DailyDose

గువ్వల బాలరాజును పరామర్శించిన కేటీఆర్-తాజా వార్తలు

గువ్వల బాలరాజును పరామర్శించిన కేటీఆర్-తాజా వార్తలు

* గువ్వల బాలరాజును పరామర్శించిన కేటీఆర్

నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే, అచ్చంపేట భారాస అభ్యర్థి గువ్వల బాలరాజును మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. శనివారం అర్ధరాత్రి అచ్చంపేటలో జరిగిన భారాస-కాంగ్రెస్‌ ఘర్షణలో ఎమ్మెల్యేకు గాయాలయ్యాయి. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం బాలరాజును హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రికి వెళ్లి కేటీఆర్‌ పరామర్శించారు. బాలరాజు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ప్రజాదరణ ఓర్వలేకే తమపై దాడులకు తెగబడుతున్నారని ఎమ్మెల్యే కుటుంబసభ్యులు కేటీఆర్‌కు చెప్పారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకాలంలో ఎన్నో దాడులను ఎదుర్కొని పోరాడిన నాయకుడు బాలరాజు అని చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని.. బాలరాజుకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డీజీపీతో మాట్లాడి బాధ్యులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరతానని చెప్పారు.

ములుగులో బీజేపీ పార్టీకి షాక్ 

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ములుగులో బీజేపీ పార్టీకి షాక్ తగిలింది. నామినేషన్ చివరి రోజు వరకు ములుగు పార్టీ టికెట్ రేసులో ఉన్న తాటి కృష్ణయ్య బిజెపికి రాజీనామా చేశారు. శనివారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బిజెపి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కన్నీటి పర్యాంతం అయ్యారు.ములుగు నియోజకవర్గంలో నాలుగేళ్లుగా బిజెపితో మమేకమై జిల్లాలోని అన్ని మండలాల్లో కమిటీలు వేసి అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు సవాల్ గా బిజెపి క్యాడర్ ను సిద్ధం చేశారన్నారు. టికెట్ల కేటాయింపులో కూడా బీజేపీని బలోపేతానికి లక్షల రూపాయలు అప్పు చేసి చివరివరకు తమకు నాయకత్వం ఇస్తానని నమ్మి నాయకులు, కార్యకర్తలను తన పక్షాన ఉంచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో బిజెపిని బలోపేతం చేసేందుకు రాష్ట్రస్థాయి పదవి ఇచ్చిన పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటూ చివరకు గొంతు కోసుకున్నారు.

*  కాంగ్రెస్‌ ఐదు గ్యారంటీలు ఫెయిల్‌‌

కాంగ్రెస్‌ పార్టీపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ (ఎస్‌) పార్టీ అగ్రనేత కుమారస్వామి విమర్శలు గుప్పించారు. అదే సమయంలో తెలంగాణలో సీఎం కేసీఆర్‌ పాలనపై కుమారస్వామి ప్రశంసలు కురిపించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఐదు గ్యారంటీలు ప్రకటించిందని, ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ ఓట్ల కోసం ఈ ఐదు గ్యారంటీల ముచ్చట చెబుతోందని కుమారస్వామి ఎద్దేవా చేశారు.ఐదు గ్యారంటీలను దేశవ్యాప్తంగా విస్తరించాలని కాంగ్రెస్‌ పార్టీ తాపత్రయపడుతోందని, వాస్తవానికి కాంగ్రెస్‌ ఐదు గ్యారంటీలు కర్ణాటకలో పూర్తిగా విఫలమయ్యాయని ఆ రాష్ట్ర మాజీ సీఎం విమర్శించారు. ఐదు గ్యారంటీలు విఫలమవడం మాత్రమే కాదని, ఈ ఐదు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఐదు గ్యారంటీలతో పేదలకు ఒరిగేదేం లేదన్నారు.

బీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తా

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కాంగ్రెస్ కీలక నేత, నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారో చూపించాలని సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. 24 గంటల కరెంట్ కాదు కదా.. 8 గంటలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. సిరిసిల్లకు రమ్మంటారో, గజ్వేల్‌కు రమ్మంటారో, సిద్దిపేటకు రమ్మంటారో చెప్పండి. రాష్ట్రంలో ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తా. కేటీఆర్ స్పందించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.అవసరమైతే తీగలు పట్టుకోవడానికి కూడా తాను సిద్ధమే అని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి గెలిపిస్తా అని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ నిరూపించలేకపోతే మంత్రి కేటీఆర్ పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అసలు విద్యుత్ విషయంలో ఒక్క కేసీఆర్, కేటీఆరే కాదు బీఆర్ఎస్ నేతలంతా అబద్ధాలు చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

కార్యకర్తను దారుణంగా కొట్టిన రేవంత్ 

కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి చాలా యాక్టివ్‌ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అలాగే.. ఎప్పుడు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అటు కోపం వస్తే.. కార్యకర్తల వీపులు వాయిస్తూ ఉంటారు రేవంత్‌ రెడ్డి. ఈ తరుణంలోనే.. రామగుండం సభలో రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్లిన అభిమానిని చితకబాదారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.ఇది ఇలా ఉండగా…ఇవాళ తిరుమల శ్రీవారిని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం అంటే నవంబర్ 12న ఉదయం తిరుమల స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనమనం అనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఉత్తరకాశీలో కూలిన టన్నెల్‌

ఉత్తరఖండ్‌లోని ఉత్తరకాశి (Uttarkashi) జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగమార్గం (Tunnel) కూలిపోయింది. దీంతో 36 మంది కార్మికులు (Workers) అందులో చిక్కుకుపోయారు. బ్రహ్మఖల్‌-యమునోత్రి జాతీయ రహదారిపై సిల్కియారా నుంచి దండల్‌గావ్‌ వరకు సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి టన్నెల్‌ ఒక్కసారిగా కూలిపోవడంతో (Collapse) కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. శిథిలాలు పూర్తిగా కప్పేయడంతో వారికి బయటకు రావడానికి మార్గం మూసుకుపోయింది. సమాచారం అందుకున్న కేంద్ర, రాష్ట్ర డిశాస్టర్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.టన్నెల్‌కు సమాంతరంగా డ్రిల్లింగ్‌ చేసి సొరంగంలోకి పైపుల ద్వారా ఆక్సిజన్‌ అందిస్తున్నారు. కార్మికులను బయటకు క్షేమంగా తీసుకొచ్చేందుకు శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తయేందుకు రెండు నుంచి మూడు రోజులు పట్టొచ్చని ఉత్తరకాశి ఎస్పీ అర్పన్‌ యదువంశి చెప్పారు. టన్నెల్‌ ఆరంభం నుంచి 200 మీటర్ల దూరంలో కూలిపోయిందని తెలిపారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, వీలైన త్వరలో చిక్కుకుపోయినవారిని క్షేమంగా బయటకు తీసుకొస్తామన్నారు.

బీఆర్ఎస్‌లో చేరిన పాల్యాయి స్రవంతి

మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఓటమి చవిచూసిన పాల్వాయి స్రవంతి.. ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించి బంగపడింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోకి తిరిగి రావడంతో ఆయనకే మునుగోడు టికెట్ ఇచ్చింది. దీంతో పాల్వాయి స్రవంతి.. ఈ రోజు తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ.. దీపావళి పండుగ రోజు భారత రాష్ట్ర సమితిలో చేరడం సంతోషంగా ఉందని.. తనకు ఎక్కడైతే గౌరవం లేదో అక్కడ ఒక్క నిమిషం ఉండకూడదని మా తండ్రి చెప్పిన మాటలను గుర్తుంచుకుని ఆ పార్టీకి రాజీనామా చేశాను. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మాకు తెలిసిన కాంగ్రెస్ పార్టీ కానే కాదు. ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో ఒక సానుకూలమైన మార్పు అవసరం అన్న ఆలోచనతో మా పార్టీ కార్యకర్తలు నాయకుల అభిప్రాయంతో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్, భారత రాష్ట్ర సమితవర్కింగ్ ప్రెసిడెంట్ సోదరుడు కేటీఆర్‌తో నడవాలని నిర్ణయం తీసుకున్నానని, నాతోపాటు నడిచి వచ్చిన కార్యకర్తలు నాయకుల భవిష్యత్తు బాధ్యతను కేటీఆర్‌కి అప్పజెప్పి ఆయన మీద విశ్వాసంతో ముందుకు నడుస్తున్నామని పాల్వాయి స్రవంతి తెలిపారు.

గజ్వేల్ లో గెలుపుపై కేసీఆర్ కు ఈటల సవాల్

నువ్వు గెలిస్తావా? నేను గెలుస్తానా? అనేది గజ్వేల్ ప్రజల చేతుల్లో ఉందని సీఎం కేసీఆర్ కు.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ప్రజ్ఞాపూర్ లో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించి ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గజ్వేల్లో ఈ ఊరుకి వెళ్లినా మా భూములు గుంజుకున్నారు అని చెప్తున్నారని అన్నారు. ధరణి తెచ్చి మా భూములపై హక్కులు లేకుండా చేశారని బాధపడుతున్నారని అన్నారు. అధికార పార్టీ నాయకులు బ్రోకర్లుగా మారారని తెలిపారు. సంవత్సరాలుగా సాగు చేసికుంటున్న భూములని దళితులనుండి దూరం చేసారని అన్నారు. మళ్ళీ కేసీఆర్ గెలిస్తే ఉన్న ఇళ్ళును కూడా లాక్కుంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ ప్రజలను ఎవరూ కొనలేరు. డబ్బులు ఇస్తే తీసుకుంటారు. కానీ కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడించడం ఖాయమన్నారు.కేసీఆర్ ఎట్లా ఓడిపోలేదో నేను కూడా ఒక్కసారి ఓడిపోలేదన్నారు. ఇక నువ్వు గెలిస్తావా? నేను గెలుస్తానా అనేది గజ్వేల్ ప్రజల చేతుల్లో ఉందన్నారు. కాళేశ్వరం నీళ్లు ఇక్కడ రాకముందే గోదావరిలో మునిగిపోయిందన్నారు. మన డబ్బులన్నీ గోదావరిపాలు చేశారని అన్నారు. నన్ను పార్టీ నుంచి బయటకు పంపిన తరువాత హరీష్ రావు హుజురాబాద్ వచ్చి కేసీఆర్ అక్రమ సంపాదన 600 కోట్లు ఆరు నెలల పాటు ఖర్చు పెట్టారని తెలిపారు. నా మొఖం అసెంబ్లీలో కనపడవద్దు అని తిరిగారు. కాని మా ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారని మండిపడ్డారు. దళితబంధు, బీసీబంధు అన్నీ అబద్ధపు మాటలు. దళితబంధు కేవలం నన్ను ఓడగొట్టడానికి పెట్టారని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం కష్టపడి చదువుతుంటే.. పైరవీ చేసుకున్న వారికి మాత్రమే ఉద్యోగాలని 17 పేపర్లు లీక్ చేశాడు కేసీఆర్ అని మండిపడ్డారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z