ఇంద్రకీలాద్రి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.లక్ష పైబడి విరాళం ఇచ్చే దాతలకు దేవస్థానం జారీ చేసే డోనర్ కార్డులు క్లోనింగ్ జరుగుతున్న వ్యవహారం తాజాగా బయట పడింది. డోనర్ కార్డులను కలర్ జిరాక్స్‌లతో నకిలీవి తయారుచేసి, వాటితో కొంతమంది భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నా టికెట్ల ఆదాయం అంతంత మాత్రంగా రావడంతో దుర్గగుడి ఈఓ కె.ఎస్.రామారావు టికెట్ల విక్రయాలపై దృష్టి పెట్టాలని ఆలయ అధికారులను ఆదేశించారు. దీంతో కొద్ది రోజులుగా టికెట్ల విక్రయాలు, చెకింగ్ పాయింట్‌లో ఏఈఓ చంద్రశేఖర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.
రెండు రోజుల క్రితం గాలి గోపురం వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన స్కానింగ్ పాయింట్ లో ఈవో చంద్రశేఖర్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కుటుంబం డోనర్ కార్డును తీసుకుని రూ.500 క్యూలైన్లో దర్శనానికి విచ్చేసింది. ఆ కార్డు దేవస్థానం జారీ చేసిన కార్డుకు భిన్నంగా ఉండటంతో ఏఈఓకు అనుమానం వచ్చింది. కార్డులో ఉన్న దాతల ఫొటోలతో భక్తుడి ఫొటో సరిపోలకపోవడంతో ఆరా తీశారు. తొలుత కార్డు తమదేనని ఆ కుటుంబం నమ్మించే ప్రయత్నం చేసింది. గట్టిగా నిలదీయడంతో తమకు తెలిసిన వారు ఈ కార్డు ఇచ్చి దర్శనానికి పంపారని చెప్పడంతో భక్తుల నుంచి కార్డును స్వాధీనం చేసుకున్నారు. మరో అర్ధగంట తర్వాత ఇదే రీతిలో అంతకు ముందు భక్తుడు తీసుకొచ్చిన డోనర్ కార్డు మరొక కలర్ జిరాక్స్ స్కానింగ్ పాయింట్ వద్దకు వచ్చింది. దీంతో భక్తులను నిలదీయగా, తొలుత వచ్చిన వారు చెప్పిన సమాధానమే చెప్పడంతో ఆలయ అధికారులు విస్తుపోయారు.
ఒకే దాత పేరుతో ఉన్న కార్డులు రెండు వచ్చిన విషయాన్ని ఆలయ అధికారులు వెంటనే ఈఓ కె.ఎస్.రామారావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే అన్నదానం విభాగానికి చెందిన అధికారులతో సమావేశమై, దాతలకు ఇచ్చిన డోనర్ కార్డులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇకపై డోనర్ కార్డుపై దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడినీ టెంపుల్ ఇన్స్పెక్టర్, సూపరింటెండెంట్ వద్దకు పంపాలని, అక్కడ వారి వివరాలను నమోదు చేసుకున్న తర్వాతే దర్శనానికి అనుమతించాలని భావిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –