తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే ప్రచారంలో బీజేపీ నేతలు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను ఈనెల 16న విడుదల చేయనుంది. ఇక, మేనిఫెస్టోలో కీలక అంశాలను దృష్టిలో పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఇక, తెలంగాణలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని ఇప్పటికే రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి తెలిపారు. అలాగే.. విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని కాషాయ పార్టీ చెబుతోంది. మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్, ఉపాధి అవకాశాలపై హామీలు ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో పలు నగరాల పేర్లు మారుస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పొందుపర్చినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు నవంబర్ 23వ తేదీతో ముగియనున్నాయి. ఆ తర్వాత బీజేపీ జాతీయ నేతలంతా తెలంగాణలో మకాం వేయనున్నట్లు స్థానిక నేతలు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే తెలంగాణను చుట్టేశారు. మరోసారి.. నవంబర్ 25, 26, 27 తేదీల్లో వస్తారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రచారానికి చివరి వారం కీలకంగా మారనుంది. అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల పార్టీ ముఖ్య నేతల తాకిడి రాష్ట్రానికి పెరుగుతుందని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు.
మరోవైపు.. తెలంగాణలో కీలక నేతలు పార్టీలు మారుతున్నారు. తాము ఆశించిన టికెట్లు రాకపోవడంతో ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. తాజాగా బీజేపీ నేత తుల ఉమ కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. వేములవాడ టికెట్ తనకు ఇవ్వకపోవడంతో ఆమె బీజేపీని వీడారు. ఇక, సొంత పార్టీ అయిన బీఆర్‌ఎస్‌లోకి తుల ఉమ వెళ్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –