DailyDose

కుంభకోణాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం- తాజా వార్తలు

కుంభకోణాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం- తాజా వార్తలు

* ఏపీలో కుంభకోణాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం

ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసి కక్ష పూరిత రాజకీయాలతో కాలం గడుపుతోందని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తే.. ఇతర పార్టీలతో సంబంధాలు అంటగట్టడం దారుణమన్నారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు కేంద్రమే నిధులిస్తోంది. వైకాపా ప్రభుత్వం సొంతంగా చేస్తున్న పని ఒక్కటీ లేదు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించడం విపక్షాల హక్కు. రాష్ట్రంలో గతుకుల రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు ఇవ్వడం లేదు. రోడ్ల పరిస్థితిపై సోషల్‌ మీడియాలో జోకులు వస్తున్నాయి. రైతులను వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో భాజపా, జనసేన కలిసే వెళ్తాయి. ఏపీలో కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది’’ అని పురందేశ్వరి అన్నారు.

* విద్యుత్ వినయోగంలో తెలంగాణ నంబర్ వన్ స్థానం

దళితబంధు, రైతుబంధు వంటి సంక్షేమ పథకాలను కరీంనగర్ గడ్డపైనే ప్రకటించామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించామని చెప్పారు. కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అనే నినాదం కరీంనగర్ నుంచే మొదలైందని తెలిపారు. కరీంనగర్ ఏ అభ్యర్థి గెలిస్తే.. రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. విద్యుత్ వినయోగంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని కేసీఆర్ చెప్పారు. తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ధరణితో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని అన్నారు. ఓటు వేసేటప్పుడు ఓటర్లు విజ్ఞత ప్రదర్శించాలని సూచించారు.కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణను 58 ఏళ్లు కష్టాల పాలుజేసిందని విమర్శించారు.

* అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తోన్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఇవాళే ఆయనకు రాష్ట్రానికి రావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో స్వల్ప మార్పులు జరిగాయి. మారిన షెడ్యూల్ ప్రకారం రేపు మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారని బీజేపీ తెలిపింది. అనంతరం 12.50 కు గద్వాల సభలో పాల్గొంటారు.అనంతరం అక్కడి నుంచి నల్గొండ, వరంగల్ సభల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి సాయంత్రం 6.10 గంటలకు హోటల్ క్షత్రియలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులతో సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 7:55 కి బేగంపేట విమానాశ్రయం నుంచి షా అహ్మదాబాద్ బయలుదేరనున్నారు. కాగా, మొదట షా రెండు రోజుల పర్యటన అని చెప్పి.. తాజాగా ఒక రోజుకి కుదించారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి శిలతోరణం వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు.నిన్న 62,494 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 27, 666 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.59 కోట్లు వచ్చిందని తెలిపారు.

వరంగల్ లో రాహుల్ పాదయాత్ర

తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ లో పర్యటించారు.  వరంగల్ చౌరస్తా నుంచి రుద్రమదేవి సర్కిల్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు.  పాదయాత్రలో జనాలను పలకరిస్తూ కేసీఆర్ ప్రభుత్వంలో వారు పడే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.  జనాలకు అభివాదం చేస్తూ.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని  సమస్యలన్నింటిని పరిష్కరిస్తామన్నారు. ఈ పాదయాత్రలో భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మధ్యలో ఛాయ్ షాపు యజమానితో ముచ్చటించి టీ తాగారు.  టీ దుకాణాల వారి సాదక బాధలు అడిగితెలుసుకున్నారు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చెలరేగిన హింస

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Madhya Pradesh Assembly Polls) హింస చెలరేగింది. పోలింగ్‌ సందర్భంగా రెండు వర్గాల ప్రజలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ సంఘటనలో ఒకరు గాయపడ్డారు. భద్రతా బలగాలు వెంటనే అక్కడకు చేరుకున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టాయి. మోరెనా జిల్లాలోని మిర్ఘన్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం డిమాని అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌లు 147, 148 వద్ద హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. ఈ రాళ్ల దాడిలో ఒకరికి గాయాలయ్యాయి.కాగా, భద్రతా సిబ్బంది వెంటనే ఆ పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరుకున్నారు. లాఠీఛార్జ్‌ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని పోలీస్‌ అధికారులు తెలిపారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.  మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 2533 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు 45 శాతం ఓటింగ్‌ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు.

* ఎన్నికలకు ఇక ఐదు నెలలు మాత్రమే:అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో ఓటర్ల లిస్ట్‌ కంటే వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టే ఎక్కువగా ఉందని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశం నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టి ఏం సాధించారని ప్రశ్నించారు. పాడి రైతుల ప్రగతికి కృషి చేస్తున్న నరేంద్ర.. రైతులపై దాడి చేయించారంటే ఎవరైనా నమ్ముతారా అని నిలదీశారు. సంగం డెయిరీని ఆక్రమించుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. ఇప్పుడు ఇలా అక్రమ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలకు ఇక ఐదు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయని.. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అని ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. రాష్ట్ర ప్రజలు వైకాపాను తన్ని తరిమేస్తారని అచ్చెన్న హెచ్చరించారు.

చంద్రబాబుపై ధ్వజమెత్తిన జగన్‌

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతా దోపిడినే జరిగింది.. ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదన్నారు. తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్‌ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చారంటూ పేర్కొన్నారు. త్వరలోనే ఎన్నికలు రానున్నాయి.. మోసం చేయడానికి మీ ముందుకు వస్తారు.. ఎన్నో హామీలు ఇస్తారు.. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజ్‌ కారు ఇస్తామంటారు.. నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. గతంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఏకమై ఇచ్చిన హామీలు నెరవేర్చారా? మీరే ఆలోచించాలని సూచించారు. తనకు ప్రజా దీవెనలు ఉన్నంత వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని మరోసారి స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్‌.ఇక, రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసా­యం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు సీఎం జగన్‌. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారం­భించడంతోపాటు అసైన్డ్‌ భూములకు యా­జమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు. చుక్కల భూములు, షరతుల గల పట్టా భూ­ములు, సర్వీస్‌ ఈనాం భూములను 22 ఏ జా­బితా నుంచి తొలగించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూము­లపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీని సీఎం జగన్‌ ఈ సభలో ప్రారంభించారు. శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ.. కొత్తగా డీకేటీ పట్టాలను అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపిన ఆయన..చుక్కుల భూములకు సైతం పరిష్కారం చూపించామని, అసైన్డ్‌ భూములు, లంక భూములకు భూ హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. భూ తగాదాలకు పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్‌డేట్‌ చేస్తున్నామన్నారు.మరోవైపు, ప్రజలకు మంచి చేసి చంద్రబాబు సీఎం కాలేదు. చంద్రబాబుకు మంచి చేద్దామనే ఆలోచనే లేదు. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడీనే. బాబు హయాంలో అందరినీ మోసం చేశాడని మండిపడ్డారు సీఎం జగన్‌.. చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తు తెచ్చుకోవాలని సూచించిన ఆయన.. ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నారని సీఎం జగన్‌ మండిపడ్డారు సీఎం వైఎస్‌ జగన్‌.

వరల్డ్ కప్ ఫైనల్ ను ప్రత్యక్షముగా వీక్షించడానికి  రానున్న సినీ ప్రముఖులు

ఆదివారం అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో ఎంతో ఆర్భాటంగా జరగనున్న వన్ డే వరల్డ్ కప్ ఫైనల్ ను ప్రత్యక్షముగా వీక్షించడానికి దేశంలోని చాలా మంది పొలిటికల్, మూవీ స్టార్స్ రానున్నారు. ఈ మ్యాచ్ ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ కానుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మ్యాచ్ ను చూడడానికి మోదీ ఎలాగో రానున్నారని ఇప్పటికే వైరల్ అయిన విషయం తెలిసిందే. అదే విధంగా సినీ ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్ రానుండగా, సౌత్ ఇండస్ట్రీ నుండి రజినికాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్, వెంకటేష్, నాగార్జున మరియు రామ్ చరణ్ లు విచ్చేయనున్నారు.ఇక తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన వెంకటేష్, నాగార్జున మరియు రామ్ చరణ్ లు వస్తున్నారు కాబట్టి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వీరిని చూడడానికి, మరి వీరిదరి రాకతో ఆశీస్సులు ఇండియా టీం కు అంది కప్ ను అందుకోవాలని కోరుకుందాం.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z