కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయం నుంచి జయపుర వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఎయిర్‌పోర్ట్ సమీపంలో పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. తెలంగాణ (Telangana) బిడ్డల ప్రాణాలు బలితీసుకున్న కాంగ్రెస్ (Congress) నాయకులకు స్వాగతమంటూ వాటిలో పేర్కొన్నారు. రాహుల్ గాంధీతోపాటు తెలంగాణ అమరులు శ్రీకాంత చారి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య పలువురి ఫొటోలను ప్రచురించారు.
కాగా, తెలంగాణ ఉద్యమంలో జరిగిన బలిదానాలను కాంగ్రెస్ పార్టీ మరోసారి దారుణంగా అవమానించింది. సారీ అన్న ఒక్క మాటతో అమరుల ఆత్మలు ఘోషించేలా చేసింది. తెలంగాణ ఉద్యమంతో ఆటలాడిన నాటి కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం.. మరోసారి తెలంగాణ అమరుల త్యాగాలను పూచికపుల్లలా తీసిపడేశారు. బలిదానాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించదని తేల్చి పడేశారు. ప్రజా ఉద్యమాల్లో ప్రజల మరణాలు సహజమని తేలిగ్గా చెప్పేశారు. ‘ఆత్మహత్య అనేది దురదృష్టకర ఘటన. ప్రజా ఉద్యమంలో కొంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అందుకు సారీ. కానీ ఆ ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించదు’ అని ప్రకటించారు.
నిజానికి తెలంగాణ ఉద్యమంలో వందలమంది తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలకు ఈ చిదంబరమే కారకుడు. 2009లో తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి.. అంతలోనే సమైక్యవాదుల లాబీయింగ్‌కు భయపడి వెనక్కు తీసుకొన్నారు. ఈ రెండు ప్రకటనలు చేసింది చిదంబరమే. ఆయన ప్రకటన వల్లనే నిర్వేదంలోకి వెళ్లిన అనేకమంది తెలంగాణ ఉద్యమకారులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఆ బలిదానాలపై కనీస విచారం వ్యక్తంచేయకుండా ‘సారీ’ అన్న ఒక్క మాటతో తేల్చిపడేశారు. నిజానికి తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలకు కేంద్రానికి ఎంత బాధ్యత ఉన్నదో.. చిదంబరానికి కూడా అంతే బాధ్యత ఉన్నది.
👉 – Please join our whatsapp channel here –