడ్యూళ్లను ఛేదించింది. ఈ మేరకు 10 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి 44 మంది నిందితులను అరెస్టు చేసినట్టు ఎన్ఐఏ అధికార ప్రతినిధి వెల్లడించారు. మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేసేందుకు ఎన్‌ఐఏ, బీఎస్‌ఎఫ్, రాష్ట్ర పోలీసులతో కలిసి 8 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 55 ప్రాంతాల్లో దాడులు చేశామన్నారు.
* స్కూటీపై వెళ్తుండగా ప్రమాదం
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కల్లకల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి.. వెళితే మెదక్‌లోని రాంనగర్‌కు చెందిన మలైకా సుల్తానా స్కూటీపై ఇద్దరు బాలికలు, ఓ బాలుడిని తీసుకుని మేడ్చల్ నుంచి తూప్రాన్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో కల్లకల్ వద్దకు రాగానే స్కూటీ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వారంతా కింద పడ్డారు. అదే సమయంలో గుర్తు తెలియని వాహనం వారిపైనుంచి వెళ్లడంతో ఘటనాస్థలంలోనే మలైకా సుల్తానాతో పాటు ఓ బాలిక, బాలుడు మృతిచెందారు. మరో బాలికకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై కరుణాకర్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
* యుమునా నగర్ జిల్లాలో తీవ్ర విషాదం
హర్యానాలోని యుమునా నగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. కల్తీ మద్యం తాగి (Alcohol) ఆరుగురు యువకులు మరణించారు. యమునా నగర్‌లోని మందేబరి ప్రాంతంలో మద్యం తాగిన ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతుండగా వారు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పలువురు నిందితులను గుర్తించామని, వారిలో కొందరిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ గంగా రామ్ పునియా (SP Ganga Ram Punia)చెప్పారు.కాగా, మద్యం సేవించినవారిలో ఐదుగురు గ్రామంలోనే మరణించారని ఎస్పీ తెలిపారు. మరొకరు దవాఖానలో మృతిచెందారని, ఇంకో వ్యక్తి చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు కొన్ని ఆధారాలను సేకరించామన్నారు.
* డ్రైనేజీలో పడి ఐదేళ్ల బాలుడు మృతి
ఏపిలోని విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో విషాదం నెలకొంది. డ్రైనేజీలో పడి ఐదేళ్ల బాలుడు ఎస్.కె.అష్రఫ్ మృతి చెందాడు. బాలుడు కనిపించట్లేదని బుధవారం కుటుంబ సభ్యులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇంటి పక్కనే డ్రైనేజీలో పడి అష్రఫ్ మృతి చెందాడని తెలుసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* ఢిల్లీలో దారుణం
ఢిల్లీలో కత్తితో దాడి ఘటన వెలుగు చూసింది. బుధవారం రాత్రి గోవింద్‌పురి ప్రాంతంలో నివసిస్తున్న ముగ్గురు సోదరులను గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి గాయపరిచారు. ఇందులో ఒక సోదరుడు అక్కడికక్కడే మరణించాడు. ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. ఈ కత్తితో దాడి ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.పోలీసులకు అందిన సమాచారం ప్రకారం, బుధవారం రాత్రి 10:00 గంటల సమయంలో గోవింద్‌పురి ప్రాంతంలో ముగ్గురు సోదరులపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. ఇందులో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించేలోగా సోదరుల్లో ఒకరు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడిని ఆజాద్‌గా గుర్తించగా అతని మరో ఇద్దరు సోదరులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దుండగులు ఎందుకు ఈ దాడికి పాల్పడ్డారనే దానిపై ఎలాంటి సమాచారం అందలేదు.ఈ ఘటన తర్వాత సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మొత్తం కేసును పరిశీలించారు. ప్రస్తుతం నిందితులను గుర్తించేందుకు పోలీసులు సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంత ప్రజలను కూడా విచారిస్తున్నారు.తూర్పు ఢిల్లీలోని మధు విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీలకంత్ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో గత బుధవారం ఓ మహిళా ఫోటోగ్రాఫర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గమనార్హం. మహిళ మృతదేహం ఆమె ఫ్లాట్‌లోని బాత్‌రూమ్‌లో పడి ఉంది. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ మహిళను 32 ఏళ్ల మహిళా ఫోటోగ్రాఫర్‌గా గుర్తించినట్లు తూర్పు ఢిల్లీ డీసీపీ అమృత గుగులోత్ బుధవారం సాయంత్రం తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –