దీపావళికి నగరవాసులు టపాసుల మోత మోగించారు. అధిక శబ్దం, కాలుష్యాన్ని వెదజల్లే టపాసులను తగ్గించుకోమని పర్యావరణవేత్తలు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. థౌజండ్‌వాలా, ఫైవ్ థౌజండ్‌వాలా, లక్ష్మీ ఔట్లు, తదితర పెద్ద శబ్దాలను వెలువరించే వాటిని ఎక్కువ మంది కాల్చారు. ఫలితంగా పండగ రోజు గత ఏడాది కంటే ఎక్కువగా శబ్దాలు నమోదయ్యాయి. గాలిలో ధూళి కణాల పరిమాణం బాగా పెరిగింది. గాలి నాణ్యత కూడా పడిపోయింది. ప్రతి ఏటా దీపావళికి ముందు, పండగ రోజు కాలుష్య నియంత్రణ మండలి గాలి నాణ్యత, శబ్ద తీవ్రతను కొలుస్తుంది. బెంజ్ సర్కిల్, ఐఎంఏ, యనమలకుదురులో పరిశీలించారు. గత ఏడాదితో పోలిస్తే గణాంకాలు బాగా ఎగబాకాయి.
‘‘పండగ ముందు ఈనెల 6న, దీపావళి సందర్భంగా ఆదివారం (12న) సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు శబ్ద, వాయు కాలుష్యాన్ని పీసీబీ నమోదు చేసింది. పండగ ముందు కన్నా.. దీపావళి రోజు కాలుష్య కారకాలైన సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్‌లు గాలిలో కలిసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. లెక్కించిన ఈ మూడు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ గతంతో పోలిస్తే.. 30 నుంచి 40 శాతం వరకు పెరిగింది. ఈ సూచీ ఎంత పెరిగితే అంత గాలిలో స్వచ్ఛత తగ్గినట్లుగా పరిగణిస్తారు. అన్ని చోట్లా సల్ఫర్ డయాక్సైడ్ దాదాపు రెట్టింపు మోతాదులో గాలిలో కలిసింది. శబ్ద తీవ్రత కూడా 9 శాతం మేర పెరిగింది. ఈ గణాంకాలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి.
అధిక మోతాదుతో అనర్థాలే
శబ్ద కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాలలో ఎక్కువ సమయం ఉంటే.. వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. ఉన్నట్లుండి పెద్ద శబ్దాలు వింటే రక్తపోటు పెరగుతుంది. గుండెల్లో దడగా ఉంటుంది.
ప్రతి 10 డెసిబుల్స్ ప్రభావం పెరిగే కొద్దీ ఆ శబ్దం రెండు రెట్లు అధికంగా చెవికి వినిపిస్తుంది.
కేవలం మనుషులకే కాదు.. పక్షులు, జంతువులపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. టపాసుల నుంచి వెలువడే అధిక కాంతి, శబ్దాల కారణంగా పక్షులు సురక్షిత ప్రాంతానికి తమ ఆవాసాల నుంచి భయంతో వెళ్లిపోతాయి. ఇవి తిరిగి వెనక్కి రావు. జీవ వైవిధ్యానికి ఇది చేటు.
వాయు కాలుష్యంతో ఊపరితిత్తుల ఇన్‌ఫెక్షన్, శ్వాస కోశ వ్యాధులు వస్తున్నాయి. చిన్నారులలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దుమ్ము, ధూళి, రసాయన అవశేషాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్తున్నాయి.
👉 – Please join our whatsapp channel here –