Politics

నేటి నుంచి 3 రోజులు టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశాలు

నేటి నుంచి 3 రోజులు టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశాలు

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌ అయిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి రెండు పార్టీలో.. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నప్పుడు.. ఆయన్ని ములాఖత్‌లో కలిసి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. ఇక అప్పటి నుంచి రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణపై కసరత్తు సాగిస్తున్నాయి.. రాష్ట్రస్థాయిలో ఇప్పటికే టీడీపీ-జనసేన ఉమ్మడి సమావేశాలు జరగగా.. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ – జనసేన పార్టీల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు.. 14, 15, 16 తేదీల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.. నియోజకవర్గ స్థాయిలో ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు.. ఇక, ఈ నెల 17వ తేదీ నుంచి చేపట్టే ఇంటింటి ప్రచారంపై సమీక్ష చేపట్టనున్నారు నేతలు.

టీడీపీ – జనసేన మినీ మేనిఫెస్టోపై ప్రజల్లో అవగాహన కల్పించే అంశంపై చర్చ కూడా టీడీపీ – జనసేన పార్టీల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాల్లో చర్చిస్తారు.. ఇప్పటికే 11 అంశాలతో మినీ మేనిఫెస్టోను సిద్దం చేసింది టీడీపీ – జనసేన.. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలను సిద్దం చేసుకోనున్నారు.. ఓటర్ వెరిఫికేషన్‌ పై ఫోకస్‌ పెట్టేలా కార్యాచరణ రూపొందించబోతున్నారు.. మరోవైపు.. ఇవాళ్టి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జనసేన నేతలు వరుస ప్రెస్‌మీట్లు నిర్వహించనున్నారు.. వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో వివిధ అంశాల్లో కుంభకోణాలు జరిగాయంటూ వరుస ప్రెస్ మీట్లు పెట్టబోతున్నారు.. టోఫెల్, ఐబీ ఒప్పందాలు, జగనన్న పాల వెల్లువలో అవినీతి జరిగిందంటూ ఇప్పటికే జనసేన ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z