రైతులు, పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని భారాస అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా నీళ్లిచ్చామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికలు వస్తూపోతుంటాయని.. ప్రజలు మాత్రం ఆగం కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
‘‘ప్రజలు అభ్యర్థుల మంచి, చెడుతో పాటు గుణం గురించి ఆలోచించాలి. అభ్యర్థుల వెనక ఉన్న పార్టీల చరిత్ర.. వాటి నడవడిక, అధికారమిస్తే ఏం చేస్తారు? పేదలు, రైతుల పట్ల ఆ పార్టీల వైఖరి ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరగాలి. అలా జరిగితే నాయకుడు గెలవడం కంటే ప్రజలు గెలవడం ప్రారంభమవుతుంది. దాని ద్వారా మంచి జరిగే అవకాశముంటుంది.
తెలంగాణలో మూడో సారి జరుగుతున్న ఎన్నికలివి. ప్రత్యేక రాష్ట్రం సాధించుకునేందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డామో అందరికీ తెలుసు. తెలంగాణను బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రలో కలిపారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్సే. అప్పుడు ఉద్యమాలను అణచివేసింది ఎవరు? 2004లో రావాల్సిన తెలంగాణ ఆలస్యంగా వచ్చింది. తెలంగాణలో జరిగిన తొలి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి భారాస వచ్చినపుడు కరెంటు సమస్య ఉంది. నేడు దాన్ని పరిష్కరించుకున్నాం. కులం, మతం బేధాలు లేకుండా అందర్నీ సమానంగా చూస్తూ ముందుకెళ్తున్నాం. అందుకే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతోంది.
గోదావరిపై సీతారామ ప్రాజెక్టు కట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్లివ్వొచ్చని ఏ కాంగ్రెస్ నేతా గతంలో ఆలోచన చేయలేదు. భారాస ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దాని నిర్మాణం ఇప్పటికే 70 శాతం పూర్తియింది. ఆ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ధరణి పోర్టల్‌తో గోల్‌మాల్‌కు ఆస్కారం లేదు. రైతుల పట్ల సానుభూతి లేని కాంగ్రెస్ నేతలు ధరణిని తీసేస్తామంటున్నారు. అదే జరిగితే రైతులకు రైతుబంధు సహా ఇతర పరిహారాలు ఎలా అందుతాయో చెప్పాలంటే కాంగ్రెస్ నేతల నుంచి సమాధానం లేదు. అందుకే ఏ పార్టీ వైఖరేంటి? వాళ్ల ఆలోచనా సరళి ఏంటి?అనేది చూడాలి’’ అని కేసీఆర్ కోరారు.
👉 – Please join our whatsapp channel here –