పాపం దక్షిణాఫ్రికా. ‘చోకర్స్’ అన్న ముద్రను పోగొట్టుకోవడానికి ఆ జట్టుకు ఇంకెంతకాలం పడుతుందో! సఫారీలది ఓ విషాద గాథ. 1992, 1999, 2007, 2015లోనూ సెమీఫైనల్లోనే ఆ జట్టు కథ ముగిసింది.
నిజానికి ఈసారి టోర్నీలో ఆ జట్టు దూకుడు చూస్తే కచ్చితంగా ఫైనల్ చేరుతుందని, భారత్‌ను తుదిపోరులో ఢీ కొడుతుందనే అనుకున్నారంతా! ధనాధన్ బ్యాటింగ్‌తో ఆ జట్టు అదరగొట్టింది. సెమీస్ ముందు వరకూ మొదట బ్యాటింగ్ చేసిన మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా చేసిన అత్యల్ప స్కోరు 311/7. అది కూడా ఆస్ట్రేలియాపై లీగ్ మ్యాచ్‌లో. అతి తక్కువ స్కోరే 311 అంటే మొదట బ్యాటింగ్‌లో ఆ జట్టు దూకుడు అర్థం చేసుకోవచ్చు. మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో 350కి పైగా పరుగులు సాధించింది.
ఛేదనకు దిగిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట్లో (నెదర్లాండ్స్, భారత్ చేతిలో) ఓడిపోయింది. ఛేదనలో అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌పై కష్టపడి నెగ్గింది. అందుకే టాస్ నెగ్గగానే సెమీస్‌లో మొదట బ్యాటింగ్ చేసింది. కానీ సూపర్ ఫామ్‌లో డికాక్, వాండర్‌డసెన్‌తో పాటు టాప్‌ఆర్డర్ విఫలమవడం జట్టును దెబ్బతీసింది. మిల్లర్ సెంచరీతో పోరాడినా విజయానికి సరిపడా పరుగులు చేయలేకపోయింది. బౌలర్లు జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. కానీ లక్ష్యం చిన్నది కావడంతో ఓటమి వైపు నిలవక తప్పలేదు. ఈ ప్రపంచకప్‌తో వన్డేలకు వీడ్కోలు పలికిన డికాక్.. నాలుగు సెంచరీలు సహా 594 పరుగులు చేశాడు. ఆఖరికి కన్నీళ్లతో దక్షిణాఫ్రికా మైదానం వీడటంతో సఫారీ అభిమానులూ నిరాశలో మునిగిపోయారు.
అయితే దక్షిణాఫ్రికా ఫైనల్ చేరాలని భారత అభిమానులూ కోరుకున్నారు. దాదాపు పూర్తిగా నిండిన స్టేడియంలో అత్యధిక శాతం భారత అభిమానులు దక్షిణాఫ్రికాకే మద్దతు తెలిపారు. మొదట టపటపా వికెట్లు పడితే స్టేడియం నిశ్శబ్దంగా మారింది. కానీ మిల్లర్ వీరోచిత సెంచరీతో జట్టును ఆదుకుంటే కేరింతలు మిన్నంటాయి. ఛేదనలో ఆసీస్ ఓపెనర్లు దంచేస్తుంటే మళ్లీ స్టాండ్స్‌లో చప్పుడు లేదు. సఫారీ వికెట్లు పడగొడుతూ, మ్యాచ్‌లో పోరాడుతుంటే మళ్లీ కేకలు. సఫారీ ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేసినప్పుడు, బౌండరీలు సమర్పించుకున్నపుడు మన అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. చివరకు ఆ జట్టు ఓడితే.. సఫారీ ఆటగాళ్లు, అభిమానులే కాదు మనవాళ్లూ బాధ పడ్డారు. అయితే మరోసారి సెమీస్‌లోనే ఓడినా.. ఈసారి దక్షిణాఫ్రికా ఆట అభిమానులను అలరించింది.
ప్రపంచకప్‌లో సెమీస్‌లో వెనుదిరగడం దక్షిణాఫ్రికాకు ఇది అయిదోసారి (1992, 1999, 2007, 2015, 2023). టీ20 ప్రపంచకప్ (2009, 2014)తో కలిపి ఇది ఏడోసారి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z