Business

వ్యక్తిగత రుణాలపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం

వ్యక్తిగత రుణాలపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం

వ్యక్తిగత రుణాలకు (Personal loans) సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. పూచీకత్తు అవసరం లేని ఈ రుణాల విషయంలో బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలకు నిబంధనలను కఠినతరం చేసింది. ఈ తరహా రుణాల రిస్క్‌ వెయిట్‌ను (Risk weight) 25 శాతం పాయింట్లను పెంచింది. అయితే గృహ, విద్య, వాహన రుణాలు సహా కొన్ని కన్జూమర్‌ లోన్లను దీన్నుంచి మినహాయించింది. అలాగే, బంగారం, బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకూ ఈ రిస్క్‌ వెయిట్‌ వర్తించదు. ఆయా రుణాలకు 100 శాతం రిస్క్‌ వెయిట్‌ను కొనసాగించింది.

‘‘కమర్షియల్‌ బ్యాంక్స్‌ ఇచ్చే వినియోగ రుణాలపై సమీక్షించాక రిస్క్‌ వెయిట్‌ను పెంచాలని నిర్ణయించాం. 25 శాతం పాయింట్లను పెంచి 125 శాతానికి చేర్చాం. దీన్నుంచి గృహ, విద్యా, వాహన రుణాలను మినహాయిస్తున్నాం. బంగారం కుదువ పెట్టి తీసుకునే రుణాలకు ఈ మినహాయింపు వర్తిస్తుంది’’ అని ఆర్‌బీఐ గురువారం ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. హై రిస్క్‌ వెయిట్‌ అంటే.. నష్టభయం అన్నమాట. ఈ వెయిట్‌ను పెంచడం అంటే ఆ మేర ఈ కేటగిరీ రుణాలకు బ్యాంకులు బఫర్‌గా ఉంచే సొమ్మును మరింత కేటాయించాల్సి ఉంటుంది. ఓ విధంగా బ్యాంకులు ఈ తరహా రుణాలు జారీని పరిమితం చేయడం అన్నమాట.

కరోనా తర్వాత బ్యాంకింగ్‌ వ్యవస్థలో వేగంగా మార్పులు వచ్చాయి. ఫిన్‌టెక్‌ అంకురాలు కొత్త సాంకేతికతను మరింత అభివృద్ధి చేసి, క్షణాల్లో అప్పులు ఇచ్చేస్తున్నాయి. బ్యాంకులూ ఇదే పంథాను అనుసరిస్తున్నాయి. ఫలితంగా బ్యాంకుల రిటైల్‌ రుణాలు వేగంగా వృద్ధి చెందాయి. బ్యాంకులు అందిస్తున్న మొత్తం రుణాల్లో ఈ హామీ లేని రుణాల వాటా గత కొంతకాలంగా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్‌సెక్యూర్డ్‌ రుణాల విషయంలో బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సూచించారు. జులై, ఆగస్టు నెలల్లో ప్రధాన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల ఎండీ/ సీఈఓలతో నిర్వహించిన సమావేశంలో దీనిపై ఆందోళన వ్యక్తంచేశారు. హామీ లేని రుణాలు బాగా పెరుగుతున్నాయని, బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అంతర్గతంగా వీటిని కట్టడి చేసే విషయంపై దృష్టి పెట్టాలన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z