రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలివ్వాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీలకు నోటీసులు ఇచ్చింది. బుధవారం సాయంత్రం 5గంటల్లోగా పార్టీలకు అందిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సీల్డ్ కవర్‌లో అందించాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులకు ఈసీ నోటీసులు పంపించింది. ఈనెల 2న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నోటీసులు ఇచ్చినట్లు ఈసీ పేర్కొంది. నవంబరు 3న తొలుత నోటీసులు ఇచ్చిన ఈసీ.. వివరాలు పంపాలని తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది.
రాజకీయ పార్టీల నిధుల సమీకరణలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం లక్ష్య సాధనలో కొన్ని సమస్యలున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ పథకం గోప్యత, విశ్వసనీయత కొందరికే పరిమితమవుతోందని పేర్కొంది. ఎస్‌బీఐ వద్ద ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా ఏ రాజకీయ పార్టీకి, ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్నది అధికారంలో ఉన్న వారు తెలుసుకోగలరని పేర్కొంది.
👉 – Please join our whatsapp channel here –