సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్ అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ఆయన మరణం దాదాపు మూడు కోట్ల మంది పెట్టుబడిదారులు చేసిన మదుపుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. సహారా ఇండియా గ్రూప్ సంస్థ వెబ్సైట్ ప్రకారం.. ఈ సంస్థకు 9 కోట్ల మంది పెట్టుబడిదారులు, వినియోగదారులు ఉన్నారు. రూ.2.59 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వేల క్యాంపస్‌లు, 30,970 ఎకరాల భూములు ఉన్నట్లు సహారా ఇండియా వెబ్సైట్ చెబుతోంది.
సెబీ చర్యల కారణంగా సుబ్రతా రాయ్ నిర్మించుకున్న సామ్రాజ్యం పతనం అవడం మొదలైంది. సహారా సంస్థ రియల్ఎస్టేట్ పెట్టుబడుల కోసమంటూ మూడు కోట్ల మందికి పైగా పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ.25వేల కోట్ల రూపాయలను సమీకరించడంపై కేసు నమోదైంది. 2011లో ఇన్వెస్టర్ల డబ్బును తిరిగి చెల్లించాలని సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్‌ఐఆర్‌ఈఎల్), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్‌హెచ్‌ఐసీఎల్) అనే రెండు సంస్థలను సెబీ ఆదేశించింది.
అందుకు సంబంధించిన వివరాలు అడిగిన నేపథ్యంలో సహారా గ్రూప్ నుంచి 127 ట్రక్కులను సెబీ కార్యాలయానికి పంపి సుబ్రతా రాయ్ వార్తల్లో నిలిచారు. ఆ ట్రక్కుల్లో మూడు కోట్ల దరఖాస్తు పత్రాలు, రెండు కోట్ల రిడంప్షన్ ఓచర్లు ఉన్నాయి. నిర్ణత గడువులోగా రూ.10 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోతే 2014 మార్చి 4న సుబ్రతా రాయ్ జైలుకి వెళ్లారు. రూ.5 వేల కోట్లు నగదు రూపంలో, మిగతా రూ.5 వేల కోట్లు బ్యాంకు గ్యారంటీ రూపంలో హామీ ఇస్తేనే ఆయన విడుదల సాధ్యమవుతుందని కోర్టు స్పష్టం చేసింది. రాయ్ రెండేళ్ల జైలు జీవితం అనంతరం పెరోల్‌పై విడుదలయ్యారు.
ఇదీ చదవండి: ‘ఎక్స్’ సమాచారాన్ని నమ్మలేం.. జిమ్మీ వేల్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
సెబీకు దాదాపు రూ.25వేల కోట్లు డిపాజిట్ చేసినట్లు గతంలో సుబ్రతారాయ్ ప్రకటించారు. కానీ కంపెనీ పెట్టుబడిదారులకు సెబీ తిరిగి సొమ్ము చెల్లించలేదని రాయ్ ఆరోపించారు. సెబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2023 మార్చి 31 నాటికి పెట్టుబడిదారులకు ఇచ్చేందుకు మొత్తం రూ.25,163 కోట్లు నిర్ణయించినప్పటికీ రూ.138 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించింది. రెండు సహారా గ్రూపు సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి భారీగా డబ్బు సేకరించేటప్పుడు వివిధ నిబంధనలను ఉల్లంఘించారు. మార్చి 31 నాటికి తమకు 20వేల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. 17500 దరఖాస్తులకు సంబంధించిన డబ్బును వాపసు చేశామని సెబీ తెలిపింది. సరైన రుజువులు సమర్పించని కారణంగా మిగతావాటిని చెల్లించలేదని వివరించింది. సెబీ లేవనెత్తిన ప్రశ్నలపై బాండ్ హోల్డర్ల నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడంతో వాటిని నిలిపేసినట్లు సమాచారం.