కార్తీక మాసం వచ్చేసింది.. ఇక, దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమండ్రిలోని పవిత్ర గోదావరి నదిలో కార్తీక స్నానాలు ఆచరించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు.. అయితే, భక్తుల సౌకర్యార్థం, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఏర్పాట్లను పరిశీలించారు. రాజమండ్రి గోదావరి నది చెంతన ఉన్న ప్రసిద్ధ కోటిలింగాల ఘాట్, పుష్కర్ ఘాట్ తదితర ఘాట్లను ఎంపీ భరత్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే కాదు. దేశంలోనే అతి పెద్ద ఘాట్ గా కోటిలింగాల ఘాట్ కు పేరుందన్నారు. వేల సంవత్సరాల చరిత్ర, పురాణ ప్రసిద్ధి గాంచిన ఈ ఘాట్ లో కార్తీక పుణ్య స్నానాలు చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారని చెప్పారు.
ఇక, ఈ ఘాట్ చెంతనే శ్రీ ఉమా కోటిలింగేశ్వర ఆలయం కూడా ఉండటంతో పరమ శివునికి అత్యంత ప్రియమైన కార్తీక మాసంలో కోటిలింగాల ఘాట్ లో భక్తులు ఎంతో పవిత్రంగా స్నానాలు ఆచరించి, అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారన్నారని తెలిపారు ఎంపీ భరత్.. అంతటి విశిష్టమైన ఈ ఘాట్, ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ పాలకమండలి ఛైర్మన్ అరిగెల బాబు నేతృత్వంలో అత్యంత శ్రద్ధతో పూర్తి చేశారన్నారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారన్నారు. పిల్లలు, వృద్ధులు గోదావరి నదిలోకి దిగకుండా గట్టుపైనే ప్రత్యేక ఆర్టిఫిషియల్ షవర్స్ కూడా ఏర్పాటు చేసినట్టు ఎంపీ వివరించారు. కోటిలింగాల ఘాట్ సమీపంలోగల నదిలో బంకమట్టి తొలగించి ఇసుక వేయడం జరిగిందన్నారు. అలాగే గోదావరి నదిలో స్నానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి ఆపదా రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా రోప్స్ కట్టడం, అలాగే రెండు బోట్లను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.
కార్తీక మాస ఆరంభం మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచే భక్తులు స్నానాలకు వచ్చే అవకాశం ఉండటంతో ఫ్లడ్ లైట్లు, ఆర్టిఫిషియల్ షవర్స్ స్టార్ట్ అవుతాయన్నారు. తెల్లవార్లూ లైట్లు వెలుగుతూనే ఉంటాయన్నారు. ఇదే విధంగా పుష్కర్ ఘాట్ వద్ద కూడా అన్ని ఏర్పాట్లు ఆర్ఎంసీ చేపట్టిందన్నారు ఎంపీ భరత్.. ఇక, ఘాట్ల పరిశీలన అనంతరం పుష్కర్ ఘాట్ సమీపంలో గల చిత్రాంగి అతిథి గృహాన్ని ఎంపీ భరత్ పరిశీలించారు. ఇక్కడ రాత్రి సమయాల్లో మద్యం బాబులు, ఆకతాయిల ఆగడాలు ఎక్కువుగా ఉంటున్నాయని పలువురు ఎంపీకి ఫిర్యాదు చేయడంతో ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మద్యం సీసాలు, సిగరెట్లు, నిరోధ్ ప్యాకెట్లు, పేక ముక్కలు ఉండటంతో వెంటనే మున్సిపల్, పోలీసు అధికారులకు ఫోన్ చేసి నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కఠినమైన, పటిష్ఠమైన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టం చేశారు. అలాగే నగర వాసులు కూడా ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేయాలని సూచించారు రాజమండ్రి ఎంపీ భరత్.
👉 – Please join our whatsapp channel here –