Politics

ఐదు నియోజకవర్గాల్లో రాహుల్ నేడు ఎన్నికల ప్రచారం

ఐదు నియోజకవర్గాల్లో రాహుల్ నేడు ఎన్నికల ప్రచారం

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఒకేరోజు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. పినపాక, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, రాజేంద్ర నగర్‌లలో రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.55 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా నర్సంపేటకు చేరుకుంటారు. నర్సంపేట బహిరంగ సభలో పాల్గొని నర్సంపేట నుంచి హెలికాప్టర్‌లో 3.40 గంటలకు మామునూరు విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం వరంగల్‌ చౌరస్తా నుంచి జేపీఎన్‌ రోడ్డు, మండిబజారు మీదుగా పోచమ్మమైదాన్‌ వరకు పాదయాత్రలో పాల్గొంటారు.

ఆ తరువాత పోచమ్మమైదాన్‌ సెంటర్‌లో జరిగే కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. ఇక సాయంత్రం 5.15 గంటకు హెలికాప్టర్‌లో రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. ఈ ప్రచారం వరంగల్ తూర్పు నుండి పశ్చిమ వరకు కూడా నడుస్తుంది. ఇక్కడ ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం రాహుల్ హెలికాప్టర్ లో హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా జయపూర్ వెళతారు. మరోవైపు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో మల్లికార్జున్ ఖర్గే ఈరోజు ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 11 గంటలకు గాంధీభవన్ ఖర్గే చేరుకుంటారు. మధ్యాహ్నం 11-12 గంటల మధ్య టీపీసీసీ మేనిఫెస్టో కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు.

21వ తేదీ తర్వాత ప్రచారం…

తెలంగాణ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార గడువు ఈ నెల 21తో ముగియనుంది. దీని తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణలో ఐదు రోజుల పాటు ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కనీసం 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఇతర ఏఐసీసీ అగ్రనేతలు కూడా 21 తర్వాత తమ పూర్తి సమయాన్ని తెలంగాణకే కేటాయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.