Business

ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌

ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌

టెక్‌ దిగ్గజం మెటాకు చెందిన సోషల్‌ మీడియా యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసే రీల్స్‌, ఫొటోలు, వీడియోలు కేవలం నచ్చిన వ్యక్తులే చూసేలా కొత్త ఆప్షన్‌ను పరిచయం చేసింది. ఇప్పటివరకు కేవలం ఇన్‌స్టా స్టేటస్‌ స్టోరీలకు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్‌.. ఇకపై ఫీడ్‌లోని పోస్టులకూ వర్తించనుంది. దీంతో పాటూ రీల్స్ కోసం ఎడిటింగ్ టూల్స్‌, పోస్ట్ ఫిల్టర్‌లు కూడా పరిచయం చేసింది.

సాధారణంగా ఇన్‌స్టా పోస్ట్‌ చేసే ఏ వీడియో, ఫొటో అయినా అందరూ చూడటానికి వీలుంటుంది. అదే ప్రైవసీలోని అకౌంట్‌ అయితే కేవలం ఫాలోవర్లు మాత్రమే చూడొచ్చు. అయితే ఇక ఫాలోవర్లతో సంబంధం లేకుండా మీరు షేర్‌ చేసే పోస్టులు నచ్చిన వ్యక్తులు మాత్రమే వీక్షించేలా కొత్త ఫీచర్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ తన యూజర్లకు తీసుకొచ్చింది. అంటే ఇకపై ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసే స్టోరీ, నోట్‌, రీల్‌ ముందు ‘Followers’ లేదా ‘Close friends’ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. వారికి మాత్రమే ఆ పోస్టులను వీక్షించి, కామెంట్‌ చేసే సదుపాయం ఉంటుంది.

అలాగే, యూజర్లు తమ ఫీడ్‌ను నచ్చినట్లుగా తీర్చిదిద్దటానికి వీలుగా ఇన్‌స్టాగ్రామ్‌ క్రాప్‌, రొటేట్‌ వంటి కొత్త రీల్స్‌ ఎడిటింగ్‌ టూల్స్‌ని యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో రీల్స్‌కు ఆడియో క్లిప్‌ని యాడ్‌ చేయొచ్చు. ఇంగ్లిష్‌లో పది కొత్త టెక్ట్స్‌-టు-స్పీచ్ వాయిస్‌లు, కొత్త టెక్ట్స్‌ ఫాంట్లను కూడా తీసుకొచ్చింది. దీంతో మీకు నచ్చిన భాషలో నచ్చిన ఫాంట్‌లో టెక్ట్స్‌ని ఎంచుకోవచ్చు. దానికి అవుట్‌లైన్‌ కూడా జోడించొచ్చు. నచ్చిన ఫొటోలు, వీడియోలను ఉపయోగించి సొంతంగా స్టిక్కర్లు క్రియేట్‌ చేసుకొనే ఫీచర్‌ని తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. వీటితో పాటూ అన్‌డూ, రీడూ టూల్స్‌ని త్వరలో జతచేయనుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z