Politics

ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు

ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు

కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రజలకు ఏ ఒక్క పథకమూ అందడం లేదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఖజానా ఖాళీ అయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే చెబుతున్నారన్నారు. కర్ణాటక మోడల్‌ అని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అక్కడ ఐదు గ్యారంటీలు అమలు చేయలేని వారు.. తెలంగాణలో ఆరు అమలు చేస్తామంటే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే గుండెపోటు గ్యారెంటీ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి హరీశ్‌ మాట్లాడారు.

కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రజలకు నిత్యనరకం
‘‘మూడు నెలల క్రితం కర్ణాటకలో కాంగ్రెస్‌ నాయకులు అరచేతిలో వైకుంఠం చూపారు. వారి మాటలు నమ్మి ఓటేసిన ప్రజలు అక్కడ నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ‘శక్తి’ పథకంలో శక్తి లేదు. గృహలక్ష్మి పథకంలో లక్ష్మి లేదు. అన్న భాగ్య పథకంలో అన్నం లేదు. గృహజ్యోతి పథకంలో జ్యోతి లేదు. ఈ హామీలు ఇచ్చిన రాహుల్‌ గాంధీ రాంరాం చెప్పివెళ్లిపోయారు. ప్రియాంక గాంధీ పత్తాలేరు. దిల్లీ పార్టీలను నమ్ముకుంటే ఇలాగే జరుగుతుంది. నిధులలేమితో కర్ణాటకలో విద్యార్థుల స్కాలర్‌షిప్పులు తగ్గిస్తున్నారు. దాంతో ఉన్నత విద్య చదువుతున్న తల్లిదండ్రులపై భారం పడుతోంది. అందుకే తెలంగాణ విద్యార్థులు, యువత ఆలోచించాలి.

ఇప్పుడు వన్‌ఛాన్స్‌.. అధికారంలోకి వచ్చాక ఎక్స్‌క్యూజ్‌మీ ప్లీజ్‌..
పాత రోడ్లకు మరమ్మతులు చేయడానికే నిధుల్లేవని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఎమ్మెల్యేలు నిధులు అడగొద్దని అంటున్నారు. అభివృద్ధి పనులకు నిధులివ్వకపోతే మేమెలా ప్రజల్లోకి వెళ్లాలని 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర సీఎంకు లేఖ రాశారు. నియోజకవర్గాలకు వెళ్తే ప్రజలు నిలదీస్తారని తెలిసి వారు బెంగళూరు విడిచి వెళ్లడం లేదు. ఆరునెలల్లోపే 350 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌లు మార్చే వారు లేక రైతులు అల్లాడిపోతున్నారు. తెలంగాణలో పదేళ్ల కేసీఆర్‌ పాలనలో నేను రైతును అని గర్వంగా చెప్పుకొనే స్థాయికి వచ్చాం. రైతులకే డబ్బులు చెల్లించేలా రైతుబంధు తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్‌. కాంగ్రెస్‌ నేతలు వన్‌ ఛాన్స్‌ అని వస్తారు. అధికారంలోకి వచ్చాక ఎక్స్‌క్యూజ్‌మీ ప్లీజ్‌ అంటారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మళ్లీ కేసీఆర్‌కే పట్టం కట్టాలి’’ అని హరీశ్ పిలుపునిచ్చారు.

కొరడాతో కొట్టినా మీ పాపం పోదు
ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం భారాసపై చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు వేసిన అమెరికా.. స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో మందిని కాల్చి చంపిన డయ్యర్‌ సారీ చెప్పినట్లు ఉంది. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసిన బిడ్డల తల్లిదండ్రులు కొరడాతో కొట్టినా మీ పాపం పోదు’’ అని హరీశ్‌ వ్యాఖ్యానించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z