ఈ సాంకేతక యుగంలో పెను సంచలనంగా మారిన కృత్రిమ మేధస్సు(Artificial Intelligence) ఆధారిత టెక్నాలజీ చాట్‌జీపీట్(ChatGPT)ని రూపొందించిన శామ్ ఆల్ట్‌మన్(Sam Altman)ను సీఈవో బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్‌ఏఐ(OpenAI) సంస్థ నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్(Microsoft) ఆర్థిక మద్దతు గల ఓపెన్‌ఏఐ సంస్థ ఆయనను విశ్వసించకపోవడమే కారణమని ఒక ప్రకటనలో తెలిపింది. అతడి స్థానంలో తాత్కాలికంగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిరా మురాటీ సీఈవోగా వ్యవహరిస్తారని కంపెనీ ప్రకటించింది. ఆల్ట్‌మన్ తొలగింపు నిర్ణయం టెక్ వర్గాల్లో సంచలనంగా మారింది.
ఓపెన్‌ఏఐ సంస్థ బోర్డు శుక్రవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.‘‘ఆల్ట్‌మన్ బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదు. సరైన సమాచారం పంచుకోవడం లేదు. బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడు. ఓపెన్‌ఏఐ(OpenAI)కి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డుకు ఇక ఏమాత్రం నమ్మకం లేదు’’అని ప్రకటించింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ నిర్ణయంపై ఆల్ట్‌మన్ ఎక్స్‌వేదికగా స్పందించారు. ‘‘ఓపెన్‌ఏఐ సంస్థలో పనిచేయడాన్ని ఎంతో ఇష్టపడ్డాను. వ్యక్తిగతంగా నేను మారడానికి, ప్రపంచాన్ని కొంచెం మారిందనడానికి నేను నమ్ముతున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఎంతో మంది ప్రతిభావంతులైన వారితో పనిచేయడాన్ని ఇష్టపడ్డాను’’ అని పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే చాట్‌జీపీటీని ఇటీవల కాలంలో పరిచయం చేసినప్పుడు ప్రపంచమంతా నివ్వెరపోయింది. ఈ చాట్‌బోట్(Chatbot) సహాయంతో కేవలం సెకన్లలోనే మనకు కావాల్సిన కచ్చితమైన సమాచారాన్ని పొందవచ్చు. చాట్‌జీపీటీ ఉపయోగాలు ఎన్ని ఉన్నప్పటికీ అంతే సంఖ్యలో నష్టాలు సైతం ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. పలు రంగాల్లో ఉద్యోగాలు పోతాయని తెలిపారు. ఆల్ట్‌మన్ సైతం ఏఐతో పెనుప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. చాట్‌జీపీటీ కన్నా పవర్‌ఫుల్ ఏఐని డెవలప్ చేయగల సత్తా ఓపెన్‌ఏఐకి ఉన్నా.. ఇప్పటికిప్పుడే విడుదల చేసేందుకు తాము సుముఖంగా లేమని గతంలో ఆయన అన్నారు. యూజర్లు కూడా అందుకు సిద్ధంగా లేరని, తద్వారా తలెత్తే పరిణామాలను ఊహించడం కూడా కష్టమని గతంలో ఆల్ట్‌మన్ చెప్పారు. ఇక ఓపెన్‌ఏఐ సంస్థకు వెన్నెముకగా ఉన్న మైక్రోసాఫ్ట్ బిలియన్లలో పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం దీన్ని తన సెర్చ్ ఇంజిన్ బింగ్‌లో వాడుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –