కామారెడ్డి గడ్డతో తనకు పుట్టినప్పటి నుంచి ఎంతో అనుబంధం ఉందని భారాస అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. కోనాపూర్‌గా పిలుస్తున్న పోసానిపల్లిలో తన తల్లి జన్మించారని చెప్పారు. గురువారం కామారెడ్డిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘‘తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలి రోజుల్లో కామారెడ్డికి చెందిన న్యాయవాదులు చైతన్యం చూపించారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్నాం. కామారెడ్డిని జిల్లా చేస్తానని చెప్పా.. అలాగే చేసుకున్నాం. మెడికల్ కాలేజీ కూడా తెచ్చుకున్నాం. జలసాధన ఉద్యమం 45 రోజులు చేశాం. ఆ ఉద్యమంలో బ్రిగేడియర్లను నియమించుకున్నాం. కామారెడ్డి బ్రిగేడియర్‌గా నేనే ఉన్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నా.
కామారెడ్డి నుంచి పోటీ చేయాలని గోవర్ధన్ నన్ను చాలా సార్లు అడిగారు. ఇక్కడి నుంచి పోటీ చేయడం దైవకృపగా భావిస్తున్నా. కేసీఆర్ వస్తే ఒక్కడే రారు కదా.. కేసీఆర్‌తో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీరు అందిస్తాం. ఇది నా మాట. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేస్తాం. కామారెడ్డి పట్టణంతో పాటు పల్లెల రూపురేఖలు కూడా మార్చేస్తాం. అద్భుతమైన నియోజకవర్గంగా కామారెడ్డిని అభివృద్ధి చేస్తాం’’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు.
‘‘దేశ రాజకీయాలు, ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణతి ఇప్పటికీ రాలేదు. ఏ దేశాల్లో ఆ పరిణతి వచ్చిందో.. ఆ దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. మనం మాత్రం ఉన్నదగ్గరే ఉన్నాం. ఎన్నికలు వస్తాయి.. పోతాయి. ప్రతి పార్టీ నుంచి ఒక అభ్యర్థి పోటీలో ఉంటాడు. అభ్యర్థుల గుణంతో పాటు అతని వెనుక ఉన్న పార్టీ ఎలాంటిదనేది కూడా ప్రజలు ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న ఒకే ఒక ఆయుధం.. ఓటు. ఈ ఓటు ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. పార్టీల నడవడి, వాళ్లకు అధికారం ఇస్తే ఏం చేశారు.. ఇలా అనేక అంశాలపై ప్రజలు ఆలోచన చేయాలి. ఆ చర్చ జరిగిన తర్వాత ఓటు వేస్తే.. అప్పుడు ఎన్నికల్లో నాయకులు కాదు.. ప్రజలు గెలవడం మొదలవుతుంది. ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
👉 – Please join our whatsapp channel here –