DailyDose

ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులతో ఎన్నికల ప్రచారం

ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులతో ఎన్నికల ప్రచారం

గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలకు చెందిన కొందరు నాయకులు హైదరాబాద్‌ శివారులోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులతో ప్రచారం చేయించుకుంటున్నారు. మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌, మహేశ్వరం, మల్కాజిగిరి నియోజకవర్గాల ప్రధాన పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన ప్రాంతాలకు వీరిని పంపుతున్నారు. 10 నుంచి 20 మంది విద్యార్థులున్న బృందాలకు ప్రత్యేక ప్యాకేజీలను ఇస్తున్నారు. రోజుకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేయిస్తున్నారు. అలా యువతీ యువకులు, ఇంజినీరింగ్‌ చదువుకుంటున్న విద్యార్థులు ఓట్లు వేస్తారన్న భావనతో ఉన్నారు.

వినూత్న తరహాలో..ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారానికి వెళ్తున్న విద్యార్థుల బృందాలు ఎక్కువగా మధ్య తరగతి వాసులు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, విద్యాసంస్థల పరిసర ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో వారి స్నేహితులు, అదే కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థుల ఇళ్లు, అపార్ట్‌మెంట్లకు వెళ్తున్నారు. భారీస్థాయిలో జెండాలు, ప్లకార్డులు, అభ్యర్థి పార్టీల కరపత్రాలు తీసుకెళ్లకుండా కొన్నింటిని మాత్రమే అక్కడికి తీసుకెళ్తున్నారు. తమ అభ్యర్థికే కచ్చితంగా మద్దతు ఇచ్చి ఓట్లు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు.

ప్రచారం కోసం వెళ్లిన ప్రాంతాల్లో అక్కడి సమస్యలను ప్రస్తావించి ఇవి పరిష్కారం అవ్వాలంటే తాము ప్రచారం చేస్తున్న అభ్యర్థికి ఓటేస్తే 2, 3 నెలల్లో పరిష్కారమవుతాయని చెబుతున్నారు.

రోడ్లు, విద్యుత్తు, ప్రజారవాణా అంశాలను ప్రస్తావించి మరింత మెరుగైన విధంగా సౌకర్యాలు కల్పించేలా ఎమ్మెల్యే అభ్యర్థికి మీ తరఫున వివరిస్తామని, సాధ్యమైనంత వేగంగా పనులు పూర్తవుతాయని హామీలిస్తున్నారు.

అపార్ట్‌మెంట్లకు తాగునీరు సరిగా రాకుంటే ఎమ్మెల్యే అభ్యర్థి దృష్టికి తీసుకెళ్లి ఆయన ఖర్చులతోనే పనులు చేయిస్తామంటూ వివరిస్తున్నారు.

ఓటర్లు.. ప్రాంతాలు.. విశ్లేషణ..

విద్యార్థులు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా ఓటర్ల మనోగతం, ఏయే ప్రాంతాల్లో ఎక్కువమంది ఓటర్లున్నారు.. అభ్యర్థులకు ఎంత అనుకూలం.. తదితర అంశాలనూ విశ్లేషించి నివేదికలు తయారు చేసి నేతలకు ఇస్తున్నారు. మేడ్చల్‌ జిల్లాల్లో 2 నియోజకవర్గాల ప్రధాన పార్టీ అభ్యర్థులు.. ప్రచారానికి 2 వేల మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులను వినియోగించుకుంటున్నారు. 5 పోలింగ్‌ కేంద్రాలకు ఒక విద్యార్థుల బృందాన్ని నియమించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఆ బృందం ఓటర్ల వద్దకు వెళ్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z