అన్నదాత పథకం’ కింద కౌలు రైతులకూ ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఆర్థికసాయం అందించాలని తెదేపా-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో కమిటీ నిర్ణయించింది. ఉభయ పార్టీలు మొత్తం 11 అంశాలతో ఉమ్మడి మినీ మ్యానిఫెస్టోని రూపొందించనున్నాయి. కమిటీ సమావేశం సోమవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో జరిగింది. తెదేపా మే నెలాఖరులో రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించిన ఆరు అంశాలకు, ఇప్పుడు జనసేన సూచించిన అయిదు అంశాలను జతచేసి ఉమ్మడి మినీ మ్యానిఫెస్టోను రూపొందించనున్నారు.
మ్యానిఫెస్టో కమిటీ సమావేశంలో జనసేన ఆరు అంశాలను ప్రతిపాదించగా… వాటిలో కౌలు రైతులకూ ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం అందజేయడంతోపాటు, వ్యవసాయరంగానికి సంబంధించిన ఇతర సూచనల్ని.. తెదేపా ఇప్పటికే ప్రకటించిన ‘అన్నదాత’లో కలిపి ఒకే అంశంగా చేశారు. మొత్తం 11 అంశాలతో ముసాయిదా సిద్ధం చేశామని, దానిపై జేఏసీ సమావేశంలో చర్చించి, తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ల ఆమోదం తీసుకుని ప్రకటిస్తామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విలేకర్లకు తెలిపారు. మ్యానిఫెస్టో కమిటీ సమావేశంలో తెదేపా నుంచి యనమల, అశోక్‌బాబు, పట్టాభిరాం, జనసేన నుంచి ముత్తా శశిధర్, డి.వరప్రసాద్, శరత్‌కుమార్ పాల్గొన్నారు.
తెదేపా ఇప్పటికే ప్రకటించిన అంశాలు
1. మహిళల కోసం ‘మహాశక్తి ’: ‘తల్లికి వందనం’ పేరుతో ఇంట్లో ఎంత మంది చదువుతున్న పిల్లలుంటే అంతమందికీ ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం. ‘ఆడబిడ్డ నిధి’ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ నెలకు రూ.1,500. ‘దీపం’ పేరుతో ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
2. యువత కోసం ‘యువగళం’: నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి. 20 లక్షల మందికి ఉపాధి.
3. రైతుల కోసం అన్నదాత: ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం. దీన్ని కౌలు రైతులకూ వర్తింపజేయాలన్న జనసేన సూచనను ఆమోదించారు. ఆక్వా రైతులకు ప్రోత్సాహం, ఉద్యాన రైతులకు సాగు రాయితీలు, పాడిరైతులకు నేరుగా ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాలనూ చేర్చారు.
4. ఇంటింటికీ సురక్షిత తాగునీరు
5. బీసీలకు రక్షణ చట్టం
6. పూర్ టు రిచ్: ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పేదలను సంపన్నులను చేయడం. అయిదేళ్లలో ఆదాయాన్ని రెట్టింపు చేయడం.
జనసేన ప్రతిపాదించిన అంశాలు
1. సౌభాగ్యపథం: చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, అంకుర సంస్థల్ని స్థాపించే యువతకు ప్రాజెక్టు వ్యయంలో 20 శాతం లేదా గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం.
2. ఉచిత ఇసుక విధానం పునరుద్ధరణ. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడం. నిర్మాణ రంగాన్ని ఆదుకోవడం.
3. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే ఏకైక రాజధాని
4. సంపన్న ఆంధ్రప్రదేశ్. ప్రజలపై పన్నులు, ఇతర ఆర్థిక భారాలను తగ్గించడం. మౌలిక వసతుల అభివృద్ధి. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని మెరుగుపరచడం.
5. కార్మికుల సంక్షేమం. వలసల్ని నివారించడం. మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం. కనీస వేతనాల్ని మెరుగుపరచడం.