ఆంధ్రప్రదేశ్‌లోని డిగ్రీ, పీజీ విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.1,650 కోట్లు తక్షణమే విడుదల చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. విద్యాసంవత్సరం మొదలై నెలలు గడుస్తున్నా విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉంచడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను పరీక్షలు రాసేందుకు అనుమతించడం లేదన్నారు. చివరి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు జారీ చేయడం లేదన్నారు. పైచదువులు, ఉద్యోగ పరీక్షలు, ఇంటర్వ్యూలకి హాజరయ్యే విద్యార్థులు సర్టిఫికెట్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఫీజు బకాయిలు విడుదల చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
‘‘2020-21 విద్యా సంవత్సరానికి గాను రూ.600 కోట్లు, 2022-23కు రూ.600 కోట్లు ప్రభుత్వం కళాశాలలకు చెల్లించాల్సి ఉంది. నాలుగేళ్లుగా పీజీ కోర్సులకు సంబంధించి రూ.450 కోట్లు పెండింగ్‌లో ఉంది. తెదేపా ప్రభుత్వ హయాంలో పీజీ కోర్సులకి ఫీజులు చెల్లించాం. వైకాపా అధికారంలోకి వచ్చాక నిలిపేశారు. విద్యాదీవెన, వసతిదీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, వైకాపా ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క ఏడాదీ సకాలంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ చేయలేదు. ఫీజులు చెల్లించాలంటూ కాలేజీల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన అంటూ పేర్లు పెట్టి విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారే తప్ప.. వాటి వల్ల జరిగిన మేలు శూన్యం’’ అని లోకేశ్ విమర్శించారు.
👉 – Please join our whatsapp channel here –