Business

భారీగా తగ్గిన విమాన ఛార్జీలు

భారీగా తగ్గిన విమాన ఛార్జీలు

విమానం ఎక్కాలని చాలా మందికి ఆశ ఉంటుంది. అయితే వాటి ధరలు చూసి వెనకడుగు వేస్తారు కొందరు. మరి కొందరు ముందస్తుగా బుకింగ్ చేసుకొని తక్కువ ధరలకే గగన వీధుల్లో విహరించేందుకు ప్లాన్ చేస్తారు. గతంలో మన ఇండియన్ ఎయిర్‌లైన్స్ కూడా ఇలాంటి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అయితే ఇప్పుడు ఎలాంటి ఆఫర్లు ప్రకటించకుండానే విమాన ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం చైనాలోని ఓ ప్రముఖ ఎయిర్‌లైన్ సర్వీసెస్ సంస్థ కంప్యూటర్లలో సాంకేతిక లోపం తలెత్తడం అని తేలింది. దీని కారణంగా వినియోగదారులకు అతి తక్కువ ధరలకే విమానం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. గాంగ్జూ ప్రావిన్స్‌ కేంద్రంగా పనిచేసే చైనా సదరన్‌ ఎయిర్‌లైన్స్‌ మొబైల్‌ యాప్‌లో దాదాపు రెండు గంటలపాటు టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఆ సమయంలో విమానం టికెట్ బుక్ చేసుకున్న వాళ్లకు కేవలం 1.30 డాలర్లుగా టికెట్ ధర చూపించింది. ఈ విషయాన్ని కొందరు చైనీయులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ అనుభూతిని పంచుకున్నారు. మరి కొందరు తమ అభిప్రాయాలను ట్వీట్ చేస్తూ పోస్ట్ చేయడం ప్రారంభించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

చెంగ్డూ నగరానికి రాకపోకలు సాగించే చాలా విమానాల టికెట్‌ ధరలు కేవలం 10 నుంచి 30 యువాన్లలోపే అనగా (1.37 డాలర్ల నుంచి 4.12 డాలర్లలోపు) అందుబాటులో ఉంటున్నాయని వారు పేర్కొన్నారు. మన భారతదేశ కరెన్సీ ప్రకారం.. ఈ మొత్తాన్ని మన కరెన్సీలోకి మారిస్తే.. రూ.114 నుంచి రూ.341 మధ్య టికెట్‌ ధరలు ఉన్నట్లు తెలిపారు. వారు పోస్టు చేసిన స్క్రీన్‌ షాట్‌లో చెంగ్డూ నుంచి బీజింగ్‌ వరకూ ప్రయాణించే విమాన ప్రయాణ టికెట్‌ ధర కేవలం 1.37 డాలర్లుగా ఉంది. వాస్తవానికి ఇది కనీసం 55 డాలర్ల నుంచి 69 డాలర్ల మధ్యలో ఉంటుంది. అంటే రూ. 4500 నుంచి రూ.5700 మధ్య ఉంటుంది. ఈ టికెట్లు కేవలం చైనా సదరన్‌ ఎయిర్‌లైన్స్‌ మొబైల్‌ యాప్‌లో మాత్రమే కాకుండా.. ట్రిప్.కామ్ లాంటి బుకింగ్ ప్లాట్ ఫాంలపై కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిపై స్పందించిన ఎయిర్‌లైన్స్ సంస్థ ఆ రెండు గంటల సమయంలో బుక్ చేసుకున్న టికెట్లను ప్రయాణీకులు ఉపయోగించుకోవచ్చు అని తెలిపింది. అయితే తలెత్తిన సాంకేతిక సమస్య ఏంటనేది వెల్లడించలేదు. దీంతో బుక్ చేసుకున్నవారి కంట ఆనందం వెల్లువిరిసింది. చాలా మంది అతి తక్కువ ధరలకే విమానంలో ప్రయాణించి తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోగలిగారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z